అజోవ్‌స్తల్ స్టీల్ ఫ్యాక్టరీపై దాడి చేస్తున్న రష్యా యుద్ధ ట్యాంక్
ఐరాస/జపోరిజియా(ఉక్రెయిన్): ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధంపై, ఫలితంగా ఆ దేశంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. సమస్యకు తక్షణం శాంతియుత పరిష్కారం కనుగొనాలంటూ యుద్ధంపై తొలిసారిగా ఏకగ్రీవ ప్రకటన చేసింది. ఈ దిశగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చేస్తున్న ప్రయత్నాలకు 15 మంది సభ్యుల సమితి పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే ప్రకటనలో యుద్ధం అనే పదాన్ని వాడకుండా జాగ్రత్త పడ్డారు. రక్తపాతం ద్వారా ఏ పరిష్కారమూ దొరకదని, దౌత్యం, చర్చల ద్వారానే యుద్ధానికి ముగింపు పలకాలన్నది ముందునుంచీ భారత వైఖరి అని ఐరాసలో భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ ప్రతీక్ మాథుర్ పునరుద్ఘాటించారు.
మే 9 విక్టరీ డే సమీపిస్తున్న నేపథ్యంలో రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సిద్ధమవుతోంది. రెండో అతి పెద్ద నగరం ఖర్కీవ్‌ను రక్షణపరంగా దుర్భేద్యంగా మార్చేసింది. ఈ నగరాన్ని లక్ష్యం చేసుకుని రష్యా ఉన్నట్టుండి దాడులను తీవ్రతరం చేసింది. మారియుపోల్‌లో అజోవ్‌స్తల్ స్టీల్ ఫ్యాక్టరీపైనా దాడులను భారీగా పెంచింది. శుక్ర, శనివారాల్లో ప్లాంటు నుంచి 50 మందికి పైగా బయటపడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. తూర్పున డోన్బాస్‌లోనూ పోరాటం తీవ్రతరమవుతోంది. లెహాన్స్‌క్‌లో రష్యా బలగాలు బాగా చొచ్చుకెళ్లినట్టు సమాచారం. భాగస్వాములను కాపాడుకోలేని అమెరికా బలహీనత వల్లే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిందని అల్‌ఖైదా నేత అల్ జవహరీ విమర్శించారు. అమెరికా అగ్రరాజ్యం కాదు. దిగజారిపోతోంది’’ అన్నారు.
రొమేనియా సాయం సూపర్: జిల్
బుఖారెస్ట్: దాదాపు 10 లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థులను రొమేనియా ఆదుకున్న తీరు సాటిలేనిదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ కొనియాడారు. 4 రోజుల యూరప్ పర్యటనలో ప్రస్తుతం రొమేనియాలో ఉన్న ఆమె ఆదివారం మాతృ దినోత్సవాన్ని స్లొవేనియాలో ఉక్రెయిన్ సరిహద్దుల సమీప గ్రామంలో శరణార్థులతో గడపనున్నారు. రొమేనియా అధ్యక్షుని భార్య కామెరాన్ అయోహనిస్‌తో జిల్ భేటీ అయ్యారు.
వరల్డ్ చాంపియన్ మృతి
అంతర్జాతీయ యుద్ధ క్రీడల్లో ప్రపంచ చాంపియన్, రష్యా యుద్ధ ట్యాంకుల నిపుణుడు బటో బసనోవ్ (25) ఉక్రెయిన్ యుద్ధంలో మరణించాడు. అతని యుద్ధ ట్యాంకును ఉక్రెయిన్ దళాలు పేల్చేశాయి. గతేడాది జరిగిన వరల్డ్ ట్యాంక్ బయాథ్లాన్‌లో గంటకు 50 మైళ్ల వేగంతో కూడిన లక్ష్యాలను ఒక్కటి కూడా వదలకుండా ఛేదించి బసనోవ్ రికార్డు సృష్టించాడు. యుద్ధంలో 38వ కల్నల్‌ను రష్యా డోన్బాస్‌లో కోల్పోయింది. మరోవైపు, రష్యా ల్యాండింగ్ షిప్‌ను టీబీ2 డ్రోన్ సాయంతో స్నేక్ ఐలాండ్‌లో ముంచేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధరించిన ఖాకీ జాకెట్ లండన్‌లో జరిగిన వేలంలో 90 వేల డాలర్ల ధర పలికింది.
Comments
Please login to add a commentAdd a comment