Russia-Ukraine War: Putin Declares Victory in Ukraine Luhansk Province, Telugu - Sakshi
Sakshi News home page

Russia-Ukraine War: లుహాన్‌స్క్‌లో జెండా పాతేశాం: పుతిన్‌

Jul 5 2022 4:09 AM | Updated on Jul 5 2022 11:12 AM

Russia-Ukraine War: Putin Declares Victory in Ukraine Luhansk Province - Sakshi

పొక్రోవ్‌స్క్‌:   తూర్పు ఉక్రెయిన్‌లోని అత్యంత కీలకమైన డోన్బాస్‌లో భాగమైన లుహాన్‌స్క్‌ ప్రావిన్స్‌లో రష్యా విజయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సోమవారం ఖరారు చేశారు. లుహాన్‌స్క్‌లో జెండా పాతేశామని అన్నారు. ఈ ప్రాంతంపై రష్యా సైన్యం పూర్తిస్థాయిలో పట్టుబిగించడంతో ఉక్రెయిన్‌ సేనలు ఆదివారం వెనుదిరిగాయి. లుహాన్‌స్క్‌ను మన దళాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు అధ్యక్షుడు పుతిన్‌కు తెలియజేశారు.

లుహాన్‌స్క్‌ ప్రావిన్స్‌లో పెద్ద నగరమైన లీసిచాన్‌స్క్‌ రష్యా వశమయ్యిందని, అక్కడ ఆపరేషన్‌ పూర్తయ్యిందని పేర్కొన్నారు. కీలక ప్రాంతంలో విజయం దక్కడం పట్ల పుతిన్‌ హర్షం వ్యక్తం చేశారు. రష్యా సైన్యానికి లక్ష్యంగా మారకుండా లుహాన్‌స్క్‌ నుంచి ఉక్రెయిన్‌ సేనలు వెనక్కి మళ్లాయని స్థానిక గవర్నర్‌ సెర్హియి హైడై తెలిపారు. మరికొంత కాలం అక్కడే ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. దానికి అధిక మూల్యం చెల్లించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
 
లుహాన్‌స్క్‌లో దక్కిన విజయంతో రష్యా సైన్యం ఇక డొనెట్‌స్క్‌లోని సివీరెస్క్, ఫెడోరివ్‌కా, బఖ్‌ముత్‌ వైపు కదిలేందుకు సన్నద్ధమవుతోందని ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు తెలిపాయి. డొనెట్‌స్క్‌లో సగం భూభాగం ఇప్పటికే రష్యా నియంత్రణలో ఉంది. స్లొవియాన్‌స్క్, క్రామటోర్‌స్క్‌లో రష్యా వైమానిక దాడులు నానాటికీ ఉధృతమవుతున్నాయి. స్లొవియాన్‌స్క్‌లో తాజాగా రష్యా దాడుల్లో తొమ్మిదేళ్ల బాలిక సహా ఆరుగురు మరణించారు. 19 మంది క్షతగాత్రులయ్యారు. క్రామటోర్‌స్క్‌లోనూ రష్యా నిప్పుల వర్షం కురిపించింది. రష్యా దృష్టి మొత్తం ఇప్పుడు డొనెట్‌స్క్‌పైనే ఉందని బ్రిటిష్‌ రక్షణ శాఖ పేర్కొంది.   

పునర్నిర్మాణం.. ప్రపంచ బాధ్యత: జెలెన్‌స్కీ  
లుహాన్‌స్క్‌ నుంచి తమ దళాలు వెనుదిరగడం నిజమేనని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఆయుధాలు సమకూర్చుకొని, బలం పుంజుకుని పోరాటం కొనసాగిస్తామన్నారు. ఉక్రెయిన్‌ పునర్నిర్మాణం ప్రజాస్వామ్య ప్రపంచ ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లో సోమవారం ‘ఉక్రెయిన్‌ రికవరీ కాన్ఫరెన్స్‌’లో ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించారు. రష్యా దాడుల్లో దెబ్బతిన్న తమ దేశ పునర్నిర్మాణం అనేది స్థానిక ప్రాజక్టు లేదా ఒక దేశ ప్రాజెక్టు కాదని అన్నారు. ప్రజాస్వామ్య ప్రపంచంలో నాగరిక దేశాల ఉమ్మడి కార్యాచరణ అని వెల్లడించారు. రష్యాతో యుద్ధం ముగిసి తర్వాత తమ దేశ పునర్నిర్మాణానికి 750 బిలియన్‌ డాలర్లు అవసరమని ఉక్రెయిన్‌ ప్రధానమంత్రి అంచనా వేశారు. ఈ మేరకు రికవరీ ప్లాన్‌ రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement