ఐక్యరాజ్య సమితి: చీకటి వ్యవహారాలు నడపడంలో రెండాకులు ఎక్కువే చదివిన పాకిస్తాన్ పప్పులు ఇకపై ఉడకబోవని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సెక్యురిటీ కౌన్సిల్‌లో జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్‌కు భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఘాటు సమాధానమిచ్చారు. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో శాంతిభద్రతల నిర్వహణపై బహిరంగ చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ‘‘చీకటి వ్యవహారాలు నడపడంలో దిట్ట అయిన బృందం మరోసారి తన అసలు రూపాన్ని చూపింది. అసత్యాలను ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. వీటిని మేము ఖండిస్తున్నాం. పాకిస్థాన్‌కు నా ప్రతిస్పందన ఒక్కటే. కొంచెం ఆలస్యమైనా ఫర్వాలేదు.. ఇప్పటికైనా వాళ్లు తమ పాపాలను కడిగేసుకునే ప్రయత్నం చేయాలి. మీ కథలు నమ్మేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు’’ అని స్పష్టం చేశారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి..
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దు, తదనంతరం ఆ ప్రాంతంలో సమాచార వ్యవస్థలపై నిర్బంధం వంటి అంశాలను మునీర్ అక్రమ్ ప్రస్తావించారు. బాలాకోట్ దాడుల సందర్భంగా తాము వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌ను బందీగా చేసిన విషయాన్ని చెబుతూ.. భారత్ పాక్‌ల మధ్య ఘోర యుద్ధాన్ని నివారించాలంటే తక్షణమే కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ అంశంపై భారత్ తీవ్రంగా స్పందించింది.
ఉగ్రవాద నెట్‌వర్క్‌లు అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం కావడం, ఉగ్రవాదులు కొత్త ఆయుధాలు–టెక్నాలజీ సమకూర్చుకుంటుంటే నియంత్రించలేకపోవడం వంటి వాటిని మండలి లోపాలుగానే చూడాలని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన ఉద్దేశాల అమలుపై నిష్పక్షపాత సమీక్ష జరగాలని సూచించారు. ఇప్పటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా మండలిలో మార్పులు జరగాలని అన్నారు. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఐక్యరాజ్య సమితి ఛార్టర్ ఇప్పటికీ ప్రపంచ స్ఫూర్తికి ప్రతీకగా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ సైన్యం శుక్రవారం ఎల్‌ఓసీ వెంబడి మరోసారి కాల్పులకు తెగబడింది. పూంఛ్ సెక్టార్‌లో సరిహద్దు వెంబడి పాక్ సైన్యం మోర్టార్లతో కాల్పులు జరిపిందని సైనికాధికారులు తెలిపారు.ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ పోర్టర్లు మరణించారని, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment