
రాహుల్ మండిపాటు
రాయ్‌బరేలీ: అదానీ గ్రూప్ వివాదం వ్యక్తిగతమంటూ ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ‘అదానీ వ్యవహారం నా వ్యక్తిగతం కాదు..దేశానికి సంబంధించిన వ్యవహారం’అంటూ కుండబద్దలు కొట్టారు. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ..అధ్యక్షుడు ట్రంప్‌తో అదానీపై వన లంచాల ఆరోపణలపై చర్చించారా అని మీడియా ప్రశ్నించగా.. ‘అది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం, ఇద్దరు ప్రముఖ ప్రపంచ నేతలు కలుసుకున్నప్పుడు ఇటువంటివి చర్చకు రావు’అని పేర్కొనడం తెలిసిందే.
ప్రధాని మోదీతో భేటీ అనంతరం ట్రంప్ కూడా అదానీ వ్యవహారాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. రాహుల్ శుక్రవారం సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలోని లాల్‌గంజ్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..‘నరేంద్ర మోదీ జీ, ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు..దేశానికి సంబంధించినది. మీరు నిజంగా భారత ప్రధానే అయితే అదానీ వివాదం గురించి ఆరాతీసి ఉండేవారు. ఆరోపణలపై విచారణకు అవసరమైతే అదానీని అమెరికా పంపిస్తానని ట్రంప్‌కు చెప్పి ఉండేవారు. అలాంటిదేమీ లేకుండా, కేవలం వ్యక్తిగతమంటూ వదిలేశారు’అని రాహుల్ పేర్కొన్నారు.
వ్యాపారవేత్త గౌతమ్ అదానీను తన మిత్రుడని పేర్కొన్న మోదీ, ఆయన గురించి ట్రంప్‌ను ఎలాంటి విషయాలు అడగలేదని కూడా చెప్పారని రాహుల్ అన్నారు. అమెరికాలో అదానీపై అవినీతి, దొంగతనం కేసు పెండింగ్‌లో ఉందని రాహుల్ తెలిపారు. సోలార్ పవర్ కాంట్రాక్టుల కోసం అమెరికా కంపెనీలు భారత్‌లోని అధికారులకు రూ.2,100 కోట్ల మేర లంచాలు ఇచ్చినట్లు గత బైడెన్ ప్రభుత్వంలోని న్యాయశాఖ ఆరోపించింది. ఇందులో అదానీ గ్రూప్‌కు కూడా సంబంధమున్నట్లు తెలిపింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూపు నిరాధారాలంటూ ఖండించింది.
యోగి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ కాదు..అసలు ఇంజినే లేదు
యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. యూపీలో ఉన్నది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదు..ఘోరంగా విఫలమైన అసలు ఇంజినే లేని ప్రభుత్వమంటూ ఎద్దేవా చేశారు. కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మంచిగా పనిచేస్తుండగా, యూపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత విఫలమైన ప్రభుత్వమని దుయ్యబట్టారు.
యూపీ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదన్నారు. మరో వైపు, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణలో మునిగిపోయిందని చెప్పారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. కర్ణాటక, తెలంగాణ మాదిరిగా తయారు చేస్తుంది. నోట్ల రద్దు వల్లే అవినీతితోపాటు చదువుకున్న యువతలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఉద్యోగావకాశాలను సృష్టించాలంటే మొదటగా చేయాల్సిన పని చిన్న పరిశ్రమలను బలోపేతం చేసిన రక్షణ కల్పించడమే’ అని రాహుల్ సూచించారు. వ్యక్తిగతమన్న మోదీ వ్యాఖ్యలపై
Comments
Please login to add a commentAdd a comment