
ఐక్యరాజ్యసమితి: లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆరోపించారు. శిక్ష పడుతుందన్న భయం వాటికి లేకుండా పోయిందన్నారు. ఇతర దేశాల అండ చూసుకొని రెచ్చిపోతున్నాయని చెప్పారు. ఆయన గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అధ్యక్ష హోదాలో ప్రసంగించారు. ఇండియాలో ముంబై, పఠాన్ కోట్, పుల్వామా దాడులకు పాల్పడింది పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలేనని గుర్తుచేశారు. అలాంటి సంస్థలకు ఏ దేశమూ తోడ్పాటు అందించవద్దని కోరారు. ఉగ్రవాద మూకలకు అందుతున్న ఆర్థిక సాయాన్ని విస్మరించడం తగదని అన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డాగా మారిపోయిందని దుయ్యబట్టారు.