ఐరాస భద్రతామండలిలో  తాత్కాలిక సభ్యదేశంగా పాక్‌  | Pakistan Begins 2-Year Term At UN Security Council To Oppose Reform Sought By India, More Details Inside | Sakshi
Sakshi News home page

ఐరాస భద్రతామండలిలో  తాత్కాలిక సభ్యదేశంగా పాక్‌ 

Published Thu, Jan 2 2025 6:32 AM | Last Updated on Thu, Jan 2 2025 10:33 AM

Pakistan Begins 2-Year Term At UN Security Council

నేటి నుంచి రెండేళ్లపాటు సేవలు 

ఇస్లామాబాద్‌: ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా దుష్కీర్తిని మూటగట్టుకున్న దాయాదిదేశం పాకిస్తాన్‌ కీలకమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరింది. రొటేషన్‌ పద్ధతిలో పాకిస్తాన్‌కు ఈ అవకాశం దక్కింది. రెండేళ్లపాటు పాకిస్తాన్‌ మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగనుందని ఐరాస భద్రతామండలి బుధవారం ప్రకటించింది. 

ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాకిస్తాన్‌ తన వంతుగా క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఐరాసలో పాకిస్తాన్‌ దౌత్యవేత్త మునీర్‌ అక్రమ్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న భద్రతామండలిలో పాక్‌కు స్థానం లభించడం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. 193 దేశాలకు సభ్యత్వం ఉన్న ఐరాస సర్వ ప్రతినిధి సభలో జూన్‌లో ఓటింగ్‌ చేపట్టగా 182 దేశాలు ఓటింగ్‌లో పాక్‌కు అనుకూలంగా ఓటేశాయి. మూడింట రెండొంతుల మెజారిటీ(124 ఓట్లు) అవసరం కాగా అంతకుమించి ఓట్లు పడటం విశేషం. 

‘‘ అంతర్గత సమస్యలు, యూరప్, పశి్చమాసియా, ఆఫ్రికాలో యుద్ధాల వేళ మండలిలో మాకు దక్కిన సభ్యత్వాన్ని సద్వినియోగం చేసుకుంటాం’’ అని అక్రమ్‌ అన్నారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి దశాబ్దాలు దాటింది. ప్రారంభంలో 53 దేశాలతో ఏర్పడిన ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం ఏకంగా 193 సభ్యదేశాలు ఉండటం విశేషం. ఐరాస భద్రతా మండలి సభ్యదేశాల సంఖ్య ప్రస్తుతం 15కు పెరిగింది. వీటిల్లో వీటో అధికారం కేవలం శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లకు మాత్రమే ఉంది. మిగతా పది తాత్కాలిక సభ్య దేశాలు రొటేషన్‌ పద్ధతిపై మారుతుండటం ఆనవాయితీగా వస్తోంది. 2025–26 రెండేళ్లకాలానికిగాను పాకిస్తాన్‌తోపాటు డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియాలు కొత్త సభ్యదేశాలుగా చేరాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement