ఉక్రెయిన్‌పై రష్యా సుఖోయ్ యుద్ధవిమానం క్షిపణి దాడి దృశ్యం
కీవ్/మాస్కో/వాషింగ్టన్: తూర్పు ఉక్రెయిన్‌లో పారిశ్రామికప్రాంతమైన డోన్బాస్‌పై రష్యా పట్టు బిగుస్తోంది. ఈ ప్రాంతంలో కీలకమైన సీవిరోడోంటెస్క్ శివార్లలోకి రష్యా దళాలు సోమవారం అడుగుపెట్టాయి. లీసిచాన్‌స్క్ దిశగా దూసుకెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఆయుధ సామగ్రిని ఇక్కడికి తరలిస్తున్నాయి. పుతిన్ సేనలు పెద్ద వ్యూహమే పన్నినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లుహాన్‌స్క్ ప్రాంతీయ గవర్నర్ సెర్గీ హైడై స్వయంగా ప్రకటించారు.
రష్యా సైన్యం దాడుల్లో తాజాగా ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు మరణించారని, ఐదుగురు గాయపడ్డారని చెప్పారు. డోన్బాస్‌లో మారియుపోల్ ఉదంతమే పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సీవిరోడోంటెస్క్ రష్యా దక్షిణ సరిహద్దుకు 143 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రస్తుతం ఇక్కడే కేంద్రీకృతమైంది. లుహాన్‌స్క్ ప్రావిన్స్‌లో ఉక్రెయిన్ అధీనంలో ఉన్న ప్రాంతాలు సీవిరోడోంటెస్క్, లీసిచాన్‌స్క్ మాత్రమే. లుహాన్‌స్క్, డోంటెస్క్‌ను కలిపి డోన్బాస్‌గా పిలుస్తారు. డోంటెస్క్, లైమాన్‌లోనూ రష్యా, ఉక్రెయిన్ దళాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
ఉక్రెయిన్‌లోని డోంటెస్క్, లుహాన్‌స్క్‌కి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. ఆ రెండు ప్రాంతాలను తాము స్వతంత్ర రాజ్యాలుగానే చూస్తున్నామని తెలిపారు. మైకోలైవ్ షిప్‌యార్డ్‌లో ఉక్రెయిన్ సైనిక వాహనాలను తాము ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ చెప్పారు. డోన్బాస్‌లో పరిస్థితి ఇప్పుడు మాటల్లో వర్ణించలేనంత తీవ్రంగానే ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఆయన రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లో సైనికులతో మాట్లాడారు.
మా వద్ద ఆ ప్రణాళిక లేదు: బైడెన్
ఉక్రెయిన్‌కు తాము ఆయుధాలు పంపించబోతున్నట్లు వస్తున్న వార్తనలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. లాంగ్–రేంజ్ రాకెట్ సిస్టమ్స్‌ను ఉక్రెయిన్‌కు ఇవ్వడం లేదని, అలాంటి ప్రణాళికేదీ తమ వద్ద లేదని స్పష్టం చేశారు. బైడెన్ ప్రకటన పట్ల రష్యా భద్రతా మండలి ఉప నేత దిమిత్రీ మెద్వెదేవ్ హర్షం వ్యక్తం చేశారు.
కళాకారుల సాయం
ఉక్రెయిన్‌కు చేతనైన సాయం అందించేందుకు కళాకారులు సైతం ముందుకొస్తున్నారు. కొన్ని రోజుల క్రితం యూరోవిజన్ పాటల పోటీలో విజేతగా నిలిచిన కలుష్ ఆర్కెస్ట్రా బృందం(ఉక్రెయిన్) సైతం ఈ జాబితాలో ఉంది. కలుష్ బృందానికి లభించిన ట్రోఫీ క్రిస్టల్ మైక్రోఫోన్‌ను క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్ ‘వైట్‌బిట్’ 9 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ సొమ్ముతో ఉక్రెయిన్ సైన్యానికి మూడు డ్రోన్లు, గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్ అందిస్తామని కలుష్ బృందం వెల్లడించింది.
అది చరిత్రాత్మక అవకాశం: స్టోల్టెన్‌బర్గ్
మాడ్రిడ్‌లో వచ్చే నెలలో జరగబోయే సదస్సు నాటో కూటమిని బలోపేతం చేసుకోవడానికి ఒక చరిత్రాత్మక అవకాశం అవుతుందని కూటమి సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ సోమవారం చెప్పారు. నాటో కూటమిలోకి స్వీడన్, ఫిన్‌లాండ్‌ను ఆహ్వానించేందుకు తాను ఉత్సాహంతో ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment