United Nations Security Council
-
ఐరాస భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పాక్
ఇస్లామాబాద్: ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా దుష్కీర్తిని మూటగట్టుకున్న దాయాదిదేశం పాకిస్తాన్ కీలకమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరింది. రొటేషన్ పద్ధతిలో పాకిస్తాన్‌కు ఈ అవకాశం దక్కింది. రెండేళ్లపాటు పాకిస్తాన్ మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగనుందని ఐరాస భద్రతామండలి బుధవారం ప్రకటించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాకిస్తాన్ తన వంతుగా క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఐరాసలో పాకిస్తాన్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న భద్రతామండలిలో పాక్‌కు స్థానం లభించడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. 193 దేశాలకు సభ్యత్వం ఉన్న ఐరాస సర్వ ప్రతినిధి సభలో జూన్‌లో ఓటింగ్ చేపట్టగా 182 దేశాలు ఓటింగ్‌లో పాక్‌కు అనుకూలంగా ఓటేశాయి. మూడింట రెండొంతుల మెజారిటీ(124 ఓట్లు) అవసరం కాగా అంతకుమించి ఓట్లు పడటం విశేషం. ‘‘ అంతర్గత సమస్యలు, యూరప్, పశి్చమాసియా, ఆఫ్రికాలో యుద్ధాల వేళ మండలిలో మాకు దక్కిన సభ్యత్వాన్ని సద్వినియోగం చేసుకుంటాం’’ అని అక్రమ్ అన్నారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి దశాబ్దాలు దాటింది. ప్రారంభంలో 53 దేశాలతో ఏర్పడిన ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం ఏకంగా 193 సభ్యదేశాలు ఉండటం విశేషం. ఐరాస భద్రతా మండలి సభ్యదేశాల సంఖ్య ప్రస్తుతం 15కు పెరిగింది. వీటిల్లో వీటో అధికారం కేవలం శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లకు మాత్రమే ఉంది. మిగతా పది తాత్కాలిక సభ్య దేశాలు రొటేషన్ పద్ధతిపై మారుతుండటం ఆనవాయితీగా వస్తోంది. 2025–26 రెండేళ్లకాలానికిగాను పాకిస్తాన్‌తోపాటు డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియాలు కొత్త సభ్యదేశాలుగా చేరాయి. -
యుద్ధం ఆపేస్తేనే ఒప్పందం
జెరూసలేం: గాజా స్ట్రిప్‌లో యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయెల్‌తో బందీల మార్పిడి ఒప్పందం ఉండదని హమాస్ స్పష్టం చేసింది. యుద్ధం ముగియకుండా, ఖైదీల మార్పిడి జరగదని హమాస్ తాత్కాలిక చీఫ్ ఖలీల్ అల్ హయా బుధవారం పేర్కొన్నారు. దురాక్రమణకు ముగింపు పలకకుండా బందీలను ఎందుకు వదిలేస్తామని ఆయన ప్రశ్నించారు. యుద్ధం మధ్యలో ఉండగా తమ వద్ద ఉన్న బలాన్ని మతి స్థిమితం లేని వ్యక్తి కూడా వదులుకోడని వ్యాఖ్యానించారు. సంప్రతింపులను పునరుద్ధరించడానికి కొన్ని దేశాలు, మధ్యవర్తులతో చర్చలు జరుగుతున్నాయని, తాము ఆ ప్రయత్నాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యుద్ధం ఆపడానికి ఆక్రమించినవారు నిబద్ధతతో ఉన్నారా? లేదా అనేది ముఖ్యమని హయా చెప్పారు. చర్చలను బలహీనపరిచే వ్యక్తి నెతన్యాహు అని రుజువవుతోందన్నారు. మరోవైపు బేషరతుగా శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా బుధవారం వీటో చేసింది. కాల్పుల విరమణలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను తక్షణమే విడుదల చేయాలని స్పష్టంగా కోరే తీర్మానానికి మాత్రమే అమెరికా మద్దతు ఇస్తుందని ఐరాసలో అమెరికా రాయబారి స్పష్టంచేశారు. ఒప్పందానికి ఇరుపక్షాలు సుముఖత చూపకపోతే మధ్యవర్తిత్వ ప్రయత్నాలను నిలిపివేస్తామని హమాస్, ఇజ్రాయెల్‌కు తెలియజేశామని కాల్పుల విరమణ మధ్యవర్తి అయిన ఖతార్ ప్రకటించింది. దోహాలోని హమాస్ రాజకీయ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయలేదని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ నవంబర్ 19న ప్రకటించారు. గాజా యుద్ధాన్ని ముగించడానికి మధ్యవర్తిత్వ ప్రయత్నాలను సులభతరం చేయడానికి హమాస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అల్ అన్సారీ చెప్పారు. అయితే హమాస్‌ను బహిష్కరించాలని ఖతార్‌ను అమెరికా కోరిందని, దోహా ఈ సందేశాన్ని హమాస్‌కు చేరవేసిందని వార్తలు వచ్చాయి. ఈజిప్టు ప్రతిపాదనను స్వాగతించిన హమాస్ గాజా స్ట్రిప్‌ను నడపడానికి అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రత్యర్థి ఫతా ఉద్యమంతో కలిసి ఒక పరిపాలనా కమిటీని ఏర్పాటు చేయాలని ఈజిప్టు చేసిన ప్రతిపాదనను హమాస్ స్వాగతించింది. యుద్ధం ముగిశాక గాజాను ఈ కమిటీ నడిపించి, సమస్యలను పరిష్కరిస్తుందని హయా చెప్పారు. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదన్నారు. యుద్ధం తరువాత గాజాను పాలించడంలో హమాస్ పాత్రను ఇజ్రాయెల్ తిరస్కరించింది. -
UNSC: భారత్‌కు బూస్ట్.. మద్దతు ప్రకటించిన యూకే
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. భారత్‌కు మద్దతుగా ఉన్నట్టు పలు దేశాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ మద్దతు ఇవ్వగా.. తాజాగా ఈ జాబితాలో యూకే కూడా చేరింది.న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ సాధారణ చర్చను ఉద్దేశించి యూకే ప్రధాని కైర్ స్టార్మర్ మాట్లాడుతూ..యూఎన్‌సీసీ మరింత ప్రాతినిధ్య సంస్థగా మారాలి. ఇందులో భాగంగానే యూకే పలు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరుకుంటోంది. బ్రెజిల్, భారత్, జపాన్, జర్మనీలు శాశ్వత సభ్య దేశాలుగా ఉండాలనుకుంటున్నాం. అలాగే, ఆఫ్రికన్ దేశాల ప్రాతినిధ్యం కూడా చూడాలనుకుంటున్నాం’ అని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు.అంతకుముందు.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిందేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్ స్పష్టం చేశారు. బుధవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ.. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. భద్రతా మండలిని విస్తరించి, బలోపేతం చేద్దాం. ఇందుకు ఫ్రాన్స్ అనుకూలంగా ఉంది. ఆఫ్రికాలోని రెండు దేశాలతో పాటు జర్మనీ, జపాన్, ఇండియా, బ్రెజిల్ కు చోటు ఇవ్వాలి. ఆ రెండు దేశాలు ఏవన్నది నిర్ణయించుకునే అధికారం ఆఫ్రికాకే ఇవ్వాలి’ అని కామెంట్స్ చేశారు.ఇక, గత వారంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా కూడా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్.. భారత ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన మూడు దేశాల నుంచి భారత్ మద్దతు దక్కించుకుంది.ప్రస్తుతం, యూఎస్సీపీలో ఐదు శాశ్వత సభ్యులు, పది తాతాల్కిక సభ్య దేశాలు ఉన్నాయి. ఇవి ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతాయి. రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఐదు శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. వీటికి ఏదైనా ముఖ్యమైన తీర్మానాన్ని వీటో చేసే అధికారం ఉంది.ఇది కూడా చదవండి: అమెరికాలో గన్ కల్చర్‌పై బైడెన్ కొత్త చట్టం -
ఐరాసలో వీగిపోయిన తీర్మానం
ఐరాస: గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బుధవారం బ్రెజిల్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానం వీగిపోయింది. ఇజ్రాయెల్ మిత్రదేశం అమెరికా ఈ తీర్మానాన్ని వీటో చేసింది. ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కు గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడం తమను అసంతృప్తికి గురి చేసిందని అమెరికా వెల్లడించింది. ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా 12 దేశాలు ఓటు వేశాయి. రష్యా, బ్రిటన్ గైర్హాజరయ్యాయి. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా వీటో చేయడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. -
మళ్లీ కశ్మీర్‌పై పాక్ ఏడుపు
ఐక్యరాజ్య సమితి: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఒక చర్చాకార్యక్రమంలోనూ కశ్మీర్ అంశాన్ని లేవదీసి పాకిస్తాన్ భారత్‌పై తన అక్కసును మరోసారి వెళ్లబోసుకుంది. దీంతో భారత్ ఘాటుగా స్పందించింది. పాకిస్తాన్ చేసే ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు కనీసం స్పందించాల్సిన అవసరం తమకు లేదని భారత్ తేల్చిచెప్పింది. నెలపాటు మొజాంబిక్ దేశ అధ్యక్షతన ఐరాస భద్రతా మండలిలో సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగానే ‘ మహిళలు, శాంతి, భద్రత’ అంశంపై చర్చలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అసంబద్ధంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ఆ తర్వాత ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్ మాట్లాడారు. ‘ బిలావల్ వ్యాఖ్యానాలు పూర్తిగా నిరాధారం. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిన ప్రసంగమిది. మహిళలకు భద్రతపై చర్చాకార్యక్రమాన్ని మేం గౌరవిస్తున్నాం. మహిళా దినోత్సవ కాల విలువకు గుర్తించాం. ఈ అంశంపైనే మనం దృష్టిసారిద్దాం. అసందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై కనీసం స్పందించాల్సిన అగత్యం భారత్‌కు లేదు. గతంలో చెప్పాం. ఇప్పుడూ, ఇకమీదటా చెప్పేది ఒక్కటే. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమే. దాయాదిదేశం పాక్‌తో పొరుగుదేశ సంబంధాలను సాధారణస్థాయిలో కొనసాగించాలని భారత్ మొదట్నుంచీ ఆశిస్తోంది. అలాంటి వాతావరణం నెలకొనేలా చూడాల్సిన బాధ్యత పాక్‌పై ఉంది. కానీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారి శత్రుత్వాన్ని పెంచుకుంటోంది’ అని రుచిరా ఘాటుగా వ్యాఖ్యానించారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై దారుణ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని బాలాకోట్‌లో కొనసాగుతున్న జైషే మొహమ్మద్ ఉగ్ర శిబిరంపై భారత వాయుసేన మెరుపుదాడి తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీశాక భారత్‌పై పాక్ ఆక్రోశం మరింతగా ఎగసింది. -
'రెచ్చిపోతున్న కిమ్.. మౌనంగా ఉంటే ప్రపంచానికే ప్రమాదం..'
వాషింగ్టన్: వరుస బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో రెచ్చిపోతున్న ఉత్తరకొరియా చర్యలను ఖండించాలని ఐక్యరాజ్యసమితి భద్రతమండలిలో అమెరికా ప్రతిపాదించింది. ప్యాంగ్యాంగ్ను దౌత్యపరమైన సంబంధాలవైపు మళ్లేలా చూడాలని సూచించింది. 15 ఉన్నత దేశాలు సభ్యులుగా ఉన్న భద్రతా మండలి సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకర దేశంగా అవతరిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సోమవారం జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ ఈమేరకు వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాపై తక్షణే చర్యలు తీసుకోవాలని, కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. భద్రతా మండలి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు కంటే దారుణమని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. అయితే చైనా, రష్యా మాత్రం అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఉత్తరకొరియాపై మరింత ఒత్తిడి తెస్తే అది నిర్మాణాత్మకంగా ఉండదని వాదించాయి. గతేడాది మేలో ఉత్తరకొరియాపై ఐరాస భద్రతా మండలి మరిన్ని ఆంక్షాలు విధించాలనుకున్నప్పుడు కూడా ఈ రెండు దేశాలే వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకున్నాయి. ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు ఆసియాతో పాటు మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతాయనే విషయాన్ని ఆ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న దేశాలు గుర్తుంచుకోవాలని లిండా వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా ఇటీవల మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. అనంతరం ప్యోంగ్యాంగ్ పసిఫిక్‌ను 'ఫైరింగ్ రేంజ్'గా ఉపయోగించడం ఆమెరికా దళాల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని కిమ్ జోంగ్ ఉన్ సోదరి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఐరాస భద్రతా మండలి సోమవారం సమావేశమైంది. అనంతరం మండలిలోని మూడింట రెండొంతుల సభ్య దేశాలు ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలను ఖండిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. చదవండి: తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం -
పాకిస్థాన్ ఉగ్రవాది విషయంలో ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయం..
పాకిస్థాన్ ఉగ్రవాది విషయంలో ఐక్యరాజ్య సమితి కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాది అబ్ధుల్ రెహ్మన్ మక్కీని యూఎన్ఓ భద్రతా మండలి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. భద్రతా మండలిలోని 1267 ఐఎస్‌ఐల్(దయిష్), ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద జనవరి 16న మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాలో చేర్చింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాక వారి ఆస్తులను స్తంభింపచేయడంతో పాటు ప్రయాణ, ఆయుధాలపై నిషేధం విధించింది. లష్కరే తోయిబా చీఫ్, ముంబాయి దాడుల సూత్రధారి అయిన హాఫీజ్ సయిద్ బావనే రెహ్మాన్ మక్కీ. కాగా గతేడాది జూన్‌లో యూఎన్ఎస్సీ 1267 ఆంక్షల కమిటీ కింద అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని ఐరాసలో భారత్ ప్రతిపాదించగా.. భారత్ ప్రతిపాదనకు చైనా అడ్డుపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్, అమెరికా తమ దేశీయ చట్టాల ప్రకారం మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చాయి. జమ్మూ కశ్మీర్లో ఎల్ఈటీ కార్యకలాపాల కోసం నిధుల సేకరణలో మక్కీ కీలక పాత్ర పోషించారు. అంతేగాక.. యువతను హింసకు ప్రోత్సహించడం, దాడులకు కుట్ర పన్నుతున్నాడని వెల్లడైంది. ఈ క్రమంలో తాజాగా అబ్దుల్ మక్కీని ఐరాస గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఇదిలా ఉండగా 2020వ సంవత్సరంలో పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం అబ్దుల్ రెహ్మాన్ మక్కీ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేశాడన్న కేసులో జైలు శిక్ష విధించింది. అయితే గతంలో కూడా పాకిస్థాన్ ఉగ్రవాదులపై నిషేధం విధించడంలో చైనా అడ్డంకులు సృష్టించింది. యూఎన్ నిషేధించిన పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ- మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను నిషేధించాలన్న ప్రతిపాదనలను డ్రాగన్ దేశం పదేపదే అడ్డుకుంది. -
రావినూతల శశిధర్‌కు న్యాయశాస్త్రంలో పీహెచ్డీ డాక్టరేట్
ఉస్మానియా యూనివర్సిటి న్యాయశాఖ విభాగంలో ‘‘యాంటి టెర్రరిజం లాస్ ఇన్ పోస్ట్ 9/11 వరల్డ్ అండ్ ఇండియన్ లాస్ - ఎ కంపారేటివ్ స్టడీ’’ అనే అంశంపై ప్రొఫెసర్ ఎస్. బీ. ద్వారకానాథ్ గారి పర్యవేక్షణలో పరిశోధన చేసిన రావినూతల శశిధర్‌కు ఉస్మానియా యూనివర్సిటి డాక్టరేట్‌ను ప్రదానం చేసింది . అమెరికా జంట టవర్ల పేలుళ్ళ అనంతరం తీవ్రవాదాన్ని అణిచివేయడానికి వివిధ ప్రపంచ దేశాలు చేసిన తీవ్రవాద వ్యతిరేఖ చట్టాలు మరియు వాటి పనితీరు, ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు వాటి ప్రభావం , ఐక్య రాజ్య సమితి వివిధ విభాగాల ఏర్పాటు మరియు వాటి పనితీరు, భారత దేశంలో వివిధ రూపాలలో ఉన్న తీవ్రవాద మూలాలు, తీవ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్ లో ప్రస్తుతం ఉన్న చట్టాల పనితీరు, నూతన చట్టాల ఆవశ్యకత, తీవ్రవాద వ్యతిరేఖ చట్టాల అమలులో భారతదేశ కోర్టుల పాత్ర, కఠిన చట్టాల ఆవశ్యకత - మానవ హక్కులు రక్షణ తదితర అంశాలపై లోతైన అధ్యయనంతో కూడిన పరిశోధన థిసిస్‌ను రావినూతల శశిధర్ సమర్పించారు. ఈ పరిశోధనకు సంబంధించిన పలు అంశాలపై రావినూతల శశిధర్ వ్రాసిన పలు ఆర్టికల్స్‌ను ప్రముఖ లీగల్ జర్నల్స్ ప్రచురించాయి, పరిశోధనలో భాగంగా జాతీయ భద్రతకు సంబంధించిన పలు జాతీయ స్థాయి సెమినార్లలో కూడా శశిధర్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య తీవ్రవాదాన్ని అణిచివేయడంలో ప్రస్తుత చట్టాల పనితీరుపై విస్తృత పరిశోధన చేసి అంతర్జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై మరియు భారత దేశంలోని చట్టాలలో రావాల్సిన మార్పులపై ఈ పరిశోధనలో చేసిన పలు సూచనలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని పలువురు న్యాయ నిపుణులు శశిధర్ ను అభినందిస్తున్నారు. రాష్ట్రంలో అనేక విద్యార్థి ఉద్యమాలకు మరియు సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన రావినూతల శశిధర్.. తీవ్రవాద వ్యతిరేఖ చట్టాలపై విస్తృత పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డు సాధించడం పై పలువురు అభినందించారు. -
ఉగ్ర ‘టూల్‌కిట్’లో సోషల్ మీడియా
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యథేచ్ఛగా వాడుకుంటున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికలు ఉగ్రవాదుల టూల్కిట్లో ముఖ్యమైన సాధనాలుగా మారిపోయాయని చెప్పారు. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, క్రిప్టో–కరెన్సీ వంటి నూతన సాంకేతికతలను ముష్కరులు దుర్వినియోగం చేయకుండా అంతర్జాతీయంగా కఠిన చ్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రపంచదేశాలు గట్టి ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) ప్రత్యేక సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల ప్రతినిధులు, పలువురు అంతర్జాతీయ నిపుణులు ఈ భేటీకి హాజరయ్యారు. ఉగ్రæ చర్యలపై యూఎన్ఎస్సీ భారత్‌లో సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచ మానవాళికి పెనుముప్పు ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ అంకితభావంతో కృషి చేస్తోందని జైశంకర్ పునరుద్ఘాటించారు. ‘ఐక్యరాజ్యసమితి ఫండ్ ఫర్ కౌంటర్–టెర్రరిజం’కు ఈ ఏడాది భారత్ స్వచ్ఛందంగా 5 లక్షల డాలర్లు ఇవ్వబోతోందని ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు చేరవేయడానికి, లక్ష్యాలపై దాడులు చేయడానికి ఉగ్రవాద సంస్థలు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు మానవ రహిత విమానాలు, డ్రోన్లు వాడుతుండడం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారిందన్నారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి పెద్ద ముప్పుగా పరిణమించిందని చెప్పారు. గ్లోబల్ యాక్షన్ కావాలి: గుటేరస్ ఉగ్రవాద సంస్థలు ఆధునిక టెక్నాలజీని వాడుకోకుండా కట్టడి చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా కృషి (గ్లోబల్ యాక్షన్) చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక సందేశాన్ని పంపారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం కొత్త టెక్నాలజీని వాడుకోవడం వేగంగా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధి రుచిరా కాంబోజ్ చెప్పారు. ‘ఢిల్లీ డిక్లరేషన్’ను 15 సభ్యదేశాల ప్రతినిధులు ఆమోదించారు. ఉగ్ర సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రైవేట్ రంగం, పౌర సమాజంతో కలిసి పనిచేయాలని ప్రభుత్వాలకు కౌంటర్–టెర్రరిజం కమిటీ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించవద్దు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భారత్ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశమేనని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఉగ్రవాద చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు ప్రేరణ ఏదైనప్పటికీ వారి కార్యకలాపాలను అరికట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ముష్కర శక్తుల ఆట కట్టించే విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శిగా కొనసాగాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) సమావేశాన్ని ఉద్దేశించిన ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఉగ్రవాదంపై భారత్ అలుపెరుగని పోరాటం సాగిస్తోందని ఉద్ఘాటించారు. భారత్ ఉగ్రవాదం బారినపడిందని పేర్కొన్నారు. -
భద్రతా మండలి: భారత్ ‘శాశ్వత సభ్యత్వం’పై బైడెన్ స్పందన
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. భారత్‌తో పాటు జర్మనీ, జపాన్‌లను కూడా సభ్యదేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు బైడెన్ సానుకూలంగా ఉన్నారంటూ వైట్‌హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు బైడెన్ సైతం ఈ విషయంపై పరోక్షంగా ప్రకటన చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణ నేపథ్యంలో.. జర్మనీ, జపాన్, భారత్‌లను శాశ్వత సభ్య దేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకారం తెలిపారని, అదే సమయంలో.. ఇందుకోసం చాలా ప్రక్రియలు జరగాల్సి ఉంటుందని వైట్‌హౌజ్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా మండలిలో ఈ మూడు దేశాలు శాశ్వత సభ్యులుగా ఉండాలనే ఆలోచనకు చారిత్రాత్మకంగా, మా మద్దతు ఉంటుంది అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆ అధికారి స్పందించారు. ఇక బుధవారం UN జనరల్ వద్ద జో బైడెన్ ప్రసంగించారు. ‘‘నేటి ప్రపంచ అవసరాలకు మెరుగ్గా ప్రతిస్పందించేలా సంస్థ మరింత సమగ్రంగా మారాల్సిన సమయం ఆసన్నమైందని తాను నమ్ముతున్నానని ఈ సందర్భంగా బైడెన్ అన్నారు. యునైటెడ్ స్టేట్స్తో సహా UN భద్రతా మండలి సభ్యులు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను నిలకడగా సమర్థించాలి. కౌన్సిల్ విశ్వసనీయంగా, ప్రభావవంతంగా ఉండేలా చూసేందుకు అరుదైన, అసాధారణమైన పరిస్థితులలో మినహా వీటోను ఉపయోగించకుండా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే కౌన్సిల్ శాశ్వత మరియు శాశ్వత ప్రతినిధుల సంఖ్యను పెంచడానికి యునైటెడ్ స్టేట్స్ మద్దతు ఇస్తుందని ఆయన వెల్లడించారు. మేము చాలా కాలంగా మద్దతు ఇస్తున్న దేశాలకు శాశ్వత స్థానాలు ఇందులో ఉన్నాయి అని బైడెన్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 దేశాలు సభ్యులుగా ఉండగా, శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా ఫెడరేషన్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలు మాత్రమే శాశ్వత సభ్యదేశాలుగా ఉండి వీటో పవర్‌ను కలిగి ఉన్నాయి. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ని నివారించేలా రష్యా ఎత్తుగడ -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై భద్రతా మండలి ఏకగ్రీవ ప్రకటన
ఐరాస/జపోరిజియా(ఉక్రెయిన్): ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధంపై, ఫలితంగా ఆ దేశంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. సమస్యకు తక్షణం శాంతియుత పరిష్కారం కనుగొనాలంటూ యుద్ధంపై తొలిసారిగా ఏకగ్రీవ ప్రకటన చేసింది. ఈ దిశగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చేస్తున్న ప్రయత్నాలకు 15 మంది సభ్యుల సమితి పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే ప్రకటనలో యుద్ధం అనే పదాన్ని వాడకుండా జాగ్రత్త పడ్డారు. రక్తపాతం ద్వారా ఏ పరిష్కారమూ దొరకదని, దౌత్యం, చర్చల ద్వారానే యుద్ధానికి ముగింపు పలకాలన్నది ముందునుంచీ భారత వైఖరి అని ఐరాసలో భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ ప్రతీక్ మాథుర్ పునరుద్ఘాటించారు. మే 9 విక్టరీ డే సమీపిస్తున్న నేపథ్యంలో రష్యా దాడులను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సిద్ధమవుతోంది. రెండో అతి పెద్ద నగరం ఖర్కీవ్‌ను రక్షణపరంగా దుర్భేద్యంగా మార్చేసింది. ఈ నగరాన్ని లక్ష్యం చేసుకుని రష్యా ఉన్నట్టుండి దాడులను తీవ్రతరం చేసింది. మారియుపోల్‌లో అజోవ్‌స్తల్ స్టీల్ ఫ్యాక్టరీపైనా దాడులను భారీగా పెంచింది. శుక్ర, శనివారాల్లో ప్లాంటు నుంచి 50 మందికి పైగా బయటపడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. తూర్పున డోన్బాస్లోనూ పోరాటం తీవ్రతరమవుతోంది. లెహాన్స్క్లో రష్యా బలగాలు బాగా చొచ్చుకెళ్లినట్టు సమాచారం. భాగస్వాములను కాపాడుకోలేని అమెరికా బలహీనత వల్లే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిందని అల్‌ఖైదా నేత అల్ జవహరీ విమర్శించారు. అమెరికా అగ్రరాజ్యం కాదు. దిగజారిపోతోంది’’ అన్నారు. రొమేనియా సాయం సూపర్: జిల్ బుఖారెస్ట్: దాదాపు 10 లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థులను రొమేనియా ఆదుకున్న తీరు సాటిలేనిదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ కొనియాడారు. 4 రోజుల యూరప్ పర్యటనలో ప్రస్తుతం రొమేనియాలో ఉన్న ఆమె ఆదివారం మాతృ దినోత్సవాన్ని స్లొవేనియాలో ఉక్రెయిన్ సరిహద్దుల సమీప గ్రామంలో శరణార్థులతో గడపనున్నారు. రొమేనియా అధ్యక్షుని భార్య కామెరాన్ అయోహనిస్తో జిల్ భేటీ అయ్యారు. వరల్డ్ చాంపియన్ మృతి అంతర్జాతీయ యుద్ధ క్రీడల్లో ప్రపంచ చాంపియన్, రష్యా యుద్ధ ట్యాంకుల నిపుణుడు బటో బసనోవ్ (25) ఉక్రెయిన్ యుద్ధంలో మరణించాడు. అతని యుద్ధ ట్యాంకును ఉక్రెయిన్ దళాలు పేల్చేశాయి. గతేడాది జరిగిన వరల్డ్ ట్యాంక్ బయాథ్లాన్‌లో గంటకు 50 మైళ్ల వేగంతో కూడిన లక్ష్యాలను ఒక్కటి కూడా వదలకుండా ఛేదించి బసనోవ్ రికార్డు సృష్టించాడు. యుద్ధంలో 38వ కల్నల్‌ను రష్యా డోన్బాస్లో కోల్పోయింది. మరోవైపు, రష్యా ల్యాండింగ్ షిప్‌ను టీబీ2 డ్రోన్ సాయంతో స్నేక్ ఐలాండ్‌లో ముంచేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధరించిన ఖాకీ జాకెట్ లండన్‌లో జరిగిన వేలంలో 90 వేల డాలర్ల ధర పలికింది. -
ఎమర్జెన్సీ కి ప్రపంచ దేశాల పిలుపు
-
ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతం
-
ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతం
-
మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం
వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (యూఎన్ఎస్సీ) భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ అంశంలో భారత్‌కు అమెరికా మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పారు. అత్యద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తూ, ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తున్న భారత్‌ను న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపులో (ఎన్ఎస్జీ)లో చేర్చాలని అన్నారు. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మండలిలో సంస్కరణలు అమలు చేసినప్పుడు భారత్ శాశ్వత సభ్యత్వానికి తాము మద్దతునిస్తామని బైడెన్ స్పష్టం చేశారు. అఫ్గాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించకూడదు అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కులు, మహిళలు, పిల్లలు, మైనార్టీల హక్కుల్ని గౌరవిస్తూ ఇచి్చన మాటలకి తాలిబన్లు కట్టుబడి ఉండాలని అమెరికా, భారత్ హితవు చెప్పాయి. అఫ్గాన్ భూభాగం ఉగ్రవాదులకు నిలయంగా మారకూడదని, మరే దేశంలోనూ ఉగ్ర సంస్థలు విలయం సృష్టించకూడదని బైడెన్, మోదీ సంయుక్త ప్రకటన హెచ్చరించింది. అఫ్గాన్‌పై యూఎన్ భద్రతా మండలి తీర్మానం 2593 ప్రకారం తాలిబన్లు అఫ్గాన్ గడ్డను ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, ఆరి్థక సహకారం అందజేయడానికి వాడకూడదని వారు చెప్పారు. అఫ్గాన్ వీడి వెళ్లాలనుకునే విదేశీయులను, అఫ్గాన్లను సురక్షితంగా పంపడానికి చర్యలు తీసుకోవాలని బైడెన్, మోదీ కోరారు. 26/11 కుట్రదారుల్ని శిక్షించాలి ఉగ్రవాదంపై సంయుక్త పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనీ, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత్, అమెరికా తెలిపాయి. సీమాంతర ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించబోమని చెప్పిన నేతలు ముంబై 26/11 దాడుల సూత్రధారుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. దాడుల వెనుక పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా హస్తం ఉందన్న విషయం తెలిసిందే. ఐరాస గుర్తించిన జాబితాలో జైషే మహమ్మద్, అల్ ఖాయిదా, హక్కానీ నెట్వర్క్ కూడా ఉన్నాయి. -
ఉగ్రవాదులే పాలకులు..!
కాబూల్/పెషావర్/ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో ఏకంగా 14 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఐక్యరాజ్యసవిుతికి చెందిన భద్రతా మండలి వారిని గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. ఈ జాబితాలో నూతన ప్రధానమంత్రి ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్‌తోపాటు ఇద్దరు ఉపప్రధానుల పేర్లు సైతం ఉండడం గమనార్హం. అఫ్గానిస్తాన్‌లోని కొత్త మంత్రివర్గంలో కరడుగట్టిన ఉగ్రవాదులు స్థానం దక్కించుకోవడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సిరాజుదీ్దన్ హక్కానీ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డారు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. సిరాజుదీ్దన్ హక్కానీ మామ ఖలీల్ హక్కానీ కాందిశీకుల సంక్షేమ మంత్రిగా నియమితులయ్యారు. రక్షణ శాఖ మంత్రి ముల్లా యాకూబ్, విదేశాంగ మంత్రి ముల్లా అమీర్ ఖాన్ ముత్తాఖీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ తదితరులను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన శాంక్షన్స్ కమిటీ(తాలిబన్ శాంక్షన్స్ కమిటీ) గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. పాకిస్తాన్ ఆర్మీలో కీలక మార్పులు పాక్ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం నియంత్రణ రేఖ వెంట భద్రతా పరమైన విభాగాలను పర్యవేక్షిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ అజర్ అబ్బాస్‌ను చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా నియమించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తర్వాత రెండో ప్రాధాన్యం ఉన్న పోస్టు చీఫ్ జనరల్ స్టాఫ్ కావడం గమనార్హం. జనరల్ అబ్బాస్ బలూచ్ రెజిమెంట్‌కు చెందిన వ్యక్తి. ఇప్పటి వరకూ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా పని చేసిన లెఫ్టినెంట్ జనరల్ షషీర్ శంషాద్ మీర్జాను రావల్పిండిలోని 10 కార్ప్స్ కమాండర్‌గా పంపించారు. ఇంకోవైపు ముల్తాన్ కార్ప్స్ కమాండర్‌గా లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ ఛిరాగ్ హైదర్‌ను నియమించారు. తాలిబన్లకు చైనా ఆర్థిక సాయం అఫ్గానిస్తాన్‌కు 3.1 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని చైనా ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు ఏర్పరిచిన తాత్కాలిక ప్రభుత్వాన్ని స్వాగతించింది. అశాంతిని పోగొట్టి, శాంతిని నెలకొల్పే చర్యగా ప్రభుత్వ ఏర్పాటును అభివర్ణించింది. అఫ్గాన్‌కు ఆహార ధాన్యాలు, టీకాలు, మందులు ఇస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ చెప్పినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్, తజకిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి రష్యా హాజరు కాలేదు. అఫ్గానిస్తాన్ ప్రజలకు తొలి విడతలో 30 లక్షల టీకా డోసులు పంపుతామని వాంగ్ భరోసా ఇచ్చారు. చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెంబిన్ మాట్లాడుతూ అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొన్నారు. చైనా ఎప్పుడూ అఫ్గానిస్తాన్ సార్వ¿ౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని గౌరవిస్తుందని చెప్పారు. పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలకు విలువ లేదు తాము పూర్తిగా మారిపోయామని, అఫ్గాన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తామని నమ్మబలుకుతున్న తాలిబన్లు మరోవైపు తమ అసలు రూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. పవిత్రమైన షరియా చట్టాల ప్రకా రమే అఫ్గానిస్తాన్ పరిపాలన, ప్రజా జీవనాన్ని నిర్దేశిస్తామని తాలిబన్ అగ్రనేత హైబ తుల్లా అఖుంద్జాదా స్పష్టం చేశారు. అఫ్గాన్ నూతన ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్ మోల్వీ నూరుల్లా మునీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మా రాయి. ‘‘పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలకు పెద్దగా విలు వలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న తాలిబన్లు, ముల్లాలను చూడండి. వారిలో ఎవరికీ పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలు కాదు కదా కనీసం ఎంఏ, హైసూ్కల్ డిగ్రీలు కూడా లేవు. అయినప్పటికీ వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని మునీర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో నికొలాయ్ పాట్రుశేవ్ భేటీ న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం భారత్‌కు చేరుకున్న రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికొలాయ్ పాట్రుశేవ్ బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తామిద్దరం కీలకమైన అంశాలపై సంప్రదింపులు జరిపినట్లు మోదీ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. -
ఉగ్రవాద శక్తులకు తోడ్పాటు వద్దు: జైశంకర్
ఐక్యరాజ్యసమితి: లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆరోపించారు. శిక్ష పడుతుందన్న భయం వాటికి లేకుండా పోయిందన్నారు. ఇతర దేశాల అండ చూసుకొని రెచ్చిపోతున్నాయని చెప్పారు. ఆయన గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అధ్యక్ష హోదాలో ప్రసంగించారు. ఇండియాలో ముంబై, పఠాన్ కోట్, పుల్వామా దాడులకు పాల్పడింది పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలేనని గుర్తుచేశారు. అలాంటి సంస్థలకు ఏ దేశమూ తోడ్పాటు అందించవద్దని కోరారు. ఉగ్రవాద మూకలకు అందుతున్న ఆర్థిక సాయాన్ని విస్మరించడం తగదని అన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డాగా మారిపోయిందని దుయ్యబట్టారు. -
ఇరాన్‌పై వీగిన అమెరికా తీర్మానం
ఐక్యరాజ్యసమితి: ఇరాన్‌పై ఐక్యరాజ్య సమితి విధించిన ఆయుధ ఆంక్షలను నిరవధికంగా కొనసాగించాలని కోరుతూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం భద్రతా మండలిలో వీగిపోయింది. అమెరికా తీర్మానానికి అనుకూలంగా కేవలం డొమినికన్ రిపబ్లిక్ నుంచి మాత్రమే మద్దతు లభించింది. తీర్మానాన్ని ఆమోదించడానికి భద్రతా మండలిలోని 15 సభ్య దేశాల్లో కనీసం 9 దేశాలు మద్దతు పలకాల్సి ఉంటుంది. అమెరికా తీర్మానానికి అనుకూలంగా రెండు ఓట్లు, వ్యతిరేకంగా రెండు ఓట్లు రాగా, 11 మంది సభ్యులు ఓటింగ్‌కి దూరంగా ఉన్నారు. ఈ తీర్మానాన్ని రష్యా, చైనా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, తమ వీటో పవర్‌ని ఉపయోగించే అవసరం ఆ దేశాలకు రాలేదు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తీర్మానం ఓడిపోయినట్లు ప్రకటించారు. 2015లో ఇరాన్‌కీ, ఆరు పెద్ద దేశాలైన రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మధ్య, అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలను నిర్వీర్యం చేస్తూ, నిరాయుధీకరణకు కృషిచేయాలి. ఈ ఒప్పందం నుంచి 2018లో ట్రంప్ ప్రభుత్వం వైదొలిగింది. -
భద్రతా మండలికి భారత్
ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో అత్యంత శక్తిమంతమైన భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాలకు జరిగిన ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది. మొత్తం 193 సభ్య దేశాలు కలిగిన భద్రతా మండలిలో భారత్‌కు అనుకూలంగా 184 ఓట్లు వచ్చాయి. బుధవారం జరిగిన భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ ఆసియా పసిఫిక్ ప్రాంతం కేటగిరీలో ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో భారత్‌తో పాటుగా ఐర్లాండ్, మెక్సికో, నార్వే దేశాలు ఎన్నికయ్యాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఈ మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. మిగిలిన దేశాల సభ్యత్వం కోసం ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి పోలింగ్‌లో 192 దేశాలు పాల్గొన్నాయి. భద్రతా మండలికి ఎన్నిక కావాలంటే మూడింట రెండోవంతు మెజార్టీ సాధించాలి. అంటే 128 దేశాలకు మద్దతు పలకాలి. భారత్‌కు 184 దేశాల నుంచి మద్దతు లభించడంలో విజయబావుటా ఎగురవేసింది. శాంతిస్థాపన, సమానత్వానికి కృషి: మోదీ భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ సాధించిన అద్భుత విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో శాంతి స్థాపన, భద్రత, సమానత్వం నెలకొల్పడంలో సభ్యదేశాలతో కలిసి పని చేస్తామన్నారు. జనవరి నుంచి రెండేళ్ల పాటు భద్రతా మండలి ఎన్నికల్లో ఆసియా పసిఫిక్ దేశాల తరఫున పోటీ పడడానికి చైనా, పాకిస్తాన్ సహా 55 దేశాలున్న కూటమి భారత్‌ని గత ఏడాది జూన్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకుంది. భద్రతా మండలిలో భారత్ సభ్యత్వం 2021–2022 వరకు రెండేళ్ల పాటు కొనసాగనుంది. జనవరి 1 నుంచి అయిదు శాశ్వత సభ్యదేశాలు, తాత్కాలిక సభ్య దేశాలైన ఈస్టోనియా, నైజర్, సెయిర్ విన్సెండ్, గ్రెనాడిన్స్, ట్యునీసియా, వియత్నాం దేశాలతో కలిసి సమావేశాలకు భారత్ హాజరుకానుంది. బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా దేశాల పదవీ కాలం ఈ ఏడాది చివరితో ముగిసిపోనుంది. భారత్ ఇప్పటివరకు ఏడుసార్లు ఎన్నికైంది. ఉగ్రవాదమే ప్రధాన లక్ష్యం ఐక్యరాజ్యసమితిలో శక్తివంతమైన భద్రతా మండలి ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యలను మరింత విస్తృతం చేస్తామని కేంద్రం తెలిపింది. ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించే ప్రక్రియ రాజకీయాల కారణంగా నిర్వీర్యం కాకుండా చూడటమే లక్ష్య ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ఆంక్షలు విధించే విషయంలోనూ రాజకీయాలకు తావు లేకుండా చేస్తామని తెలిపింది. మండలిలో ప్రాతినిధ్యం లేని దేశాల గళం వినిపించడంలో భారత్ ముందుంటుం దన్నారు. భారత్ భద్రతా మండలికి ఎన్నిక కావడంపై విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్ ఈ మేరకు స్పందించారు. -
ఐరాసలో భారత్ విజయం: మోదీ హర్షం
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వ ఎన్నికల్లో భారత్ విజయం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఐరాస ఎన్నికల్లో ఎలాంటి పోటీలేకుండా భారత్ విజయం సాధించడం గొప్ప పరిణామం అన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించిన మోదీ.. తమకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు. సభ్య దేశాలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. శాంతి, సామరస్యత, సమానత్వం, భద్రత వంటి అంశాలపై పోరాటంలో భారత తన పంథాను కొనసాగిస్తుందని మోదీ స్పష్టం చేశారు. కాగా బుధవారం రాత్రి జరిగిన ఎన్నికల్లో మొత్తం 193 ఓట్లు పోలవ్వగా భారత్‌కు 184 ఓట్లు దక్కాయి. దీంతో రెండేళ్ల పాటు (2021-22 ) ఆ స్థానంలో కొనసాగనుంది. (ఐరాస ఎన్నికల్లో భారత్ విజయం) -
ఐరాస ఎన్నికల్లో భారత్ విజయం
సాక్షి, న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వపు ఎన్నికల్లో భారత్ విజయం సాధించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి)లో భారత్‌కు మరోసారి తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది. దీంతో రెండేళ్లపాటు (2021–22) భారత్ కొనసాగనుంది. ఐరాసలో సభ్యదేశంగా భారత్ ఎంపిక కావడం ఇది ఎనిమిదోసారి. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ నుంచి కేవలం భారత్ ఒక్కటే పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించగా, కెనడా ఓటమిపాలైంది ఐరాసలో అత్యంత శక్తిమంతమైన విభాగం భద్రతా మండలి. అంతర్జాతీయంగా శాంతి భద్రతల పరిరక్షణను ఇదే పర్యవేక్షిస్తుంది. ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించే అధికారం ఉంది. సమితిలో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉండగా, మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్), పది తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. శాశ్వత సభ్యదేశాలకు ‘వీటో’ అధికారం ఉంటుంది. తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల సభ్యత్వ కాలానికి రొటేషన్ పద్ధతిలో సర్వసభ్య సభ ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తుంది. మండలిలో కీలక నిర్ణయాలకు కనీసం 9 సభ్యదేశాల ఆమోదం అవసరం. అయితే ఏదైనా నిర్ణయానికి అవసరమైనన్ని సభ్యదేశాల ఆమోదం ఉన్నప్పటికీ.. శాశ్వత సభ్యదేశాల్లో ఏదైనా దేశం వ్యతిరేకించి వీటో చేస్తే ఆ నిర్ణయం ఆమోదం పొందదు. కాగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా, చైనా అందుకు మోకాలడ్డుతోంది. Member States elect India to the non-permanent seat of the Security Council for the term 2021-22 with overwhelming support. India gets 184 out of the 192 valid votes polled. pic.twitter.com/Vd43CN41cY — India at UN, NY (@IndiaUNNewYork) June 17, 2020 -
భద్రతా మండలిలో ఎన్నికల సందడి
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో ఐదు తాత్కాలిక సభ్యదేశాల నియామక ప్రక్రియ మొదలైంది. 75వ ఐక్యరాజ్యసమితి సమావేశాల అధ్యక్షుడిని ఎంపిక చేయడంతోపాటు సామాజిక, ఆర్థిక మండలి సభ్యుల నియామకానికి కూడా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికలను ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బుధవారం నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో తమకు స్పష్టమైన విజయం లభించడం ఖాయమని భారత్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందులో విజయం సాధిస్తే రెండేళ్లపాటు (2021–22) ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు తాత్కాలిక సభ్యదేశ హోదా లభిస్తుంది. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్ గ్రూప్ నుంచి కేవలం భారత్ ఒక్కటే పోటీ చేస్తోంది కాబట్టి గెలుపు తథ్యమే. భారత్ 1950–51, 1967–68, 1972–73, 1077–78, 1984–85, 1991–92, 2011–22లో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా దక్కించుకుంది. -
పాకిస్తాన్ పప్పులు ఉడకవు!
ఐక్యరాజ్య సమితి: చీకటి వ్యవహారాలు నడపడంలో రెండాకులు ఎక్కువే చదివిన పాకిస్తాన్ పప్పులు ఇకపై ఉడకబోవని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సెక్యురిటీ కౌన్సిల్లో జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్‌కు భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఘాటు సమాధానమిచ్చారు. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో శాంతిభద్రతల నిర్వహణపై బహిరంగ చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ‘‘చీకటి వ్యవహారాలు నడపడంలో దిట్ట అయిన బృందం మరోసారి తన అసలు రూపాన్ని చూపింది. అసత్యాలను ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. వీటిని మేము ఖండిస్తున్నాం. పాకిస్థాన్‌కు నా ప్రతిస్పందన ఒక్కటే. కొంచెం ఆలస్యమైనా ఫర్వాలేదు.. ఇప్పటికైనా వాళ్లు తమ పాపాలను కడిగేసుకునే ప్రయత్నం చేయాలి. మీ కథలు నమ్మేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు’’ అని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దు, తదనంతరం ఆ ప్రాంతంలో సమాచార వ్యవస్థలపై నిర్బంధం వంటి అంశాలను మునీర్ అక్రమ్ ప్రస్తావించారు. బాలాకోట్ దాడుల సందర్భంగా తాము వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌ను బందీగా చేసిన విషయాన్ని చెబుతూ.. భారత్ పాక్‌ల మధ్య ఘోర యుద్ధాన్ని నివారించాలంటే తక్షణమే కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాద నెట్‌వర్క్‌లు అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం కావడం, ఉగ్రవాదులు కొత్త ఆయుధాలు–టెక్నాలజీ సమకూర్చుకుంటుంటే నియంత్రించలేకపోవడం వంటి వాటిని మండలి లోపాలుగానే చూడాలని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన ఉద్దేశాల అమలుపై నిష్పక్షపాత సమీక్ష జరగాలని సూచించారు. ఇప్పటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా మండలిలో మార్పులు జరగాలని అన్నారు. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఐక్యరాజ్య సమితి ఛార్టర్ ఇప్పటికీ ప్రపంచ స్ఫూర్తికి ప్రతీకగా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ సైన్యం శుక్రవారం ఎల్ఓసీ వెంబడి మరోసారి కాల్పులకు తెగబడింది. పూంఛ్ సెక్టార్లో సరిహద్దు వెంబడి పాక్ సైన్యం మోర్టార్లతో కాల్పులు జరిపిందని సైనికాధికారులు తెలిపారు.ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ పోర్టర్లు మరణించారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. -
ఇరాన్‌కు అమెరికా షాక్!
