వారిద్దరూ సహకరించుకుంటూ సురక్షితంగా ఉంటున్నారు
దేశ సంపదను మోదీ సంపన్న మిత్రులకు కట్టబెడుతున్నారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆగ్రహం
ముంబై/రాంచీ: ‘ఏక్ హై తో సేఫ్ హై’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సేఫ్ అంటే సురక్షితంతోపాటు బీరువా అనే అర్థం కూడా ఉంది. మోదీ పిలుపునకు, ముంబైలో అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టిన ధారావి అభివృద్ధి పథకాన్ని ముడిపెడుతూ విమర్శలు గుప్పించారు. రాహుల్ సోమవారం ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వెంట ఒక సేఫ్(చిన్నపాటి బీరువా) కూడా తీసుకొచ్చారు. అందులోంచి రెండు పోస్టర్లు బయటకు లాగారు.
ఒక పోస్టర్‌పై నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీ ఫోటో, మరో పోస్టర్‌పై ధారావి మ్యాప్ ఉంది. మోదీ, అదానీ ఫోటోపై ‘ఏక్ హై తో సేఫ్ హై’ అనే పిలుపును ముద్రించారు. కలిసి ఉంటే సురక్షితంగా ఉంటామని మోదీ చెబుతున్నారని, వాస్తవానికి సురక్షితంగా ఉన్నది ఎవరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీ, అదానీ కలిసికట్టుగా ముందుకుసాగుతూ, ఒకరికొకరు చక్కగా సహకరించుకుంటూ సురక్షితంగా ఉంటున్నారని మండిపడ్డారు. ధారావి అభివృద్ధి ప్రాజెక్టు పేరిట రూ.లక్ష కోట్ల విలువైన భూమిని అదానీకి అప్పగించారని మండిపడ్డారు. కేవలం అదానీ ప్రయోజనాల కాపాడేలా ధారావి ప్రాజెక్టు టెండర్లు రూపొందించారని విమర్శించారు.
ధారావి ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి బడా పారిశ్రామికవేత్తల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోందని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఇతర పారిశ్రామికవేత్తలకు దక్కిన ప్రాజెక్టులను నరేంద్ర మోదీకి సన్నిహితులైన బిలియనీర్లకు అప్పగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. దేశంలో ఓడరేవులు, విమానాశ్రయాలతోపాటు దేశ సంపదను కేవలం ఒకే ఒక్క వ్యక్తికి కట్టబెడుతున్నారని ఆరోపించారు.
మోదీ, అమిత్ షా, అదానీ కలిసుంటారు
‘‘ప్రధాని మోదీ ప్రవచిస్తున్న ‘ఏక్ హై తో సేఫ్ హై’కి అసలు అర్థం నేను చెబుతా. నరేంద్ర మోదీ, అమిత్ షా, గౌతమ్ అదానీ కలిసి ఉంటే సురక్షితంగా ఉంటారు. ఆ ముగ్గురూ కలిసే ఉంటున్నారు. దేశ సంపద మొత్తం అదానీ, అంబానీ లాంటి బడా బాబుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. టెండర్లలో పారదర్శకతకు పాతరవేసి, ప్రాజెక్టులను వారికి కట్టబెడుతున్నారు’’ అని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఆయన సోమవారం జార్ఖండ్ రాజధాని రాంచీలో మీడియాతో మాట్లాడారు. మణిపూర్ గత ఏడాదిన్నర కాలంగా మండిపోతున్నా ప్రధాని మోదీ మొద్దునిద్ర వీడడం లేదని అన్నారు. హింసాకాండలో అమాయక ప్రజలు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకంగా కాదని రాహుల్ తేల్చిచెప్పారు. రిజర్వేషన్లను మరింత పెంచాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment