యుద్ధానికి తెర దించేందుకు..రష్యా రెడీ! | Putin Ready to End Ukraine-Russia War | Sakshi
Sakshi News home page

యుద్ధానికి తెర దించేందుకు..రష్యా రెడీ!

Published Sat, Nov 23 2024 4:22 AM | Last Updated on Sat, Nov 23 2024 4:22 AM

Putin Ready to End Ukraine-Russia War

లక్షలాదిగా సైనికుల బలి.. క్షతగాత్రులు అంతకు రెట్టింపు

భారీగా ఆర్థిక, సాయుధ నష్టం

దాంతో పునరాలోచనలో పుతిన్‌

ఉక్రెయిన్‌ నుంచి భారీ భూభాగం

దానికి నాటో సభ్యత్వం ఇవ్వరాదు

ఈ డిమాండ్లు నెరవేర్చాలని పట్టు

రెండున్నరేళ్లు దాటిన యుద్ధం. కనీవినీ ఎరగని విధ్వంసం. ఇరువైపులా లెక్కకైనా అందనంత ఆస్తి, ప్రాణనష్టం. యుద్ధంలో నిజమైన విజేతలంటూ ఎవరూ ఉండరని ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నిరూపిస్తోంది. అగ్ర రాజ్యపు అపార ఆర్థిక, సాయుధ సంపత్తి ముందు ఏ మూలకూ చాలని ఉక్రెయిన్‌ యుద్ధంతో కకావికలైంది. ఆర్థికంగా, సైనికంగా మాత్రమే గాక జనాభాపరంగా, అన్ని రకాలుగానూ దశాబ్దాలు గడిచినా కోలుకోలేనంతగా నష్ట పోయింది. 

అమెరికా, యూరప్‌ దేశాల ఆర్థిక, సాయుధ దన్నుతో నెట్టుకొస్తున్నా ట్రంప్‌ రాకతో ఆ సాయమూ ప్రశ్నార్థకంగా మారేలా కన్పిస్తోంది. అదే జరిగితే చేతులెత్తేయడం మినహా దాని ముందు మరో మార్గం లేనట్టే. ఇంతటి యుద్ధం చేసి రష్యా కూడా సాధించిన దానికంటే నష్టపోయిందే ఎక్కువ. అందులో ముఖ్యమైనది సైనిక నష్టం. యుద్ధంలో ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి! 

దీనికి తోడు కనీసం మరో 5 లక్షల మంది సైనిక విధులకు పనికిరానంతగా గాయపడ్డట్టు సమాచారం. ఇది ఆ దేశానికి కోలుకోలేని దెబ్బే. యువతను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకునే ప్రయత్నాలూ పెద్దగా ఫలించడం లేదు. యుద్ధ భూమికి పంపుతారనే భయంతో రష్యా యువత భారీ సంఖ్యలో వీలైన మార్గంలో దేశం వీడుతోంది. దాంతో సైనికుల కొరత కొన్నాళ్లుగా రష్యాను తీవ్రంగా వేధిస్తోంది. మరో దారి లేక సైన్యం కోసం ఉత్తర కొరియా వంటి దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి! 

దీనికి తోడు సుదీర్ఘ యుద్ధం కారణంగా ప్రధానమైన ఆయుధ నిల్వలన్నీ దాదాపుగా నిండుకోవడంతో రష్యాకు ఎటూ పాలుపోవడం లేదు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ఇంకా కొనసాగించే విషయంలో స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే రుజువైంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి ఏదో రకంగా తెర పడాలని ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా కోరుకుంటున్నట్టు సమాచారం. ఇటీవలి పుతిన్‌ ఉన్నత స్థాయి భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చిందంటున్నారు.

ఇవీ షరతులు...
→ భూతల యుద్ధంలో ఉక్రెయిన్‌ నుంచి రష్యా సైన్యానికి గతంలోలా కొన్నాళ్లుగా పెద్దగా ప్రతిఘటన ఎదురవడం లేదు.
→ దాంతో నెనెట్‌స్క్‌ తదితర ఉక్రెయిన్‌ భూభాగాల్లోకి రష్యా నానాటికీ మరింతగా చొచ్చుకుపోతోంది.
→ కానీ ఇందుకు చెల్లించుకోవాల్సి వస్తున్న సైనిక, ఆయుధ మూల్యం తదితరాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను ఆలోచనలో పడేసినట్టు వార్తలొస్తున్నాయి. ఏదోలా ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెర దించేందుకే ఆయన మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.
→ కొన్ని ప్రధాన షరతులకు ఉక్రెయిన్‌ అంగీకరించే పక్షంలో యుద్ధా్దన్ని నిలిపేసేందుకు పుతిన్‌ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
→ ఆక్రమిత ప్రాంతాలకు తోడు మరింత భారీ భూభాగాన్ని ఉక్రెయిన్‌ తమకివ్వాలని పుతిన్‌ పట్టుబడుతున్నారు.
→ అది కనీసం అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన వర్జీనియా పరిమాణంలో ఉండాలని కోరుతున్నారు.
→ ఉక్రెయిన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో సభ్యత్వం ఇవ్వరాదని డిమాండ్‌ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ డిమాండ్‌ను నాటో పరిగణనలోకే తీసుకోవద్దని కోరుతున్నారు. 

యుద్ధంలో మరణించిన రష్యా సైనికులు: 1.5 లక్షల నుంచి 2లక్షలు
గాయపడ్డ సైనికులు: 5 లక్షల పైచిలుకు

వామ్మో సైన్యం!
రష్యా యువతలో వణుకు
సైన్యంలో చేరడమనే ఆలోచనే రష్యా యువతకు పీడకలతో సమానం! కొత్తగా చేరేవారిని వేధించడంలో రష్యా సైనికుల ట్రాక్‌ రికార్డు సాధారణమైనది కాదు! రిటైరైన తర్వాత కూడా వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ వణికిపోయే పరిస్థితి! వాటి బారిన పడే బదులు బతికుంటే బయట బలుసాకైనా తినొచ్చని రష్యా యూత్‌ భావిస్తుంటారు. డెడొవ్‌షినా అని పిలిచే ఈ వేధింపుల జాఢ్యం ఇప్పటిది కాదు. రష్యా సైన్యంలో 17వ శతాబ్దం నుంచే ఉందని చెబుతారు. 

దీనికి భయపడి రష్యా యువత సైన్యంలో చేరకుండా ఉండేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తుంటుంది. ఉక్రెయిన్‌ యుద్ధంలో కనీవినీ ఎరగనంత సైనిక నష్టం జరుగుతుండటంతో భారీగా రిక్రూట్‌మెంట్‌కు రష్యా రక్షణ శాఖ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. యువతీ యువకులకు వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా సైన్యంలో చేరాలని పేర్కొనే ‘డ్రాఫ్ట్‌ నోటీస్‌’ పంపిస్తోంది. దాంతో సైనిక జీవితాన్ని తప్పించుకునేందుకు రష్యా యువత లక్షలాదిగా విదేశాల బాట పట్టారు.

 అలా వెళ్లలేని వారిలో చాలామంది ఫేక్‌ మెడికల్‌గా అన్‌ఫిట్‌ సర్టిఫికెట్లు సమర్పిస్తుంటారు. ఆ క్రమంలో అవసరమైతే తమ ఎముకలు తామే విరగ్గొట్టుకుంటారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! దాంతో చెచెన్యా, యకుట్జియా, దగెస్తాన్‌ వంటి సుదూర ప్రాంతాల నుంచి సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతను రక్షణ శాఖ కొన్నాళ్లుగా ప్రధానంగా టార్గెట్‌ చేస్తోంది. ఖైదీలను నిర్బంధంగా సైన్యంలో చేరుస్తోంది. ఇలాంటి వారిని సైన్యంలో దారుణంగా చూస్తున్నారు. 

చనిపోతే మృతదేహాలను గుర్తించి గౌరవప్రదంగా కుటుంబీకులకు అప్పగించే పరిస్థితి కూడా ఉండటం లేదు! దీనికి తోడు రష్యాలో మామూలుగానే సైనికులు దారుణమైన పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుంది. వారికి అత్యంత అవసరమైన పౌష్టికాహారానికే దిక్కుండదు! పైగా సరైన వైద్య సదుపాయమూ అందదు. సంక్షేమం దేవుడెరుగు, చివరికి సైనికుల భద్రతకు కూడా ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యమివ్వదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మామూలు సమయాల్లోనే పరిస్థితి ఇలా ఉంటుందంటే ఇక యుద్ధ సమయాల్లోనైతే సైనికుల భద్రత, సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ సర్కారు అక్షరాలా గాలికే వదిలేస్తుంది! 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement