
వాషింగ్టన్: వరుస బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో రెచ్చిపోతున్న ఉత్తరకొరియా చర్యలను ఖండించాలని ఐక్యరాజ్యసమితి భద్రతమండలిలో అమెరికా ప్రతిపాదించింది. ప్యాంగ్యాంగ్‌ను దౌత్యపరమైన సంబంధాలవైపు మళ్లేలా చూడాలని సూచించింది. 15 ఉన్నత దేశాలు సభ్యులుగా ఉన్న భద్రతా మండలి సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకర దేశంగా అవతరిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
సోమవారం జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ ఈమేరకు వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియాపై తక్షణే చర్యలు తీసుకోవాలని, కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. భద్రతా మండలి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు కంటే దారుణమని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.
అయితే చైనా, రష్యా మాత్రం అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఉత్తరకొరియాపై మరింత ఒత్తిడి తెస్తే అది నిర్మాణాత్మకంగా ఉండదని వాదించాయి. గతేడాది మేలో ఉత్తరకొరియాపై ఐరాస భద్రతా మండలి మరిన్ని ఆంక్షాలు విధించాలనుకున్నప్పుడు కూడా ఈ రెండు దేశాలే వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకున్నాయి.
ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు ఆసియాతో పాటు మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతాయనే విషయాన్ని ఆ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న దేశాలు గుర్తుంచుకోవాలని లిండా వ్యాఖ్యానించారు.
ఉత్తర కొరియా ఇటీవల మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. అనంతరం ప్యోంగ్యాంగ్ పసిఫిక్‌ను 'ఫైరింగ్ రేంజ్'గా ఉపయోగించడం ఆమెరికా దళాల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని కిమ్ జోంగ్ ఉన్ సోదరి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఐరాస భద్రతా మండలి సోమవారం సమావేశమైంది. అనంతరం మండలిలోని మూడింట రెండొంతుల సభ్య దేశాలు ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలను ఖండిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
చదవండి: తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం
Comments
Please login to add a commentAdd a comment