న్యూఢిల్లీ : మోదీ బలహీనమైన వ్యక్తి.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘బలహీనమైన మోదీ షీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారు. భారత ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంటే.. మోదీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. చైనాతో నమో(నరేంద్రమోదీ) దౌత్య సంబంధం ఎలా ఉంటుందంటే.. మోదీ జిన్‌పింగ్‌తో కలిసి గుజరాత్‌లో పర్యటిస్తారు.. ఢిల్లీలో జిన్‌పింగ్‌ను కౌగిలించుకుంటారు.. చైనాలో జిన్‌పింగ్ ముందు తలవంచుతారు’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పని దినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. (మళ్లీ చైనా అడ్డుపుల్ల)
Comments
Please login to add a commentAdd a comment