బ్యాంకాక్ చర్చలు
ఇరుగు పొరుగు దేశాలన్నాక సమస్యలుంటాయి. పర్యవసానంగా ఉద్రిక్తతలుంటాయి. నిరంతర చర్చల ద్వారానే అవి సద్దుమణుగుతాయి. కనుక భార త్-పాకిస్థాన్‌ల మధ్య థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో తాజాగా జరిగిన చర్చలను శాంతికాముకులందరూ స్వాగతిస్తారు. ఈ చర్చల్లో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, విదేశాంగ కార్యదర్శులు పాల్గొనడం...జమ్మూ-కశ్మీర్, ఉగ్రవాదం, భద్రత, అధీనరేఖవద్ద ప్రశాంతత వంటి అంశాలు ప్రస్తావనకొచ్చాయని ఉమ్మడి ప్రకటన వెల్లడించడం హర్షించదగిన విషయం.
అయితే ఈ చర్చలు మూడో దేశంలో జరగడం...జాతీయ భద్రతా సలహాదారులు, విదేశాంగ కార్యదర్శులు పాల్గొన్న కీలక సమావేశం ఉమ్మడి ప్రకటన వెలువడే వరకూ అత్యంత రహస్యంగా ఉండిపోవడం రెండు దేశాల్లోనూ నెలకొన్న స్థితిగతులను పట్టిచూపుతాయి. చర్చల సంగతి ముందుగా వెల్లడైతే వాటిని భగ్నం చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించే శక్తులు రెండు దేశాల్లోనూ ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. పాకిస్థాన్‌లో సైన్యం సైతం అలాంటి పాత్ర పోషిస్తున్నది. అలాంటి వారివల్లే చర్చలు నిరుపయోగమవుతూ వచ్చాయి. ఈసారి అలాంటి పరిస్థితి తలెత్తరాదన్న ఉద్దేశంతోనే చర్చలకు బ్యాంకాక్‌ను ఎంచుకున్నట్టున్నారు. చర్చల్లో రహస్యమెందుకని రెండు దేశాల్లోని విపక్షాలూ ఇప్పటికే ఆగ్రహిస్తున్నాయి.
మూడు యుద్ధాలు, కార్గిల్ ఘర్షణలు, అడపా దడపా సరిహద్దుల్లో సాగే కాల్పులు రెండు దేశాల సంబంధాలనూ కోలుకోలేనంతగా దెబ్బతీశాయి. మొన్న జూలైలో రష్యాలోని ఉఫాలో బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ(ఎస్‌ఓసీ) సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య చర్చలు జరిగాయి. అరగంట అనుకున్న చర్చలు గంటసేపు సాగడంతో అవి మెరుగైన వాతావరణం ఏర్పడటానికి దోహదపడగలవని అందరూ ఆశించారు. ఇద్దరు అధినేతలూ విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన సైతం ఆ ఆశల్ని పెంచింది. చర్చల ప్రక్రియ పునరుద్ధరణ, ముంబై దాడి కేసు నిందితులపై త్వరితగతిన విచారణ అందులోని ప్రధానాంశాలు. అన్ని రకాల ఉగ్రవాదాన్నీ ఖండిస్తున్నట్టు కూడా ఆ ఉమ్మడి ప్రకటన తెలిపింది.
ఇంతలోనే పాకిస్థాన్‌లో ఉరుములూ, మెరుపులూ మొదలయ్యాయి. కశ్మీర్ అంశం లేకుండా చర్చలకెలా ఒప్పుకుంటారంటూ అక్కడి ఛాందసవాద శక్తులు షరీఫ్‌పై విరుచుకుపడ్డాయి. సరిహద్దుల్లో తుపాకుల మోత ప్రారంభమైంది. ఉద్రిక్తతలు ఈ స్థాయికి చేరినా చర్చలు యధాప్రకారం ఉంటాయని మొదట్లో రెండు దేశాలూ చెప్పాయి. ఇంతలో హఠాత్తుగా వేర్పాటువాద సంస్థ హుర్రియత్ వివాదం తెరపైకి వచ్చింది. చర్చల కోసం న్యూఢిల్లీ వెళ్లే తమ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ హుర్రియత్ నేతలను కలుస్తారని పాక్ ప్రకటించడంతో అవి కాస్తా ప్రతిష్టంభనలో పడ్డాయి. మూడో పక్షం ప్రమేయాన్ని ఒప్పుకోబోమని మన దేశం స్పష్టం చేసింది.
దాంతో చర్చలు రద్దు చేసుకుంటున్నట్టు పాక్ చివరి నిమిషంలో ప్రకటించింది. ఇదంతా నాలుగునెలలనాటి పరిణామం. నిరుడు ఆగస్టులో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు సైతం ఇదే కారణంతో రద్దయినప్పుడు ఉఫాలో రెండు దేశాల అధినేతలూ ఆ విషయం జోలికి పోకుండా చర్చలపై కొత్తగా నిర్ణయం తీసుకోవడంవల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. ఉఫా చర్చలు సాధించాయనుకున్న సత్ఫలితాలు కాస్తా నీరుగారాయి.
ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ ఈ నెలలో కలుసుకున్నారు. పారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ఈ సమావేశం బ్యాంకాక్ చర్చలకు దారి తీసిందని ఉమ్మడి ప్రకటన అంటున్నది. కశ్మీర్ ప్రస్తావన లేని చర్చలేమిటని పాకిస్థాన్...హుర్రియత్‌తో పాక్ మాట్లాడదల్చుకుంటే ఇక చర్చలే ఉండబోవని మన దేశమూ భీష్మించుకుని కూర్చున్న తరుణంలో తాజా చర్చలు కారుచీకట్లో కాంతి రేఖలా కనబడుతున్నాయి. ఉమ్మడి ప్రకటన కశ్మీర్ సమస్య గురించి ప్రస్తావించడంతో పాక్ కోరిక ఈడేరింది.
ఈ చర్చలు ఢిల్లీలో కాక బ్యాంకాక్‌లో జరిగాయి గనుక హుర్రియత్ నేతలను కలవాల్సిన అవసరం పాక్ నాయకులకు లేకపోయింది. ఆ విధంగా మన ప్రభుత్వ ‘పట్టుదల’ నెరవేరింది. ఈ రహస్య చర్చలకు కొనసాగింపుగా మంగళవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ వెళ్లబోతున్నారు. ఆ సందర్భంగా ఆమె నవాజ్ షరీఫ్‌నూ, సర్తాజ్ అజీజ్‌నూ కూడా కలుస్తారు. శాంతియుత, సుస్థిర, సుసంపన్న దక్షిణాసియా సాధించాలన్న మోదీ, షరీఫ్‌ల దార్శనికత మార్గదర్శకంగా ఈ చర్చలు జరిగాయని బ్యాంకాక్ ఉమ్మడి ప్రకటన చెబుతోంది.
గత కొన్ని రోజులుగా పరస్పరం సంబంధం లేనట్టుగా కనబడిన ఘటనల, మాటల వెనక నిర్దిష్టమైన ప్రయోజనం ఉన్నదని తాజా చర్చలు చెబుతున్నాయి. నవంబరు నెలాఖరున కామన్వెల్త్ దేశాధినేతల సమావేశం సందర్భంగా బ్రిటన్ ప్రధాని కామెరాన్‌ను కలిసినప్పుడు భారత్‌తో చర్చలకు తమ దేశం ఎలాంటి ముందస్తు షరతులూ విధించబోదని షరీఫ్ హామీ ఇచ్చారు. అంతకుముందు అమెరికా పర్యటనకెళ్లిన పాక్ సైనిక దళాల చీఫ్ సైతం స్వరం మార్చుకున్నారు. ఈ పరిణామాల తర్వాతే పారిస్‌లో మోదీ, షరీఫ్‌ల సమావేశం సాధ్యపడిందని మరిచిపోకూడదు. అది ఏదో రెండు నిమిషాల మొక్కుబడి సమావేశంగా కనబడినా దానికొక పరమార్ధం ఉన్నదని అప్పుడే కొందరు విశ్లేషకులు జోస్యం చెప్పారు.
ఐఎస్ ఉగ్రవాదులు రష్యా విమానాన్ని కూల్చడం, పారిస్‌పై దాడి చేయడం వంటి ఉదంతాలతోపాటు నాలుగు రోజుల క్రితం అమెరికాలో 14మందిని కాల్చిచంపడం వంటివి అగ్రరాజ్యాలను వణికిస్తున్నాయి. దక్షిణాసియాలో భారత్-పాక్‌ల మధ్య సయోధ్య సాధిస్తే, అఫ్ఘాన్‌లో ప్రశాంతత ఏర్పడితే ఉగ్రవాదులను అణచడం సులభమవుతుందని అవి విశ్వసిస్తున్నాయి. కనుకనే అమెరికా, బ్రిటన్‌లు తెరవెనక కృషి చేసి బ్యాంకాక్ చర్చలకు దోహదపడ్డాయి. కారణం ఏదైనా భారత్-పాక్‌లు రెండూ సమస్యల పరిష్కారానికి కలిసి కదిలితే, ఆ ప్రయత్నాలు ఫలప్రదమైతే అవి ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. రెండు దేశాలనూ పట్టిపీడిస్తున్న నిరుద్యోగం, నిరక్షరాస్యత, మౌలిక సదుపాయాల లేమి వంటివి విరగడవుతాయి. ప్రస్తుత వాతావరణం అందుకు దోహదపడాలని కోరుకుందాం.