వాషింగ్టన్ : అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ మరణించడంతో.. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల నుంచి పరస్పరం హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్‌కు వీసా నిరాకరించింది. గురువారం న్యూయార్క్‌లో జరగనున్న ఐకరాజ్య సమితి భద్రత మండలి సమావేశానికి జరీఫ్ హాజరు కావాల్సి ఉంది. ఈ సమావేశాల్లో సులేమానీ హత్యకు సంబంధించి ఆయన అమెరికా వైఖరిపై విమర్శలు చేసే అవకాశం ఉండటంతోనే.. ఆ దేశం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా, 1947 యూఎన్ ‘హెడ్ క్వాటర్స్ ఒప్పందం’ ప్రకారం యూఎన్‌కు హాజరయ్యే విదేశాలకు చెందిన దౌత్యవేత్తలకు అమెరికా తమ దేశంలోకి అనుమతించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం భద్రత, తీవ్రదాదం, విదేశాంగ విధానం కారణాలను చూపి అమెరికా జరీఫ్‌కు వీసా నిరాకరించింది. అలాగే దీనిపై స్పందించడానికి అమెరికా విదేశాంగ శాఖ ఇష్టపడలేదు. మరోవైపు ఇరాన్ తరఫు ప్రతినిధులు మాత్రం.. జరీఫ్ వీసాకు సంబంధించి అమెరికా నుంచి గానీ, యూఎన్ నుంచి గానీ ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని వెల్లడించారు. అమెరికా జరీఫ్‌కు వీసా నిరాకరించిందనే వార్తలపై స్పందించడానికి యూఎన్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ నిరాకరించారు. గతేడాది ఏప్రిల్, జూలైలలో కూడా జరీఫ్ యూఎన్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమయంలో జరీఫ్తోపాటు ఇతర అధికారులపై రవాణా పరమైన ఆంక్షలు విధించింది. వారిని న్యూయార్క్‌లోని కొద్ది ప్రాంతానికే పరిమితమయ్యేలా చేసింది. -
పాక్ పరువుపోయింది
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా మరోసారి భంగపాటు ఎదురైంది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 15 దేశాల రహస్య సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. సంయుక్త ప్రకటన విడుదల చేయాలన్న చైనా ఒత్తిడిని యూఎన్ బేఖాతర్ చేసింది. భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షికంగా పరిష్కారం కావల్సిన కశ్మీర్ అంశానికి అంతర్జాతీయ రంగు అద్దడానికి చైనాతో కలిసి పాక్ చేసిన కుయుక్తులు బెడిసికొట్టాయి. ఈ సమావేశం జరగడానికి ముందు ఐక్యరాజ్యసమితిలో చైనా రాయబారి ఝాంగ్ జన్, పాక్ రాయబారి మలీహా లోథిలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కశ్మీర్ అంశంపై ఒకదాని తర్వాత ఒకటి చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. కానీ సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆగస్టు మాసానికి భద్రతా మండలి అధినేతగా పోలండ్ అధ్యక్షుడు కొనసాగుతున్నారు. అందుకే కశ్మీర్ అంశంలో ఐరాస తరఫున ఏదైనా ప్రకటన జారీ చేయాలని పోలండ్ అధ్యక్షుడిపై చైనా ఒత్తిడి తీసుకువచ్చింది. యూకే దానికి వంతపాడింది. ద్వైపాక్షిక సమస్యన్న మెజార్టీ దేశాలు.. నాలుగ్గోడల మధ్య జరిగిన ఆ సమావేశం వివరాలు తెలిసిన కొన్ని వర్గాలు మీడియాతో పలు విషయాలు పంచుకున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న మెజార్టీ సభ్య దేశాలు కశ్మీర్ అంశం ద్వైపాక్షిక అంశమని అందులో ఐరాస జోక్యం అనవసరమని అభిప్రాయపడ్డాయి. ఈ అంశంపై సమావేశాన్ని నిర్వహించమని చైనా చెప్పడాన్ని కొన్ని దేశాలు తప్పుపట్టాయి. 370 రద్దుతో భౌగోళికంగా మార్పులు చోటు చేసుకుంటాయన్న చైనా వాదనని కొట్టిపారేశాయి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ (సీపీఈఎస్) ద్వారా మార్పులు వస్తున్నాయి కదాని దుయ్యబట్టాయి. చైనా తానేదైనా చేయదలచుకుంటే తమ దేశ అభిప్రాయంగా ప్రకటన అయినా ఇచ్చుకోవచ్చునని ఆ సమావేశంతో పాల్గొన్న ఇతర దేశాలు పేర్కొన్నాయి. కశ్మీర్ అంశంలో తలదూరిస్తే భారత్ వాదనలకు తమ దగ్గర సమాధానం లేదని యూఎన్ అభిప్రాయపడింది. Üమ్లా ఒప్పందానికి అనుగుణంగానే కశ్మీర్‌పై తాము నిర్ణయం తీసుకున్నామని భారత్ చెబుతోంది. అందుకే ఈ సమావేశానికి హాజరైన సభ్యదేశాలేవీ తమ వైఖరిని వెల్లడించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. అందుకే ఈ సమావేశానికి సంబంధించి మినిట్స్ రికార్డు చేయలేదు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దానినైనా పట్టించుకోవాలని సమావేశంలో చైనా వాదించింది. అయితే అమెరికా, ఫ్రాన్స్, రష్యా, డొమినికన్ రిపబ్లిక్, ఆఫ్రికా దేశాలన్నీ భారత్‌కు మద్దతుగా∙నిలిచాయి. ఫ్రాన్స్, రష్యాలు కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించాయి. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ఆసియాకు మంచివి కావని ఇండోనేసియా సూచించింది. ఉగ్రవాదాన్ని నిరోధిస్తేనే చర్చలు చైనా ఒత్తిడి మేరకు జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం ముగిశాక యూఎన్‌లో పాక్, చైనా రాయబారులు మీడియాను తప్పించుకొని వెళ్లిపోయారు. కానీ యూఎన్‌లో భారత్ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాత్రం పాకిస్తాన్ జర్నలిస్టుల దగ్గరకు స్వయంగా వచ్చి స్నేహపూర్వకంగా కరచాలనం చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ భయోత్పాతం సృష్టిస్తూ ఉంటే ఏ దేశం కూడా చర్చలకు ముందుకు రాదని అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు మానుకుంటేనే భారత్ చర్చలకు ముందుకు వస్తుందని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. సిమ్లా ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని భారత్ ఎప్పుడో ప్రకటించిందని, పాక్ ప్రతిస్పందన కోసం వేచి చూస్తున్నట్టుగా ఒక ప్రశ్నకు సమాధానంగా సయ్యద్ చెప్పారు.