ఐక్యరాజ్య సమితి: జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని భారత్ తొలగించిన అంశంపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి శుక్రవారం రహస్య చర్చలు జరిపింది. పాకిస్తాన్ కోసం దాని మిత్రదేశం చైనా విజ్ఞప్తి మేరకు ఈ రహస్య చర్చలు జరిగాయి. అయితే ఇవి రహస్య చర్చలైనందున లోపల ఏ దేశం ఏం మాట్లాడిందనే విషయం బయటకు రాలేదు. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత, పది తాత్కాలిక (మొత్తం 15) సభ్య దేశాలే ఈ చర్చల్లో పాల్గొంటున్నాయి.
భారత్, పాక్‌లకు భద్రతా మండలిలో ఎలాంటి సభ్యత్వమూ లేనందున ఈ రెండు దేశాలు ఆ రహస్య చర్చల్లో పాల్గొన లేదు. తమ ప్రతినిధికి కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ అభ్యర్థించినా భద్రతా మండలి అందుకు ఒప్పుకోలేదు. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లతోపాటు తాత్కాలిక సభ్యదేశాలైన జర్మనీ, బెల్జియం, కువైట్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, పోలాండ్, పెరూ, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెటోరియల్ గినియా, కోట్ డీఐవరీలు రహస్య చర్చల్లో పాల్గొన్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం పూర్తిగా తమ అంతర్గత అంశమని భారత్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు స్పష్టం చేయగా, పాక్ మాత్రం ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తి వివాదాస్పదం చేస్తోంది.
శాంతంగా పరిష్కరించుకోవాలి: రష్యా, చైనా
చర్చల్లో పాల్గొనడానికి ముందు ఐరాసలో రష్యా ఉప శాశ్వత ప్రతినిధి దిమిత్రీ పోల్యాంస్కీ మాట్లాడుతూ కశ్మీర్ అంశం భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక అంశంగానే రష్యా చూస్తోందని అన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే ప్రస్తుతం ఈ రహస్య చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. రహస్య చర్చలు ముగిసిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో చైనా రాయబారి ఝాంగ్ జున్ మాట్లాడుతూ భారత్, పాక్‌లు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పద్ధతిని మానుకోవాలని సూచించారు. లదాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంపై ఆయన స్పందిస్తూ, భారత చర్యలు చైనా సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేలా ఉన్నాయనీ, సరిహద్దులపై ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించడం పట్ల చైనా కూడా ఆందోళనతో ఉందని అన్నారు.
ఉగ్రవాదం ఆపితేనే చర్చలు: భారత్
ఉగ్రవాద చర్యలు, కార్యకలాపాలను పాకిస్తాన్ ఆపిన తర్వాతే ఆ దేశంతో చర్చలు జరుపుతామని ఐరాసలో భారత ప్రతినిధి అక్బరుద్దీన్ అన్నారు. రహస్య చర్చలు ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో భారత్ చెప్పినట్లుగానే కశ్మీర్‌లో 370వ అధికరణం రద్దు అంశం భారత అంతర్గత వ్యవహారమన్నారు. ఇతర దేశాలకు దీనితో పనిలేదన్నారు. పాక్‌పై ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ, కశ్మీర్‌లో ఏదో జరిగిపోతోందని భయపెట్టేలా పాక్ ప్రవర్తిస్తోందనీ, ఇది వాస్తవ దూరమని అన్నారు. కశ్మీర్ అంశంపై రెండు దేశాలు (పాక్, చైనా) తమ అభిప్రాయాలను అంతర్జాతీయ సమాజం అభిప్రాయంగా మార్చాలనుకున్నాయనీ, కానీ అది జరగలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment