ఐక్యరాజ్య సమితి: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జరిగిన ఒక చర్చాకార్యక్రమంలోనూ కశ్మీర్ అంశాన్ని లేవదీసి పాకిస్తాన్ భారత్‌పై తన అక్కసును మరోసారి వెళ్లబోసుకుంది. దీంతో భారత్ ఘాటుగా స్పందించింది. పాకిస్తాన్ చేసే ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు కనీసం స్పందించాల్సిన అవసరం తమకు లేదని భారత్ తేల్చిచెప్పింది.
నెలపాటు మొజాంబిక్ దేశ అధ్యక్షతన ఐరాస భద్రతా మండలిలో సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగానే ‘ మహిళలు, శాంతి, భద్రత’ అంశంపై చర్చలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అసంబద్ధంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ఆ తర్వాత ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంభోజ్ మాట్లాడారు. ‘ బిలావల్ వ్యాఖ్యానాలు పూర్తిగా నిరాధారం. పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేసిన ప్రసంగమిది. మహిళలకు భద్రతపై చర్చాకార్యక్రమాన్ని మేం గౌరవిస్తున్నాం. మహిళా దినోత్సవ కాల విలువకు గుర్తించాం. ఈ అంశంపైనే మనం దృష్టిసారిద్దాం.
అసందర్భంగా పాక్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై కనీసం స్పందించాల్సిన అగత్యం భారత్‌కు లేదు. గతంలో చెప్పాం. ఇప్పుడూ, ఇకమీదటా చెప్పేది ఒక్కటే. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమే. దాయాదిదేశం పాక్‌తో పొరుగుదేశ సంబంధాలను సాధారణస్థాయిలో కొనసాగించాలని భారత్ మొదట్నుంచీ ఆశిస్తోంది. అలాంటి వాతావరణం నెలకొనేలా చూడాల్సిన బాధ్యత పాక్‌పై ఉంది. కానీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారి శత్రుత్వాన్ని పెంచుకుంటోంది’ అని రుచిరా ఘాటుగా వ్యాఖ్యానించారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ బలగాలపై దారుణ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని బాలాకోట్‌లో కొనసాగుతున్న జైషే మొహమ్మద్ ఉగ్ర శిబిరంపై భారత వాయుసేన మెరుపుదాడి తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీశాక భారత్‌పై పాక్ ఆక్రోశం మరింతగా ఎగసింది.
Comments
Please login to add a commentAdd a comment