భద్రతా మండలికి భారత్‌ | India wins 184 out 192 votes to enter UN Security Council | Sakshi
Sakshi News home page

భద్రతా మండలికి భారత్‌

Published Fri, Jun 19 2020 4:59 AM | Last Updated on Fri, Jun 19 2020 5:07 AM

India wins 184 out 192 votes to enter UN Security Council - Sakshi

ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో అత్యంత శక్తిమంతమైన భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాలకు జరిగిన ఎన్నికల్లో భారత్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 193 సభ్య దేశాలు కలిగిన భద్రతా మండలిలో భారత్‌కు అనుకూలంగా 184 ఓట్లు వచ్చాయి. బుధవారం జరిగిన భద్రతా మండలి ఎన్నికల్లో భారత్‌ ఆసియా పసిఫిక్‌ ప్రాంతం కేటగిరీలో ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో భారత్‌తో పాటుగా ఐర్లాండ్, మెక్సికో, నార్వే దేశాలు ఎన్నికయ్యాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా ఈ మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. మిగిలిన దేశాల సభ్యత్వం కోసం ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి పోలింగ్‌లో 192 దేశాలు పాల్గొన్నాయి. భద్రతా మండలికి ఎన్నిక కావాలంటే మూడింట రెండోవంతు మెజార్టీ సాధించాలి. అంటే 128 దేశాలకు మద్దతు పలకాలి. భారత్‌కు 184 దేశాల నుంచి మద్దతు లభించడంలో విజయబావుటా ఎగురవేసింది.  

శాంతిస్థాపన, సమానత్వానికి కృషి: మోదీ  
భద్రతా మండలి ఎన్నికల్లో భారత్‌ సాధించిన అద్భుత విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో శాంతి స్థాపన, భద్రత, సమానత్వం నెలకొల్పడంలో  సభ్యదేశాలతో కలిసి పని చేస్తామన్నారు.  

జనవరి నుంచి రెండేళ్ల పాటు  
భద్రతా మండలి ఎన్నికల్లో ఆసియా పసిఫిక్‌ దేశాల తరఫున పోటీ పడడానికి చైనా, పాకిస్తాన్‌ సహా 55 దేశాలున్న కూటమి భారత్‌ని గత ఏడాది జూన్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకుంది. భద్రతా మండలిలో భారత్‌ సభ్యత్వం 2021–2022 వరకు రెండేళ్ల పాటు కొనసాగనుంది. జనవరి 1 నుంచి అయిదు శాశ్వత సభ్యదేశాలు, తాత్కాలిక సభ్య దేశాలైన ఈస్టోనియా, నైజర్, సెయిర్‌ విన్సెండ్, గ్రెనాడిన్స్, ట్యునీసియా, వియత్నాం దేశాలతో కలిసి సమావేశాలకు భారత్‌ హాజరుకానుంది. బెల్జియం, డొమినికన్‌ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా దేశాల పదవీ కాలం ఈ ఏడాది చివరితో ముగిసిపోనుంది. భారత్‌ ఇప్పటివరకు ఏడుసార్లు ఎన్నికైంది.

ఉగ్రవాదమే ప్రధాన లక్ష్యం
ఐక్యరాజ్యసమితిలో శక్తివంతమైన భద్రతా మండలి ద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే చర్యలను మరింత విస్తృతం చేస్తామని కేంద్రం తెలిపింది. ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధించే ప్రక్రియ రాజకీయాల కారణంగా నిర్వీర్యం కాకుండా చూడటమే లక్ష్య ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. ఆంక్షలు విధించే విషయంలోనూ రాజకీయాలకు తావు లేకుండా చేస్తామని తెలిపింది. మండలిలో ప్రాతినిధ్యం లేని దేశాల గళం వినిపించడంలో భారత్‌ ముందుంటుం దన్నారు.  భారత్‌ భద్రతా మండలికి ఎన్నిక కావడంపై విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్‌ స్వరూప్‌ ఈ మేరకు స్పందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement