Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు | Russia-Ukraine war: Sakshi special Story About Three years of Russia-Ukraine war | Sakshi
Sakshi News home page

Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు

Published Sun, Feb 23 2025 5:30 AM | Last Updated on Sun, Feb 23 2025 5:30 AM

Russia-Ukraine war: Sakshi special Story About Three years of Russia-Ukraine war

36 నెలలు గడిచినా ఆగని రష్యా, ఉక్రెయిన్‌ పోరు 

ఇరువైపులా లక్షలాది మంది సైనికుల మృతి 

ఆధునిక రణతంత్రంతో కొనసాగుతున్న యుద్ధం 

ట్రంప్‌ రాకతో యుద్ధ ముగింపుపై చిగురించిన కొత్త ఆశలు

ఉక్రెయిన్‌. రష్యా దురాక్రమణ జెండా ఎగరేసి దూసుకురావడంతో అస్థిత్వమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్న పొరుగుదేశం. అణ్వస్త్ర సామర్థ్యం, అమేయ సైన్యంతో కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ వస్తున్న రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్‌ యుద్ధంచేస్తూ శతథా ప్రయత్నాలు చేయబట్టి రేపటికి సరిగ్గా మూడేళ్లు. ఈ మూడేళ్లలో రష్యా కన్నెర్రజేసి వేలాది సైన్యంతో చేస్తున్న భీకర గగనతల, భూతల దాడుల్లో ఉక్రెయిన్‌లో సాధారణ ప్రజల వేలాది కలల సౌధాలు పేకమేడల్లా కూలి నేలమట్టమయ్యాయి. 

వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. శివారు గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మరణమృదంగం నిరాటంకంగా వినిపిస్తోంది. సైనికులు పిట్టల్లా రాలిపోయారు. మార్షల్‌ లా ప్రయోగించి జెలెన్‌స్కీ ప్రభుత్వం యువత మొదలు నడివయసు వారిదాకా దమ్మున్న వారందరినీ రణక్షేత్రంలోకి దింపి పోరాటం చేయిస్తోంది. దశాబ్దాల నాటి దౌత్య ఒప్పందాలను ఉల్లంఘించిందని, నాటోలో చేరాలనుకుంటోందని పలు సాకులు చూపి రష్యా సమరశంఖం పూరించింది. 

దీంతో హఠాత్తుగా యుద్ధంలో కూరుకుపోయినా ఉక్రెయిన్‌ తన మిత్రబృందం నుంచి అందుతున్న అధునాతన ఆయుధాలతో రష్యాను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ లక్షలాది మంది రష్యన్‌ సైనికులను నేలకూల్చింది. దీంతో అణ్వస్త్ర బూచి చూపించి భయపెడుతున్న పుతిన్‌కు యుద్ధాన్ని ఆపడమే ఉత్తమమని అగ్రరాజ్య నయా నాయకుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టెలీఫోన్‌ మంతనాలు చేయడంతో యుద్ధం మొదలైన మూడేళ్ల తర్వాత తొలిసారిగా కీలక మలుపు తీసుకుంది. వాస్తవానికి ఈ మలుపు తుది మలుపు అని, ట్రంప్‌ పట్టుదలతో యుద్ధాన్ని ఆపబోతున్నారని అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. 36 నెలల తర్వాత అయినా ఉక్రెయిన్‌ ఊపిరి పీల్చుకుంటుందో లేదోనని, యుద్ధప్రభావిత విపరిణామాలతో తిప్పలుపడుతున్న ఎన్నో ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

అత్యంత భీకర ఘర్షణ
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో వెలుగుచూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్‌ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కదనరంగంలోకి దింపింది. 

తొలిరోజుల్లో రాజధాని కీవ్‌దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్‌ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్‌ తొలినాళ్లలో యుద్ధంలో తడబడినా ఆ తర్వాత అగ్రరాజ్యం, యూరప్‌ దేశాల ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్‌ పటాలానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకుతీయక తప్పలేదు. దీంతో డ్రోన్లకు ఉక్రెయిన్‌ పనిచెప్పింది. దృఢత్వానికి చిరునామా అయిన అత్యంత ఖరీదైన వేలాది రష్యన్‌ యుద్ధట్యాంక్‌లను సైతం సులువుగా చవకైన డ్రోన్లతో పేల్చేసి జెలెన్‌స్కీ సేన పలు యుద్ధక్షేత్రాల్లో పైచేయి సాధించింది.  

18 శాతం ఆక్రమణ
అంతర్జాతీయ మీడియా కథనాలు, రష్యా, ఉక్రెయిన్‌ ఉన్నతాధికారులు పలు సందర్భాల్లో వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్‌లోని కేవలం 18 శాతం భూభాగాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగింది. కీవ్, లివివ్, డినిప్రో, ఒడెసా వంటి ప్రధాన నగరాలపై దాడి ప్రభావం లేదు. అమెరికా, ఇతర మిత్ర దేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందుతున్న భారీ ఆయుధాలే ఇందుకు ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు ఆయుధాలు, మందుగుండు, సైనిక ఉపకరణాలు, ఆర్థిక సాయం అందడంతోపాటు అంతర్జాతీయంగా లభిస్తున్న నైతిక మద్దతుతో రెట్టించిన ఉత్సాహంతో ఉక్రెయిన్‌ సైనికులు కదనరంగంలో ధైర్యంగా ముందడుగు వేయగల్గుతున్నారు. 

యుద్ధంలో రష్యా దాదాపు ఏకాకిగా మారింది. రహస్యంగా ఉత్తరకొరియా, చైనా, ఇరాన్‌ వంటి దేశాల నుంచి ఆయుధాలు, డ్రోన్లు తదితర ఆయుధాలు, కిరాయి సైనికులు తప్పితే రష్యాకు బయటి దేశాల నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. అమెరికా తదితర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షల కత్తి గుచ్చాయి. సొంత దేశంలోనూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్లు కోట్లలో ఉన్నారు. యుద్ధం కారణంగా విదేశీ వస్తువుల లభ్యత తగ్గి, డిమాండ్‌ పెరిగింది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి రష్యన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయుధం చేతికిచ్చి యుద్ధానికి పుతిన్‌ పంపిస్తాడన్న ముందస్తు అంచనాతో తొలినాళ్లలోనే వేలాది మంది యువ రష్యన్లు దేశం నుంచి పారిపోయారు. చివరకు ఖైదీలు, నిందితులను సైతం పుతిన్‌ సైన్యంలో చేరి్పంచుకుని ఉక్రెయిన్‌తో పోరాటం చేయిస్తున్నారు.

అన్ని రంగాలు తిరోగమనం 
నష్టాలు చెప్పకపోయినా అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్యంతో ఉక్రెయిన్‌ నష్టాలు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బాంబు దాడుల్లో ఆనకట్టలు, రహదారులు, భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, కర్మాగారాలు ఇలా మౌలికవసతుల వ్యవస్థ బాగా దెబ్బతింది. వ్యవసాయం తగ్గిపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఇలా ఎన్నో రంగాలు తిరోగమన పథంలో పయనిస్తున్నాయి. 

దేశ జీడీపీకి వందల బిలియన్‌ డాలర్ల నష్టం చేకూరింది. వాణిజ్య, పరిశ్రమ రంగానికి సంబంధించి దాదాపు రూ.15 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.5.8 లక్షల కోట్ల నష్టాలు వాటిల్లాయి. రవాణా, వాణిజ్యం, ఎగుమతులు, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్‌ పునర్‌నిర్మాణానికి వందల బిలియన్‌ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఓ అంచనా. ఉక్రెయిన్‌కు మిత్ర దేశాల నుంచి భారీ స్థాయిలో సాయం అందుతున్నా అది ఎక్కువగా సైనిక, రక్షణపర సాయమే తప్పితే సాధారణ ప్రజల జీవితాలను బాగుచేసేది కాదు. దీంతో యుద్ధంలో ఉక్రెయిన్‌ తన భూభాగాలను మాత్రమే కాదు భవిష్యత్తును కొంత కోల్పోతోందనేది వాస్తవం.  

ఉక్రెయిన్‌కు అపార ఆస్తినష్టం 
రష్యా వైపు సైనికులు, ఆయుధాల రూపంలో నష్టం కనిపిస్తుంటే ఉక్రెయిన్‌ వైపు అంతకుమించి ఆస్తినష్టం సంభవించింది. లక్షల కోట్ల రూపాయల విలువైన భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనావాసాలపై దాడులతో పెద్దసంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక దాదాపు లక్షకుపైగా ఉక్రెయిన్‌ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 4 లక్షల మంది సైనికులు గాయాలపాలయ్యారు. ఇక స్వస్థలాలు సమరక్షేత్రాలుగా మారడంతో లక్షలాది మంది స్వదేశంలోనే యుద్ధంజాడలేని సుదూర ప్రాంతాలకు తరలిపోయారు. 

పక్కనే ఉన్న పోలండ్, రొమేనియా దేశాలుసహా అరడజనుకుపైగా దేశాలకు దాదాపు 60 లక్షల మంది శరణార్థులుగా వలసవెళ్లారు. దాదాపు ఉక్రెయిన్‌ వైపు యుద్ధంలో ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా తెలీడం లేదు. అమెరికా సహా యూరప్‌ దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల్లోని ప్రధాన మీడియా సంస్థలు సైతం ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్‌ సైన్యం, పౌరుల్లో నైతిక స్థైర్యం సడలకూడదనే ఉద్దేశంతో యుద్ధ నష్టాలను తక్కువ చేసి చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

యుద్ధంలో రక్తమోడుతున్న రష్యా
అణ్వ్రస్తాలు లేకున్నా ఉక్రెయిన్‌తో యుద్ధం అంత తేలిక కాదని పుతిన్‌కు రానురాను అర్థమైంది. రష్యాకు తగ్గట్లు ఉక్రెయిన్‌ సైతం అధునాతన యుద్ధవ్యూహాలను అమలుచేస్తుండటంతో రష్యా వైపు నష్టం భారీగానే ఉంది. అంతర్జాతీయ యుద్ధ పరిశీలనా బృందాలు, సంస్థలు, వార్తాసంస్థల నివేదికలు, అంచనాల ప్రకారం యుద్ధంలో ఏకంగా 8,66,000 మంది రష్యా సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్‌ విషయంలో చూస్తే కేవలం లక్షకుపైగా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏకంగా 10,161 రష్యన్‌ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌ ధ్వంసంచేసింది.  

ఉక్రెయిన్‌లో ఎన్నికలొచ్చేనా?
రష్యా దాడులు మొదలెట్టగానే జెలెన్‌స్కీ తమ దేశంలో మార్షల్‌ లా ప్రయోగించారు. సైనికపాలన వంటి అత్యయిక స్థితి అమల్లో ఉన్న కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పట్లో ఎన్నికలు సాధ్యంకాదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలంటే పార్లమెంట్‌లో ఏకాభిప్రాయ నిర్ణయం ద్వారా మార్షల్‌ లాను తొలగించాలి. యుద్ధం జరుగుతుండగా మార్షల్‌ లాను చట్టప్రకారం తొలగించడం అసాధ్యం. దీంతో ఇప్పట్లో ఎన్నికలు కష్టమని భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా జెలెన్‌స్కీ జాతీయభావం, యుద్ధంలో రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నానని చెప్పి మళ్లీ అధికారం కైవసం చేసుకుంటారని విపక్ష పారీ్టలు విమర్శిస్తున్నాయి.  

యుద్ధంలో ట్రంప్‌కార్డ్‌ 
జెలెన్‌స్కీ మొండిపట్టుదలతో యుద్ధాన్ని ఇక్కడిదాకా తెచ్చారని సంచలన ఆరోపణలు చేసిన అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్‌ వడివడిగా తీసుకుంటున్న నిర్ణయాలు యుద్ధమేఘాలను శాశ్వతంగా తరిమేస్తాయన్న ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. తొలిసారిగా రష్యా విదేశాంగ మంత్రి స్థాయి కీలక నేతలతో ఇటీవల మొదలైన చర్చల ప్రక్రియను ఇప్పుడు యుద్ధంలో కీలకదశగా చెప్పొచ్చు. 

మంతనాలు మరింత విస్తృతస్థాయిలో జరిగితే మూడేళ్ల యుద్ధానికి ముగింపు ఖాయమనే విశ్లేషణలు పెరిగాయి. ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని, ఇప్పటి ‘వాస్తవాదీన రేఖ’నే అంగీకరిస్తూ జెలెన్‌స్కీని ఒప్పించాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు ఒప్పకోకపోతే మిత్రదేశాల నుంచి ఎలాంటి సాయం అందకుండా అడ్డుకుంటానని ట్రంప్‌ హెచ్చరించి జెలెన్‌స్కీని దారికి తెస్తారని భావిస్తున్నారు. అధునాతన ఆయుధాలతో దూసుకొస్తున్న రష్యా సేనలను అడ్డుకోవాలంటే ఉక్రెయిన్‌కు విదేశీ ఆయుధసాయం తప్పనిసరి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జెలెన్‌స్కీ అమెరికా పెట్టే షరతులకు ఒప్పకోక తప్పదని, యుద్ధం ఒక రకంగా ముగింపు దిశలో పయనిస్తోందని వార్తలొచ్చాయి.    

యుద్ధం అంకెల్లో.. 
చనిపోయిన రష్యా సైనికులు    8,66,000కుపైగా 
చనిపోయిన ఉక్రెయిన్‌ సైనికులు    1,00,000కుపైగా 
ఇప్పటిదాకా రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్‌ ప్రాంతం     18 శాతం 
సగటున రోజుకు రష్యా ఆక్రమణ రేటు    16.1 చదరపు కిలోమీటర్లు 
ఉక్రెయిన్‌కు యూరప్‌ దేశాల నుంచి అందిన ఆర్థిక సాయం    రూ. 14 లక్షల కోట్లు 
యూరోపియన్‌ యూనియన్‌ ఉక్రెయిన్‌కు ఇచ్చిన రుణాలు    రూ. 2 లక్షల కోట్లు

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement