న్యూయార్క్ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్ వ్యవహరించిన తీరుపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) రహస్య సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక బృందం నేతృత్వంలో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నట్లు యూఎన్‌ఎస్‌సీ అధ్యక్షుడు జోనా రోనెకా తెలిపారు. కాగా కశ్మీర్ విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలపై స్పందించాల్సిందిగా పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి మంగళవారం లేఖ రాశారు. అదే విధంగా ఈ విషయంలో చొరవ చూపాల్సిందిగా చైనాను, పోలాండ్ రాయబారి జోనా రోనెకాను కోరారు.
‘ ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న విధానాలు ఐక్యరాజ్యసమితి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. భారత్ అక్రమ చర్యలకు పాల్పడుతోందని మేము భావిస్తున్నాం. ఈ విషయంపై ప్రత్యేక సమావేశం జరపాల్సిందిగా కోరుతున్నాం అని ఖురేషి లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని చైనా యూఎన్‌ఎస్‌సీ అధ్యక్షుడితో చర్చించిన క్రమంలో శుక్రవారం భేటీ జరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో పాకిస్తాన్ పాల్గొనబోదని యూఎన్ అధికారి పేర్కొనట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఇక కశ్మీర్ విషయంలో చైనా తమకు అండగా నిలుస్తుందని ఖురేషి పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల చైనాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. కశ్మీర్ అంశం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. అయితే ఈ రహస్య సమావేశం ద్వారా పాక్‌కు ఏమాత్రం ప్రయోజనం కలిగే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment