Secret talks
-
ఫడ్నవీస్, అజిత్ పవార్ రహస్య చర్చలు
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో ఆదివారం రాత్రి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమావేశమయ్యారు. కొద్దిసేపు ఇద్దరు నేతలు రహస్య చర్చలు జరిపారు. వీరిద్దరూ బల నిరూపణకు తీసుకోవలసిన చర్యలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. అయితే రైతాంగ సంక్షోభంపై వారిద్దరు చర్చించారని ఆ తరువాత సీఎంఓ ట్వీట్ చేసింది. ముగ్గురు ఎన్సీపీ ఎమ్మెల్యేలను బీజేపీ తీసుకెళ్లింది: నవాబ్ మాలిక్ ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ముగ్గురిని బీజేపీ విమానంలో ఢిల్లీకి తీసుకువెళ్లిందని నవాబ్ మాలిక్ ఆరోపించారు. తాము ఎన్సీపీతోనే ఉన్నామని వారు ఆ తరువాత వీడియో సందేశాలు పంపించారన్నారు. -
కశ్మీర్‌పై ఐరాసలో రహస్య చర్చలు
ఐక్యరాజ్య సమితి: జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని భారత్ తొలగించిన అంశంపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి శుక్రవారం రహస్య చర్చలు జరిపింది. పాకిస్తాన్ కోసం దాని మిత్రదేశం చైనా విజ్ఞప్తి మేరకు ఈ రహస్య చర్చలు జరిగాయి. అయితే ఇవి రహస్య చర్చలైనందున లోపల ఏ దేశం ఏం మాట్లాడిందనే విషయం బయటకు రాలేదు. భద్రతా మండలిలోని ఐదు శాశ్వత, పది తాత్కాలిక (మొత్తం 15) సభ్య దేశాలే ఈ చర్చల్లో పాల్గొంటున్నాయి. భారత్, పాక్‌లకు భద్రతా మండలిలో ఎలాంటి సభ్యత్వమూ లేనందున ఈ రెండు దేశాలు ఆ రహస్య చర్చల్లో పాల్గొన లేదు. తమ ప్రతినిధికి కూడా చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ అభ్యర్థించినా భద్రతా మండలి అందుకు ఒప్పుకోలేదు. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లతోపాటు తాత్కాలిక సభ్యదేశాలైన జర్మనీ, బెల్జియం, కువైట్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, పోలాండ్, పెరూ, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెటోరియల్ గినియా, కోట్ డీఐవరీలు రహస్య చర్చల్లో పాల్గొన్నాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం పూర్తిగా తమ అంతర్గత అంశమని భారత్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు స్పష్టం చేయగా, పాక్ మాత్రం ఈ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తి వివాదాస్పదం చేస్తోంది. శాంతంగా పరిష్కరించుకోవాలి: రష్యా, చైనా చర్చల్లో పాల్గొనడానికి ముందు ఐరాసలో రష్యా ఉప శాశ్వత ప్రతినిధి దిమిత్రీ పోల్యాంస్కీ మాట్లాడుతూ కశ్మీర్ అంశం భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక అంశంగానే రష్యా చూస్తోందని అన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే ప్రస్తుతం ఈ రహస్య చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. రహస్య చర్చలు ముగిసిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో చైనా రాయబారి ఝాంగ్ జున్ మాట్లాడుతూ భారత్, పాక్‌లు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పద్ధతిని మానుకోవాలని సూచించారు. లదాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంపై ఆయన స్పందిస్తూ, భారత చర్యలు చైనా సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేలా ఉన్నాయనీ, సరిహద్దులపై ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించడం పట్ల చైనా కూడా ఆందోళనతో ఉందని అన్నారు. ఉగ్రవాదం ఆపితేనే చర్చలు: భారత్ ఉగ్రవాద చర్యలు, కార్యకలాపాలను పాకిస్తాన్ ఆపిన తర్వాతే ఆ దేశంతో చర్చలు జరుపుతామని ఐరాసలో భారత ప్రతినిధి అక్బరుద్దీన్ అన్నారు. రహస్య చర్చలు ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో భారత్ చెప్పినట్లుగానే కశ్మీర్లో 370వ అధికరణం రద్దు అంశం భారత అంతర్గత వ్యవహారమన్నారు. ఇతర దేశాలకు దీనితో పనిలేదన్నారు. పాక్‌పై ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ, కశ్మీర్లో ఏదో జరిగిపోతోందని భయపెట్టేలా పాక్ ప్రవర్తిస్తోందనీ, ఇది వాస్తవ దూరమని అన్నారు. కశ్మీర్ అంశంపై రెండు దేశాలు (పాక్, చైనా) తమ అభిప్రాయాలను అంతర్జాతీయ సమాజం అభిప్రాయంగా మార్చాలనుకున్నాయనీ, కానీ అది జరగలేదని పేర్కొన్నారు. -
అణు నిరాయుధీకరణపై చర్చకు కిమ్ ఓకే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో అణు నిరాయుధీకరణపై చర్చలు జరిపేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అంగీకరించినట్లు వైట్‌హౌస్‌లోని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఉ.కొరియా ప్రతినిధులు కిమ్ నిర్ణయాన్ని తమకు చెప్పారన్నారు. మరోవైపు ట్రంప్–కిమ్ భేటీపై ఇరుదేశాల ఇంటెలిజెన్స్ అధికారుల మధ్య ఇప్పటికే రహస్య చర్చలు ప్రారంభమయ్యాయని సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. మంగోలియా లేదా స్వీడన్లో ట్రంప్–కిమ్‌ల మధ్య భేటీ జరిగే అవకాశముందని వెల్లడించింది. కాగా, తాను కిమ్‌తో ఈ ఏడాది మే లేదా జూన్‌లో సమావేశమవుతానని ట్రంప్ వెల్లడించారు. -
బ్యాంకాక్ చర్చలు
ఇరుగు పొరుగు దేశాలన్నాక సమస్యలుంటాయి. పర్యవసానంగా ఉద్రిక్తతలుంటాయి. నిరంతర చర్చల ద్వారానే అవి సద్దుమణుగుతాయి. కనుక భార త్-పాకిస్థాన్‌ల మధ్య థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో తాజాగా జరిగిన చర్చలను శాంతికాముకులందరూ స్వాగతిస్తారు. ఈ చర్చల్లో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, విదేశాంగ కార్యదర్శులు పాల్గొనడం...జమ్మూ-కశ్మీర్, ఉగ్రవాదం, భద్రత, అధీనరేఖవద్ద ప్రశాంతత వంటి అంశాలు ప్రస్తావనకొచ్చాయని ఉమ్మడి ప్రకటన వెల్లడించడం హర్షించదగిన విషయం. అయితే ఈ చర్చలు మూడో దేశంలో జరగడం...జాతీయ భద్రతా సలహాదారులు, విదేశాంగ కార్యదర్శులు పాల్గొన్న కీలక సమావేశం ఉమ్మడి ప్రకటన వెలువడే వరకూ అత్యంత రహస్యంగా ఉండిపోవడం రెండు దేశాల్లోనూ నెలకొన్న స్థితిగతులను పట్టిచూపుతాయి. చర్చల సంగతి ముందుగా వెల్లడైతే వాటిని భగ్నం చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించే శక్తులు రెండు దేశాల్లోనూ ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. పాకిస్థాన్‌లో సైన్యం సైతం అలాంటి పాత్ర పోషిస్తున్నది. అలాంటి వారివల్లే చర్చలు నిరుపయోగమవుతూ వచ్చాయి. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తరాదన్న ఉద్దేశంతోనే చర్చలకు బ్యాంకాక్‌ను ఎంచుకున్నట్టున్నారు. చర్చల్లో రహస్యమెందుకని రెండు దేశాల్లోని విపక్షాలూ ఇప్పటికే ఆగ్రహిస్తున్నాయి. మూడు యుద్ధాలు, కార్గిల్ ఘర్షణలు, అడపా దడపా సరిహద్దుల్లో సాగే కాల్పులు రెండు దేశాల సంబంధాలనూ కోలుకోలేనంతగా దెబ్బతీశాయి. మొన్న జూలైలో రష్యాలోని ఉఫాలో బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ(ఎస్ఓసీ) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య చర్చలు జరిగాయి. అరగంట అనుకున్న చర్చలు గంటసేపు సాగడంతో అవి మెరుగైన వాతావరణం ఏర్పడటానికి దోహదపడగలవని అందరూ ఆశించారు. ఇద్దరు అధినేతలూ విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన సైతం ఆ ఆశల్ని పెంచింది. చర్చల ప్రక్రియ పునరుద్ధరణ, ముంబై దాడి కేసు నిందితులపై త్వరితగతిన విచారణ అందులోని ప్రధానాంశాలు. అన్ని రకాల ఉగ్రవాదాన్నీ ఖండిస్తున్నట్టు కూడా ఆ ఉమ్మడి ప్రకటన తెలిపింది. ఇంతలోనే పాకిస్థాన్‌లో ఉరుములూ, మెరుపులూ మొదలయ్యాయి. కశ్మీర్ అంశం లేకుండా చర్చలకెలా ఒప్పుకుంటారంటూ అక్కడి ఛాందసవాద శక్తులు షరీఫ్‌పై విరుచుకుపడ్డాయి. సరిహద్దుల్లో తుపాకుల మోత ప్రారంభమైంది. ఉద్రిక్తతలు ఈ స్థాయికి చేరినా చర్చలు యధాప్రకారం ఉంటాయని మొదట్లో రెండు దేశాలూ చెప్పాయి. ఇంతలో హఠాత్తుగా వేర్పాటువాద సంస్థ హుర్రియత్ వివాదం తెరపైకి వచ్చింది. చర్చల కోసం న్యూఢిల్లీ వెళ్లే తమ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ హుర్రియత్ నేతలను కలుస్తారని పాక్ ప్రకటించడంతో అవి కాస్తా ప్రతిష్టంభనలో పడ్డాయి. మూడో పక్షం ప్రమేయాన్ని ఒప్పుకోబోమని మన దేశం స్పష్టం చేసింది. దాంతో చర్చలు రద్దు చేసుకుంటున్నట్టు పాక్ చివరి నిమిషంలో ప్రకటించింది. ఇదంతా నాలుగునెలలనాటి పరిణామం. నిరుడు ఆగస్టులో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు సైతం ఇదే కారణంతో రద్దయినప్పుడు ఉఫాలో రెండు దేశాల అధినేతలూ ఆ విషయం జోలికి పోకుండా చర్చలపై కొత్తగా నిర్ణయం తీసుకోవడంవల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. ఉఫా చర్చలు సాధించాయనుకున్న సత్ఫలితాలు కాస్తా నీరుగారాయి. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ ఈ నెలలో కలుసుకున్నారు. పారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ఈ సమావేశం బ్యాంకాక్ చర్చలకు దారి తీసిందని ఉమ్మడి ప్రకటన అంటున్నది. కశ్మీర్ ప్రస్తావన లేని చర్చలేమిటని పాకిస్థాన్...హుర్రియత్‌తో పాక్ మాట్లాడదల్చుకుంటే ఇక చర్చలే ఉండబోవని మన దేశమూ భీష్మించుకుని కూర్చున్న తరుణంలో తాజా చర్చలు కారుచీకట్లో కాంతి రేఖలా కనబడుతున్నాయి. ఉమ్మడి ప్రకటన కశ్మీర్ సమస్య గురించి ప్రస్తావించడంతో పాక్ కోరిక ఈడేరింది. ఈ చర్చలు ఢిల్లీలో కాక బ్యాంకాక్‌లో జరిగాయి గనుక హుర్రియత్ నేతలను కలవాల్సిన అవసరం పాక్ నాయకులకు లేకపోయింది. ఆ విధంగా మన ప్రభుత్వ ‘పట్టుదల’ నెరవేరింది. ఈ రహస్య చర్చలకు కొనసాగింపుగా మంగళవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ వెళ్లబోతున్నారు. ఆ సందర్భంగా ఆమె నవాజ్ షరీఫ్‌నూ, సర్తాజ్ అజీజ్నూ కూడా కలుస్తారు. శాంతియుత, సుస్థిర, సుసంపన్న దక్షిణాసియా సాధించాలన్న మోదీ, షరీఫ్‌ల దార్శనికత మార్గదర్శకంగా ఈ చర్చలు జరిగాయని బ్యాంకాక్ ఉమ్మడి ప్రకటన చెబుతోంది. గత కొన్ని రోజులుగా పరస్పరం సంబంధం లేనట్టుగా కనబడిన ఘటనల, మాటల వెనక నిర్దిష్టమైన ప్రయోజనం ఉన్నదని తాజా చర్చలు చెబుతున్నాయి. నవంబరు నెలాఖరున కామన్వెల్త్ దేశాధినేతల సమావేశం సందర్భంగా బ్రిటన్ ప్రధాని కామెరాన్‌ను కలిసినప్పుడు భారత్‌తో చర్చలకు తమ దేశం ఎలాంటి ముందస్తు షరతులూ విధించబోదని షరీఫ్ హామీ ఇచ్చారు. అంతకుముందు అమెరికా పర్యటనకెళ్లిన పాక్ సైనిక దళాల చీఫ్ సైతం స్వరం మార్చుకున్నారు. ఈ పరిణామాల తర్వాతే పారిస్‌లో మోదీ, షరీఫ్‌ల సమావేశం సాధ్యపడిందని మరిచిపోకూడదు. అది ఏదో రెండు నిమిషాల మొక్కుబడి సమావేశంగా కనబడినా దానికొక పరమార్ధం ఉన్నదని అప్పుడే కొందరు విశ్లేషకులు జోస్యం చెప్పారు. ఐఎస్ ఉగ్రవాదులు రష్యా విమానాన్ని కూల్చడం, పారిస్‌పై దాడి చేయడం వంటి ఉదంతాలతోపాటు నాలుగు రోజుల క్రితం అమెరికాలో 14మందిని కాల్చిచంపడం వంటివి అగ్రరాజ్యాలను వణికిస్తున్నాయి. దక్షిణాసియాలో భారత్-పాక్‌ల మధ్య సయోధ్య సాధిస్తే, అఫ్ఘాన్‌లో ప్రశాంతత ఏర్పడితే ఉగ్రవాదులను అణచడం సులభమవుతుందని అవి విశ్వసిస్తున్నాయి. కనుకనే అమెరికా, బ్రిటన్లు తెరవెనక కృషి చేసి బ్యాంకాక్ చర్చలకు దోహదపడ్డాయి. కారణం ఏదైనా భారత్-పాక్‌లు రెండూ సమస్యల పరిష్కారానికి కలిసి కదిలితే, ఆ ప్రయత్నాలు ఫలప్రదమైతే అవి ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. రెండు దేశాలనూ పట్టిపీడిస్తున్న నిరుద్యోగం, నిరక్షరాస్యత, మౌలిక సదుపాయాల లేమి వంటివి విరగడవుతాయి. ప్రస్తుత వాతావరణం అందుకు దోహదపడాలని కోరుకుందాం.