పాక్‌ పరువుపోయింది | UNSC appreciates India steps in Jammu & Kashmir after curbs eased | Sakshi
Sakshi News home page

పాక్‌ పరువుపోయింది

Published Sun, Aug 18 2019 3:18 AM | Last Updated on Sun, Aug 18 2019 11:43 AM

UNSC appreciates India steps in Jammu & Kashmir after curbs eased - Sakshi

ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా మరోసారి భంగపాటు ఎదురైంది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని భారత్‌ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన 15 దేశాల రహస్య సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. సంయుక్త ప్రకటన విడుదల చేయాలన్న చైనా ఒత్తిడిని యూఎన్‌ బేఖాతర్‌ చేసింది. భారత్, పాక్‌ దేశాల మధ్య ద్వైపాక్షికంగా పరిష్కారం కావల్సిన కశ్మీర్‌ అంశానికి అంతర్జాతీయ రంగు అద్దడానికి చైనాతో కలిసి పాక్‌ చేసిన కుయుక్తులు బెడిసికొట్టాయి.

ఈ సమావేశం జరగడానికి ముందు ఐక్యరాజ్యసమితిలో చైనా రాయబారి ఝాంగ్‌ జన్, పాక్‌ రాయబారి మలీహా లోథిలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కశ్మీర్‌ అంశంపై ఒకదాని తర్వాత ఒకటి చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. కానీ సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆగస్టు మాసానికి భద్రతా మండలి అధినేతగా పోలండ్‌ అధ్యక్షుడు కొనసాగుతున్నారు. అందుకే కశ్మీర్‌ అంశంలో ఐరాస తరఫున ఏదైనా ప్రకటన జారీ చేయాలని పోలండ్‌ అధ్యక్షుడిపై చైనా ఒత్తిడి తీసుకువచ్చింది.
యూకే దానికి వంతపాడింది.  

ద్వైపాక్షిక సమస్యన్న మెజార్టీ దేశాలు..
నాలుగ్గోడల మధ్య జరిగిన ఆ సమావేశం వివరాలు తెలిసిన కొన్ని వర్గాలు మీడియాతో పలు విషయాలు పంచుకున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న మెజార్టీ సభ్య దేశాలు కశ్మీర్‌ అంశం ద్వైపాక్షిక అంశమని అందులో ఐరాస జోక్యం అనవసరమని అభిప్రాయపడ్డాయి. ఈ అంశంపై సమావేశాన్ని నిర్వహించమని చైనా చెప్పడాన్ని కొన్ని దేశాలు తప్పుపట్టాయి. 370 రద్దుతో భౌగోళికంగా మార్పులు చోటు చేసుకుంటాయన్న చైనా వాదనని కొట్టిపారేశాయి. చైనా పాకిస్తాన్‌ ఎకనామిక్‌ కారిడర్‌ (సీపీఈఎస్‌) ద్వారా మార్పులు వస్తున్నాయి కదాని దుయ్యబట్టాయి. చైనా తానేదైనా చేయదలచుకుంటే తమ దేశ అభిప్రాయంగా ప్రకటన అయినా ఇచ్చుకోవచ్చునని ఆ సమావేశంతో పాల్గొన్న ఇతర దేశాలు పేర్కొన్నాయి.

కశ్మీర్‌ అంశంలో తలదూరిస్తే భారత్‌ వాదనలకు తమ దగ్గర సమాధానం లేదని యూఎన్‌ అభిప్రాయపడింది. Üమ్లా ఒప్పందానికి అనుగుణంగానే కశ్మీర్‌పై తాము నిర్ణయం తీసుకున్నామని భారత్‌  చెబుతోంది. అందుకే ఈ సమావేశానికి హాజరైన సభ్యదేశాలేవీ తమ వైఖరిని వెల్లడించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. అందుకే ఈ సమావేశానికి సంబంధించి మినిట్స్‌ రికార్డు చేయలేదు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దానినైనా పట్టించుకోవాలని సమావేశంలో చైనా వాదించింది. అయితే అమెరికా, ఫ్రాన్స్, రష్యా, డొమినికన్‌ రిపబ్లిక్, ఆఫ్రికా దేశాలన్నీ భారత్‌కు మద్దతుగా∙నిలిచాయి. ఫ్రాన్స్, రష్యాలు కశ్మీర్‌ సమస్య ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించాయి. భారత్, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు ఆసియాకు మంచివి కావని ఇండోనేసియా సూచించింది.  

ఉగ్రవాదాన్ని నిరోధిస్తేనే చర్చలు
చైనా ఒత్తిడి మేరకు జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం ముగిశాక యూఎన్‌లో పాక్, చైనా రాయబారులు మీడియాను తప్పించుకొని వెళ్లిపోయారు. కానీ యూఎన్‌లో భారత్‌ శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ మాత్రం పాకిస్తాన్‌ జర్నలిస్టుల దగ్గరకు స్వయంగా వచ్చి స్నేహపూర్వకంగా కరచాలనం చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ భయోత్పాతం సృష్టిస్తూ ఉంటే ఏ దేశం కూడా చర్చలకు ముందుకు రాదని అన్నారు. పాకిస్తాన్‌ ఉగ్రవాద కార్యకలాపాలు మానుకుంటేనే భారత్‌ చర్చలకు ముందుకు వస్తుందని అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు. సిమ్లా ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని భారత్‌ ఎప్పుడో ప్రకటించిందని, పాక్‌ ప్రతిస్పందన కోసం వేచి చూస్తున్నట్టుగా ఒక ప్రశ్నకు సమాధానంగా సయ్యద్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement