Jaish-e-Mohammed chief Masood Azhar
-
మసూద్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి
ఐక్యరాజ్యసమితి: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయాలని పేర్కొంటూ నేరుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి ఫ్రాన్స్, బ్రిటన్లు మద్దతు తెలిపాయి. చాలా శక్తిమంతమైన భద్రతామండలిలో నేరుగా అమెరికా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మసూద్‌కు చెందిన ఆస్తులు జప్తు చేసేలా, అతడు ఎక్కడికీ ప్రయాణించకుండా నిషేధాజ్ఞలు విధించాలని అమెరికా కోరింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ స్పందించారు. ‘బలవంతంగా తీర్మానాన్ని ముందుకు జరపడం ఆపాలి. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాను కోరుతున్నాం’ అని అన్నారు. ఈ తీర్మానంపై ఎప్పుడు ఓటింగ్ జరుగుతుందనే విషయంపై స్పష్టతలేదని ఐరాస వర్గాలు చెబుతున్నాయి. 15 మంది (10+5) సభ్యులున్న భద్రతామండలిలో తీర్మానం పాస్ కావాలంటే తొమ్మిది ఓట్లు కావాలి. అయితే శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు అడ్డుకుంటూ ఒక్క వీటో కూడా వేయొద్దు. అప్పుడే ఆ తీర్మానానికి ఆమోద ముద్ర పడుతుంది. ఈసారి కూడా ఎప్పటిలాగే చైనా తన వీటో అధికారంతో ఈ తీర్మానాన్ని అడ్డుకునే వీలుందని నిపుణులు చెబుతున్నారు. అల్‌ఖైదా ఉగ్రసంస్థతో మసూద్‌కు సంబంధాలు ఉన్నాయని, ఆర్థికంగా, ప్రణాళికలు రచించడంలో, ఆయుధాల సరఫరా చేయడంలో మసూద్ సహాయం అందిస్తున్నాడని, జైషేమహ్మద్‌కు సహాయసహకారాలు అందిస్తున్నాడని తీర్మానంలో అమెరికా పేర్కొంది. -
మసూద్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టండి : అమెరికా
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి(ఐరాస) అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మరో అడుగు ముందుకేశాయి. ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. రెండు వారాల క్రితమే అమెరికా ప్రతిపాదనను తన వీటో అధికారంతో చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల సహకారంతో అమెరికా.. ఐక్యరాజ్య సమితిలో అజర్ నిషేధంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భద్రతా మండలిలో ఉన్న 15 సభ్యదేశాలకు బ్రిటన్, ఫ్రాన్స్ సంతకం చేసిన తీర్మానాన్ని అమెరికా సర్క్యూలేట్ చేసింది. అజర్‌పై ట్రావెల్ బ్యాన్ విధించాలని, అతని ఆస్తులను స్తంభింపచేయాలని కోరింది. మళ్లీ చైనా అడ్డుపుల్ల ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనపై కారణాలను సాకుగా చూపుతూ భద్రతామండలిలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా నాలుగోసారి అడ్డుకుంది. దీంతో ఈ సారి కచ్చితంగా అజహర్‌ను నిషేదించేలా అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల జరిగిన పుల్వామాలో దాడిలో తమ పాత్ర ఉనట్లు జైషే అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఉగ్రవాదిపై నిషేధం విధించేందుకు అగ్ర రాజ్యం అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. -
ఓపిగ్గా వ్యవహరిస్తాం
న్యూఢిల్లీ/వాషింగ్టన్/న్యూయార్క్: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి(ఐరాస) అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో ఓపిగ్గా వ్యవహరిస్తామని భారత్ తెలిపింది. అయితే ఉగ్రవాదంపై పోరాటం విషయంలో ఎక్కడా రాజీపడబోమని స్పష్టం చేసింది. పాక్ భూభాగంలో ఆశ్రయం పొందుతున్న కొన్ని ఉగ్రసంస్థలు చైనా ప్రయోజనాలకూ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని గుర్తుచేసింది. ఇటీవల సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ భద్రతామండలిలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా నాలుగోసారి అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్–పాకిస్తాన్ల మధ్య మరే దేశమయినా మధ్యవర్తిత్వం చేయొచ్చన్న వాదనలను తోసిపుచ్చారు. మసూద్ అజహర్ విషయంలో చైనా మెతకవైఖరి నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దౌత్యాధికారులు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయమై చైనా ప్రతినిధులతో చర్చలు ప్రారంభించారు. మసూద్‌ను చైనా భద్రతామండలిలో కాపాడటంపై అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తన సంపాదకీయంలో ఘాటుగా విమర్శించింది. -
మోదీ బలహీనమైన వ్యక్తి..
-
‘మోదీకి అతనంటే చాలా భయం’
న్యూఢిల్లీ : మోదీ బలహీనమైన వ్యక్తి.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘బలహీనమైన మోదీ షీ జిన్‌పింగ్‌కు భయపడుతున్నారు. భారత ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంటే.. మోదీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. చైనాతో నమో(నరేంద్రమోదీ) దౌత్య సంబంధం ఎలా ఉంటుందంటే.. మోదీ జిన్‌పింగ్‌తో కలిసి గుజరాత్లో పర్యటిస్తారు.. ఢిల్లీలో జిన్‌పింగ్‌ను కౌగిలించుకుంటారు.. చైనాలో జిన్‌పింగ్ ముందు తలవంచుతారు’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పని దినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. (మళ్లీ చైనా అడ్డుపుల్ల) -
మళ్లీ చైనా అడ్డుపుల్ల
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుతగిలింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించాయి. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే సభ్యదేశాలు పది పని దినాల్లోగా లేవనెత్తాలి. దీనికి బుధవారంతో గడువు ముగిసింది. చివరి నిమిషంలో సాంకేతిక కారణాలను చూపుతూ ఈ ప్రతిపాదనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వీగిపోయింది. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం పదేళ్ల కాలంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. గతంలోనూ భారత్ యత్నాలను చైనా అడ్డుకుంది. చైనా నిబంధల ప్రకారమే నడుచుకుంటుందని, అజహర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసే ప్రయత్నాలను అడ్డుకోబోతున్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి లు కాంగ్ అంతకుముందే సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసేందుకు అజహర్ తగిన వ్యక్తేనని అమెరికా పేర్కొంది. తాజా పరిణామంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారత పౌరులపై దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్ని అనుసరిస్తామని ప్రకటించింది. తమ ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుపడటంపట్ల విచారం వ్యక్తం చేసింది. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న తమ ప్రతిపాదనకు మద్దతు పలికిన అమెరికా, ఫ్రాన్స్, యూకేలకు కృతజ్ఞతలు తెలిపింది. -
జైషే చీఫ్ మసూద్‌పై రెడ్ కార్నర్ నోటీసు
న్యూఢిల్లీ : పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి, జైషే ఈ మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కు ఇంటర్ పోల్ మంగళవారం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మసూద్ తో పాటు అతడి సోదరుడు అబ్దుల్ రవూఫ్‌లపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది. అలాగే ఇంటర్‌పోల్ ఈ కేసులో మరో ఇద్దరు షాహిద్ లతిఫ్, ఖషీఫ్ జాన్‌పై కూడా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే యోచనలో ఉంది. ఈ ఏడాది జనవరి 2వ తేదీన పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులు, ఏడుగురు కమెండోలు మృతి చెందారు. ఇక పాకిస్థాన్‌లో ఉంటూనే ఈ దాడికి సూత్రధారిగా వ్యవహరించిన మసూద్ అక్కడి నుంచే ఉగ్రవాదులను పంపాడని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో తేల్చింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంటును సీబీఐ ఇంటర్ పోల్ కు పంపి వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా కోరింది. దీనిపై స్పందించిన ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చింది.