ఇస్లామాబాద్ : నెహ్రూ భారతదేశాన్ని నరేంద్ర మోదీ సమాధి చేశారంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత విధానం మొత్తం దోవల్ సిద్ధాంతం చుట్టే తిరుగుతోందని విమర్శించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో దాయాది దేశం భారత్‌పై విద్వేషపూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌కు అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా రష్యా కశ్మీర్ అంశంలో భారత్‌ను సమర్థించాయి. దీంతో కంగుతిన్న పాకిస్తాన్ తన మిత్రదేశమైన చైనా సహాయంతో ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని చర్చించే దిశగా పావులు కదిపింది. ఈ క్రమంలో చైనా జోక్యంతో యూఎన్ భద్రతా మండలిలో శుక్రవారం కశ్మీర్ విషయమై రహస్య సమావేశం జరిగింది. కానీ యూఎన్ శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే ఇది భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశాయి. దీంతో అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిని చేద్దామనుకున్న పాకిస్తాన్‌కు చుక్కెదురైంది.
ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఆగష్టు 6న ఏర్పాటైన కశ్మీర్ కమిటీ శనివారం అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటికి హాజరైన ఖురేషి విలేకరులతో మాట్లాడుతూ...కశ్మీర్ అంశంపై పురోగతి సాధించే దిశగా చర్చలు జరిపినట్లు తెలిపారు. ‘ కశ్మీర్ విషయంలో పాక్ పార్లమెంట్ ఏకతాటిపై ఉంది. కశ్మీర్ కమిటీ తీర్మానానికి ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. మేమంతా కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించాం. ఈరోజు సమావేశంలో కూడా అదే చర్చించాం’ అని పేర్కొన్నారు. యూఎన్ భద్రతా మండలి రహస్య సమావేశాన్ని ప్రస్తావిస్తూ..దాదాపు 50 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ విషయంలో తాము అతిపెద్ద విజయం సాధించామని ప్రగల్భాలు పలికారు. శుక్రవారం నాటి సమావేశం చారిత్రాత్మకమైందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment