యుద్ధం ముగియకుండా ఖైదీల మార్పిడిని నిరాకరించిన హమాస్
జెరూసలేం: గాజా స్ట్రిప్‌లో యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయెల్‌తో బందీల మార్పిడి ఒప్పందం ఉండదని హమాస్ స్పష్టం చేసింది. యుద్ధం ముగియకుండా, ఖైదీల మార్పిడి జరగదని హమాస్ తాత్కాలిక చీఫ్ ఖలీల్ అల్ హయా బుధవారం పేర్కొన్నారు. దురాక్రమణకు ముగింపు పలకకుండా బందీలను ఎందుకు వదిలేస్తామని ఆయన ప్రశ్నించారు. యుద్ధం మధ్యలో ఉండగా తమ వద్ద ఉన్న బలాన్ని మతి స్థిమితం లేని వ్యక్తి కూడా వదులుకోడని వ్యాఖ్యానించారు.
సంప్రతింపులను పునరుద్ధరించడానికి కొన్ని దేశాలు, మధ్యవర్తులతో చర్చలు జరుగుతున్నాయని, తాము ఆ ప్రయత్నాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యుద్ధం ఆపడానికి ఆక్రమించినవారు నిబద్ధతతో ఉన్నారా? లేదా అనేది ముఖ్యమని హయా చెప్పారు. చర్చలను బలహీనపరిచే వ్యక్తి నెతన్యాహు అని రుజువవుతోందన్నారు.
మరోవైపు బేషరతుగా శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా బుధవారం వీటో చేసింది. కాల్పుల విరమణలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను తక్షణమే విడుదల చేయాలని స్పష్టంగా కోరే తీర్మానానికి మాత్రమే అమెరికా మద్దతు ఇస్తుందని ఐరాసలో అమెరికా రాయబారి స్పష్టంచేశారు.
ఒప్పందానికి ఇరుపక్షాలు సుముఖత చూపకపోతే మధ్యవర్తిత్వ ప్రయత్నాలను నిలిపివేస్తామని హమాస్, ఇజ్రాయెల్‌కు తెలియజేశామని కాల్పుల విరమణ మధ్యవర్తి అయిన ఖతార్ ప్రకటించింది.
దోహాలోని హమాస్ రాజకీయ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయలేదని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ నవంబర్ 19న ప్రకటించారు. గాజా యుద్ధాన్ని ముగించడానికి మధ్యవర్తిత్వ ప్రయత్నాలను సులభతరం చేయడానికి హమాస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అల్ అన్సారీ చెప్పారు. అయితే హమాస్‌ను బహిష్కరించాలని ఖతార్‌ను అమెరికా కోరిందని, దోహా ఈ సందేశాన్ని హమాస్‌కు చేరవేసిందని వార్తలు వచ్చాయి.
ఈజిప్టు ప్రతిపాదనను స్వాగతించిన హమాస్
గాజా స్ట్రిప్‌ను నడపడానికి అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రత్యర్థి ఫతా ఉద్యమంతో కలిసి ఒక పరిపాలనా కమిటీని ఏర్పాటు చేయాలని ఈజిప్టు చేసిన ప్రతిపాదనను హమాస్ స్వాగతించింది. యుద్ధం ముగిశాక గాజాను ఈ కమిటీ నడిపించి, సమస్యలను పరిష్కరిస్తుందని హయా చెప్పారు. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదన్నారు. యుద్ధం తరువాత గాజాను పాలించడంలో హమాస్ పాత్రను ఇజ్రాయెల్ తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment