పొరుగు దేశం పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఐక్యరాజ్య సమితి వేదికగా మన దేశంపై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. అయితే ఈ ఆరోపణలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది.ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడటమేంటో? అని మన దేశపు దౌత్యవేత్త భవిక మంగళానందన్ ప్రశ్నించారు.
‘‘ఈ ప్రపంచ వేదిక దురదృష్టవశాత్తూ అవాస్తవాలను వినాల్సి వచ్చింది. పాక్ ప్రధాని భారత్ గురించి ప్రస్తావించడంపై ఇవాళ మేం స్పందిస్తున్నాం. సుదీర్ఘకాలంగా పొరుగు దేశాలపై సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఒక ఆయుధంగా ఉపయోస్తోంది. ఆ విషయం అందరికీ తెలుసు. అలాంటి దేశం హింస గురించి మాట్లాడటం వంచనే అవుతుంది.
ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది. వాస్తవమేంటంటే.. ఆ దేశం మా భూభాగాన్ని కోరుకుంటోంది. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు అవాంతరం కలిగించేందుకు నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోంది. మిలిటరీ సాయంతో నడుస్తూ.. ఉగ్రవాదం విషయంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన పాక్, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడటమా?’’ అని భవిక అన్నారు.
Watch: India exercises its Right of Reply at the 79th session of the @UN General Assembly debate.@DrSJaishankar @MEAIndia pic.twitter.com/c6g4HAKTBg
— India at UN, NY (@IndiaUNNewYork) September 28, 2024
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్‌లో సాధారణ చర్చ సందర్భంగా.. పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో తమ దేశంలోని సమస్యలను వదిలేసిన షరీఫ్.. కేవలం కశ్మీర్ గురించే సుదీర్ఘంగా మాట్లాడారు. పాలస్తీనా ప్రజల మాదిరిగానే జమ్ము ప్రజలు కూడా స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నారని అన్నారు. అలాగే.. ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ.. శాంతిస్థాపన కోసం 2019 ఆగస్టులో భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఐరాస భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment