రష్యా దాడులతో ధ్వంసమైన ఉక్రెయిన్‌లోని ఇర్పిన్ నగరంలో గుటెరస్
ఇర్పిన్: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా దాడులను తీవ్రం చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ముట్టడి విఫలమైన తర్వాత రష్యా తన దృష్టిని తూర్పు ఉక్రెయిన్‌వైపు మరలించింది. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు కీలకమైన పరిశ్రమలున్నాయి. దీన్ని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని రష్యా భావిస్తోంది. డోన్బాస్ ప్రాంతంలో రష్యా కాల్పులు అధికమయ్యాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మారియుపోల్‌లో ఇప్పటికీ ఉంటున్న పౌరులు మరిన్ని ఇక్కట్లు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆ నగరంలోని స్టీల్‌ప్లాంట్‌పై రష్యా దాడి ముమ్మరమైనట్లు శాటిలైట్ చిత్రాలు చూపుతున్నాయి.
మరోవైపు ఉక్రెయిన్‌లో ఐరాస చీఫ్ గుటెరస్ పర్యటన కొనసాగుతోంది. యుద్ధంలో అధిక మూల్యం చెల్లించేది చివరకు సామాన్య ప్రజలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధనేరాల గురించి మాట్లాడాల్సివస్తే, అసలు యుద్ధమే నేరమని చెప్పాలన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగిస్తామని బల్గేరియా కొత్త ప్రధాని భరోసా ఇచ్చారు. రష్యా పౌర నివాసాలపై దాడులకు దిగుతోందని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. తమ అధీనంలో ఉన్న ఖెర్సాన్ నగరంలో పేలుళ్లు జరిగాయని రష్యా తెలిపింది. పోరు కొనసాగించేందుకు తమకు మరిన్ని ఆయుధాలందించాలని ఉక్రెయిన్ మిత్ర దేశాలను కోరింది.
నాటో సాయం 800 కోట్ల డాలర్లు
ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు నాటో దేశాలు దాదాపు 800 కోట్ల డాలర్ల సాయం అందించాయని నాటో చీఫ్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. నాటోలో చేరాలనుకుంటే ఫిన్లాండ్, స్వీడన్‌ను సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు. రష్యాతో యుద్ధం సంవత్సరాలు కొనసాగినా, తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తామన్నారు. కొత్త శతాబ్దిలో యుద్ధాలు ఆమోదయోగ్యం కావని ఐరాస చీఫ్ గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధంలో నేరాలపై ఐసీసీతో విచారణకు తాను మద్దతిస్తానన్నారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను ఆయన సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment