పసివాళ్ల నెత్తుటితో తడుస్తున్న సిరియా | Violence Stops Aid Efforts for Syria’s Ghouta Area | Sakshi
Sakshi News home page

బాల్యం శిథిలం

Published Fri, Mar 9 2018 2:06 AM | Last Updated on Fri, Mar 9 2018 8:16 AM

Violence Stops Aid Efforts for Syria’s Ghouta Area - Sakshi

ఘాటాలోని ఓ ఆసుపత్రిలో వైద్యం కోసం ఎదురుచూస్తున్న చిన్నారులు

డమాస్కస్‌: ఒక్క దృశ్యం గుండెల్ని పిండేసింది. కరడు గట్టిన హృదయాల్ని కరిగించింది. సిరియాలో అంతర్యుద్ధం ముక్కుపచ్చలారని బాల్యాన్ని ఎలా ఛిద్రం చేస్తోందో ఒక్క చిత్రంతో తెలుసుకున్న ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. 2011 నుంచి అంతర్యుద్ధంతో అతలాకుతలమైపోతున్న సిరియా నుంచి పొట్ట చేత్తో పట్టుకొని ఎన్నో కుటుంబాలు వివిధ దేశాలకు వలస వెళ్లిపోతున్నాయి. సరిగ్గా మూడేళ్ల క్రితం అలా యూరప్‌కు పడవలో వెళుతూ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొని టర్కీ బీచ్‌లోకి కొట్టుకొని వచ్చిన మూడేళ్ల చిన్నారి అలన్‌ కుర్దీ  నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి  ప్రపంచమే కన్నీరు పెట్టింది.

నీలం రంగు ప్యాంటు, ఎర్ర షర్టు వేసుకొని ఇసుక మేటల్లో విగతజీవిగా పడిఉన్న ఆ బాలుడి చిత్రం ఇప్పటికీ ఎందరినో వెంటాడుతోంది. సిరియాలో పువ్వులాంటి బాల్యం ఆధిపత్య పోరులో ఇంకా నలిగిపోతూనే ఉంది. పసివాళ్ల నెత్తుటితో నేలను తడిపేస్తున్నారు. బాంబుల మోతలు, క్షిపణుల గర్జనల మధ్య చిన్నారుల ఏడుపులు, వారి తల్లిదండ్రుల ఆక్రందనలు గాల్లో కలిసిపోతున్నాయి. బాల్యం రక్తమోడుతున్న ఎన్నో దృశ్యాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

క్షిపణి దాడులతో ఘాటా విధ్వంసం..
సిరియా రాజధాని డమాస్కస్‌కు సమీపంలో తిరుగుబాటుల అధీనంలో ఉన్న తూర్పు ఘాటా ప్రాంతాన్ని తిరిగి వశం చేసుకోవడానికి ప్రభుత్వ నేతృత్వంలోని సైనికులు చేస్తున్న దాడులు, తిరుగుబాటుదారుల ప్రతిదాడులు ఏ పాపం తెలీని పసివాళ్ల ఉసురు తీస్తున్నాయి. ఘాటాలో దాదాపుగా నాలుగు లక్షల మంది జనాభా ఉంటే..అందులో మూడో వంతు మంది చిన్నారులే. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలన్న తీర్మానాన్ని సిరియా ప్రభుత్వం అటకెక్కించింది.

సిరియా ప్రభుత్వ సైన్యం, దానికి మద్దతుగా రష్యా సైన్యం జరుపుతున్న వైమానిక దాడుల్లో గత రెండు నెలల్లోనే 342 మంది పసివాళ్లు ప్రాణాలు కోల్పోగా, 803 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షిపణి దాడులతో శిథిల భవనాల కింద నలిగిపోతున్న చిన్నారుల్ని చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. ప్రే ఫర్‌ సిరియా హ్యాష్‌ ట్యాగ్‌తో గాయపడిన పసివాళ్ల ఫోటోలను షేర్‌ చేస్తూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సేకరించిన వివరాల ప్రకారం.. సిరియాలో ఆపన్న హస్తం కోసం 86 లక్షల మంది బాలలు ఎదురుచూస్తున్నారు.

శరణార్థి శిబిరాల్లో సుమారు 30 లక్షల మంది పిల్లలు ఆవాసం పొందుతున్నారు. 28 లక్షల మంది చిన్నారులు బడి ముఖం కూడా చూడటం లేదు. కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేక గడ్డకట్టే చలిలో వేలాది మంది పిల్లలు వణికిపోతూ కాలం గడుపుతున్నారు. రసాయన దాడులకు గురై వేల మంది చిన్నారులు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. యూనిసెఫ్‌కు చెందిన 200 మందికి పైగా సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెడుతూ సిరియా చిన్నారుల్ని కాపాడటానికి తమ వంతు శ్రమిస్తున్నారు.

శిబిరాల్లో 30 లక్షల మంది
► సిరియాలో రెండు నెలల్లో ప్రాణాలు కోల్పోయిన 342 మంది చిన్నారులు
► 803 మంది పసివాళ్లకు తీవ్ర గాయాలు
► ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బాలలు 86 లక్షలు
► శరణార్థి శిబిరాల్లో ఉన్న చిన్నారులు 30 లక్షలు
► బడి ముఖం కూడా చూడని బాలలు 28 లక్షలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement