సాక్షి, న్యూఢిల్లీ: కాశ్మీర్ అంశంపై మరోసారి చైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. డ్రాగన్ వ్యాఖ్యలకు భారత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవడం తగదని చైనాకు హితవు పలికింది.
వివరాల ప్రకారం.. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతున్న ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాల్గొన్నారు. ఈ క్రమంలో జమ్మూకశ‍్మీర్ గురించి ప‍్రస్తావించారు. కశ్మీర్ విషయాన్ని ఓఐసీ సదస్సులో పలు ఇస్లామిక్ మిత్ర దేశాలు ప్రస్తావించాయి. చైనా కూడా అదే కోరుకుంటోంది అంటూ వాంగ్ యీ అన్నారు.
కాగా, వాంగ్ యీ.. జమ్మూకశ్మీర్పై చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ గురించి మాట్లాడేందుకు చైనాకు ఎలాంటి హక్కు లేదని భారత్ స్పష్టం చేశారు. కశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదని హితవు పలికారు. ఇతరుల అంతర్గత వ్యవహారాలపై భారత్ ఎన్నడూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయదన్న సంగతిని గుర్తించాలని హితవు పలికారు. ఇదిలా ఉండగా.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ వారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ వ్యవహారంపై భారత్ ఇలా కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment