terrorist organizations
-
ప్రమాదపుటంచున...
ఇప్పటి దాకా ముసుగులో గుద్దులాటగా ఉన్న వ్యవహారం బట్టబయలైంది. ఏప్రిల్ 13 రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ పెద్దయెత్తున సాగించిన డ్రోన్, క్షిపణì దాడితో ఆ రెండు దేశాల మధ్య నాలుగు దశా బ్దాల పైగా లోలోపల సాగుతున్న కుమ్ములాట బయటపడింది. ముందుగా ఏప్రిల్ 1న సిరియా రాజధాని డెమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి, ఒక జనరల్ సహా పలువురు సైనికాధికారుల మృతితో అగ్గి రాజుకుంది. ప్రతీకారంగా గత శనివారం ఇరాన్ పంజా విసరడంతో వ్యవహారం ముదిరింది. యుద్ధం ఊసెత్తకపోయినా దెబ్బకు దెబ్బగా టెహరా న్పై తగిన చర్య చేపడుతామంటోంది టెల్ అవీవ్. అసలే అస్థిరతలో మునిగిన పశ్చిమాసియా ఈ శరవేగ పరిణామాలు, వ్యాఖ్యలతో ఏ క్షణమైనా పూర్తిస్థాయి యుద్ధంలో చిక్కుకుపోవచ్చు. చాలాకాలంగా ఇరాన్ తన వ్యూహాత్మక లక్ష్యాలకై పరోక్ష సహకారం అందిస్తూ ప్రాంతీయ తీవ్రవాద సంస్థలను ఇజ్రాయెల్ పౌరులపైన, వివిధ దేశాల్లోని ఇజ్రాయెల్ ఆస్తులపైన ప్రయోగిస్తూ వచ్చింది. అయితే, ఇజ్రాయెల్‌తో ఎన్నడూ నేరుగా ఘర్షణకు దిగలేదు. తెర వెనుక నుంచి తాను చేసినవి ఒప్పుకోనూ లేదు. ఇజ్రాయెల్దీ అదే పంథా. మూడేళ్ళ క్రితం ఇరాన్‌కు చెందిన ముగ్గురు అణుశాస్త్రవేత్తల హత్యలో తన పాత్రను ఆ దేశమూ అంగీకరించ లేదు, అలాగని ఖండించనూ లేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులతో గాజా భూఖండం సంక్షోభంలో పడింది. సదరు హమాస్ దాడుల వెనుక ఇరాన్ పాత్ర గురించి కథలు కథలుంటే, అదే అదనుగా పాలెస్తీనీయుల గాజాను ఇజ్రాయెల్ సమూలంగా ధ్వంసం చేసేసింది. ఐరాస సహా ఎవరెన్ని చెప్పినా నెలల తరబడి ఇజ్రాయెల్ ఆగలేదు, గాజాపై దాడులు ఆపనూ లేదు. ఈ నేపథ్యం నుంచి తాజా ఘటనల్ని చూడాలి. చివరకిప్పుడు ఇరాన్ నేరుగా తన గడ్డ మీద నుంచే ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది. కొన్ని దశాబ్దాలుగా పశ్చిమాసియాలో ఎన్నడూ లేనంతటి ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ప్రయోగించిన 360 క్షిపణుల్లో చాలావాటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్‌ల సహకారంతో ఇజ్రాయెల్ నిలువరించగలిగింది. రాయబార కార్యాలయంపై దాడికి ప్రతిగా స్వీయ రక్షణ కోసమే తాము దాడి చేశామనీ, విషయం ఇంతటితో ముగిసిందనీ ఇరాన్ అంటోంది. ఇక, క్షిపణి దాడిని సమర్థంగా అడ్డుకున్నందున సంయమనం పాటించి, పరిస్థితి ప్రాంతీయ యుద్ధానికి దారి తీయకుండా చూడాలని అమెరికా సహా ఇతర మిత్రదేశాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అభ్యర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్ సరేనన్నట్టు ఉంటూనే, ఇరాన్‌కు తగిన బదులిస్తామంటోంది. ఏమైనా ఇరాన్, ఇజ్రాయెల్‌లు దేనికది మధ్యప్రాచ్యంలో తమదే పై చేయి అని చూపేందుకు యత్నిస్తున్నాయి. అందులో భాగమే రెండు దేశాలూ ఇప్పుడు దాదాపు నేరుగా కయ్యానికి దిగడం! పశ్చిమాసియాలో పరిస్థితికి ఇరు దేశాల బాధ్యతా ఉంది. ఇజ్రాయెల్ నిస్సిగ్గుగా పాలెస్తీనా భూభాగాల్ని బలవంతాన దిగ్బంధించి, కథ నడుపుతుంటే ప్రపంచపు పెద్దన్నలెవరూ ఎన్నో ఏళ్ళుగా పెదవి విప్పలేదు. పట్టించుకోకుండా వదిలేశారు. నిరుడు హమాస్ దాడితో ఇజ్రాయెల్ అహం దెబ్బ తిని, గాజాలో సామూహిక ఊచకోతకు దిగినప్పుడూ అమెరికా సహా ఎవరూ దాన్ని ఆపలేక పోయారు. ఇరాన్ సంగతికొస్తే, అదీ ఇష్టానుసారం వ్యవహరించింది. హెజ్బుల్లా, హమాస్, హౌతీల లాంటివన్నీ అది పరోక్షంగా పోషిస్తున్న పాములే. కొన్నేళ్ళుగా ఇరాక్, లెబనాన్, సిరియా, యెమన్ లలో ఇరాన్ పరోక్ష సహకారంతో నడుస్తున్న ప్రాంతీయ తీవ్ర వాద మూకలను నిలువరించడమే ఇజ్రాయెల్, అమెరికాల పని అయింది. వెరసి, ఇరాన్, ఇజ్రాయెల్‌ల తప్పిదాలు, స్వార్థంతో పక్కన చేరిన దేశాలతో పశ్చిమాసియా చిక్కుల్లో పడింది. తాజా ఘటనలతో యుద్ధం అంచున నిల్చుంది. ప్రతి యుద్ధం ప్రపంచంలో అనిశ్చితిని పెంచేదే. మరీ ముఖ్యంగా, ప్రపంచానికి ఇంధన భాండా గారం లాంటి పశ్చిమాసియా యుద్ధక్షేత్రంగా మారితే ఇక చెప్పేదేముంది! తీవ్ర పరిణామాలు తప్పవు. ఇరాన్ – ఇజ్రాయెల్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రస్తుతం ప్రపంచమంతటా ఉత్కంఠ నెలకొన్నది అందుకే! వ్యవహారాన్ని తెగేదాకా లాగి, ప్రపంచం రెండు శిబిరాలుగా చీలితే కష్టం. ఇరాన్ దాడితో పని లేకుండా గాజాలో యుద్ధం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అంటోంది. అంటే, ఇరాన్ – ఇజ్రాయెల్ సంక్షోభం ముగియనే లేదని స్పష్టమవుతోంది. తక్షణమే అంతర్జాతీయ సమాజం బరిలోకి దిగి, ముందు గాజాలో దాడులు, పాలెస్తీనాలో అమాయక పౌరుల మరణాలు ఆగేలా చూడాలి. ఇజ్రాయెల్‌కు 66 శాతం మేర ఆయుధాలిస్తున్న అమెరికా, అలాగే ఇతర ఆయుధ సరఫరా దేశాలు తమ సరఫరాలు తగ్గించగలిగితే మేలు. అంతకంతకూ అంతర్జాతీయంగా తాను ఒంటరి అవుతున్నానని ఇజ్రాయెల్ గుర్తించాలి. ‘అబ్రహమ్ ఒడంబడికల’ ద్వారా మితవాద అరబ్ దేశాలు నెయ్యానికి ముందుకు రావడంతో దానికి కలి గిన ప్రయోజనం పోతుంది. అయినా, ఇంతకు ముందు, ఇకపైన కూడా మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌లు రెండు ప్రధాన సైనిక శక్తులు. ఇరుపక్షాలూ లక్ష్మణరేఖ దాటాయి. వాటి మధ్య ఘర్షణ చివరకు యుద్ధంగా పర్యవసిస్తే అది రెంటికీ నష్టమే. కాబట్టి, మంకుపట్టు వీడి, వెనక్కు తగ్గాలి. ప్రస్తుత ఉద్రిక్తతను చల్లార్చాలి. పొంచివున్న పెను యుద్ధం ముప్పును నివారించాలి. పశ్చిమాసి యాలో ఉద్రిక్తతలు కొనసాగితే, ప్రపంచ చమురు సరఫరాలు సైతం అస్తవ్యస్తమై, ధరలు పెరుగు తాయి. రష్యా నుంచి చమురు సరఫరా కోసం ఎర్రసముద్రంపై ఆధారపడే మన దేశానికీ ఇబ్బందే. భారత్ సూచించినట్టు మళ్ళీ దౌత్యమార్గాన్ని ఆశ్రయించడమే అన్ని వివాదాలకూ పరిష్కారం. -
రాక్షస మూక
► జమూకశ్మిర్లోని అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్మీ కల్నల్, మేజర్, డీఎస్పీ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని సృష్టించింది. ముష్కరుల దుశ్చర్యకు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముగ్గురు ఉన్నతాధికారులను బలి తీసుకున్న రాక్షస మూక కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. ఎన్కౌంటర్లో ముగ్గురి మరణానికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) కారణమని ప్రాథమికంగా గుర్తించారు. పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలతో ఈ ‘ప్రతిఘటన దళం’ రాక్షస దళంగా చెలరేగిపోతోంది. ప్రస్తుతం జమ్మూకశ్మిర్ అధికార యంత్రాంగానికి పెనుసవాలుగా మారింది. భద్రతా సిబ్బందితోపాటు సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ టీఆర్ఎఫ్? దాని పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలుసుకుందాం.. టార్గెట్ కశ్మిరీ పండిట్లు.. ►జమ్మూకశ్మిర్‌కు స్వయం ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం 2019 ఆగ స్టులో రద్దు చేసి పారేసింది. ఈ పరిణామాన్ని ఉగ్రవాదులు ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోయారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన కొంత కాలానికే అదే సంవత్సరం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ పురుడు పోసుకుంది. పురుడు పోసింది లష్కరే తోయిబా నాయకత్వమే. నిఘా వర్గాలకు దొరక్కుండా ఆన్లైన్ ద్వారా సభ్యులను చేర్చుకోవడం, నిధులను సేకరించడం మొదలుపెట్టారు. ఇతర ఉగ్రవాద ముఠాల్లోని కొందరు సభ్యులు సైతం టీఆర్ఎఫ్లో చేరిపోయారు. పాకిస్తాన్ సైన్యంతోపాటు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’ మద్దతు కూడా దొరకడంతో కశ్మీర్ లోయలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా మారిపోయింది. కార్యకలాపాలను ఉధృతం చేసింది. పదుల సంఖ్యలో ఉగ్రవాద దాడులకు పాల్పడింది. టీఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం భారత జవాన్లు, జమ్మూకశ్మిర్‌లోని మైనారీ్టలే. కశ్మిరీ పండిట్లను అంతం చేయడమే ధ్యేయంగా దాడులకు దిగుతోంది. పాక్ నుంచి ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ►టీఆర్ఎఫ్ అరాచకాలు పెరిగిపోతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఈ ఏడాది జనవరిలో టీఆర్ఎఫ్పై నిషేధం విధించింది. సంస్థ కమాండర్ షేక్ సజ్జాద్ గుల్‌ను యూఏపీఏలోని నాలుగో షెడ్యూల్ కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని రోజ్ అవెన్యూ కాలనీకి చెందిన షేక్ సజ్జాద్ గుల్ చిన్నప్పటి నుంచి ఉగ్రబాట పట్టాడు. 2018 జూన్‌లో జరిగిన కశ్మిరీ జర్నలిస్టు షుజాత్ బుఖారీ హత్య వెనుక అతడి హస్తం ఉన్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీఆర్ఎఫ్ లష్కరే తోయిబాకు అనుబంధంగా వ్యవహరిస్తోందని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ ప్రకటించింది. భద్రతా సిబ్బందిని, మైనార్టీలను హత్య చేయడంతోపాటు పాకిస్తాన్ భూభాగం నుంచి ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడుతోందని, అక్కడి నుంచి ఉగ్రవాదులను భారత్‌లోకి చేరవేస్తోందని వెల్లడించింది. ఎందుకు సృష్టించారు? ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నందుకు గాను పాకిస్తాన్‌ను పారిస్‌కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్‌్కఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్టులో చేర్చింది. దీంతో నిషేధిత ఉగ్రవాద సంస్థలకు నేరుగా నిధులు అందించే మార్గం మూసుకుపోయింది. నిధులు ఆగిపోవడంతో లష్కరే తోయిబా, దాని అధినేత హఫీజ్ సయీద్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర య్యాయి. అందుకే లష్కరే తోయిబాకు అనుబంధంగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను సృష్టించా రు. పాకిస్తాన్ సర్కారు నేరుగా టీఆర్ఎఫ్కు నిధులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఉగ్రవాద సంస్థ అని గానీ, మతపరమైన సాయుధ దళం అని గానీ చెప్పకుండా స్థానిక ప్రతిఘటన దళంగా మభ్యపెట్టడానికి టీఆర్ఎఫ్ అని నామకరణం చేసినట్లు స్పష్టమవుతోంది. ఉధృతంగా చేరికలు.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో జమ్మూకశ్మిర్‌లో భద్రతా దళాలు 90కిపైగా అపరేషన్లు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లలో 42 మంది విదేశీ ఉగ్రవాదులు సహా మొత్తం 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో 108 మంది టీఆర్ఎఫ్కు చెందినవారే కావడం గమనార్హం. అలాగే 2022లో దాదాపు 100 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా, వీరిలో ఏకంగా 74 మంది కేవలం టీఆర్ఎఫ్లోనే చేరడం గమనార్హం. దీన్నిబట్టి టీఆర్ఎఫ్ నుంచి ఎదురవుతున్న ముప్పును అర్థం చేసుకోవచ్చు. నిషేధించిన మరుసటి రోజే ‘హిట్ లిస్ట్’.. ►భారత్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 44 ఉగ్రవాద సంస్థలను ప్రభుత్వం యూఏపీఏ కింద నిషేధించింది. వీటన్నింటిలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా పని చేస్తున్నట్లు గుర్తించారు. నిషేధం విధించిన మరుసటి రోజే ఈ సంస్థ ‘హిట్ లిస్ట్’ విడుదల చేసింది. అందులో ఉన్న వ్యక్తులందరినీ అంతం చేస్తామని హెచ్చరించింది. సామాన్య యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడానికి టీఆర్ఎఫ్ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటోంది. ‘సైకలాజికల్ ఆపరేషన్లు’ చేస్తోంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని ప్రేరేపిస్తోంది. యువకుల మనసు మార్చేసి ఉగ్రవాదులుగా తయారు చేస్తోంది. టీఆర్ఎఫ్ జమ్మూకశ్మిర్‌లోని మైనార్టీ సిక్కులను కూడా లక్ష్యంగా చేసుకుంది. ప్రత్యేక పోలీసు అధికారులుగా(ఎస్పీఓ) పనిచేస్తున్న సిక్కు యువకులపై రాస్ట్రియ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఏజెంట్లు అనే ముద్ర వేస్తోంది. టీఆర్ఎఫ్ దాడుల్లో సిక్కులు సైతం బాధితులుగా మారుతున్నారు. టీఆర్ఎఫ్ ముష్కరులు భారత భద్రతా దళాలపై యుద్ధమే సాగిస్తున్నారని చెప్పొచ్చు. అధునాతన ఆయుధాలతో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉగ్ర ‘టూల్‌కిట్’లో సోషల్ మీడియా
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యథేచ్ఛగా వాడుకుంటున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికలు ఉగ్రవాదుల టూల్కిట్లో ముఖ్యమైన సాధనాలుగా మారిపోయాయని చెప్పారు. ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, క్రిప్టో–కరెన్సీ వంటి నూతన సాంకేతికతలను ముష్కరులు దుర్వినియోగం చేయకుండా అంతర్జాతీయంగా కఠిన చ్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రపంచదేశాలు గట్టి ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) ప్రత్యేక సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల ప్రతినిధులు, పలువురు అంతర్జాతీయ నిపుణులు ఈ భేటీకి హాజరయ్యారు. ఉగ్రæ చర్యలపై యూఎన్ఎస్సీ భారత్‌లో సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రపంచ మానవాళికి పెనుముప్పు ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత్ అంకితభావంతో కృషి చేస్తోందని జైశంకర్ పునరుద్ఘాటించారు. ‘ఐక్యరాజ్యసమితి ఫండ్ ఫర్ కౌంటర్–టెర్రరిజం’కు ఈ ఏడాది భారత్ స్వచ్ఛందంగా 5 లక్షల డాలర్లు ఇవ్వబోతోందని ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు చేరవేయడానికి, లక్ష్యాలపై దాడులు చేయడానికి ఉగ్రవాద సంస్థలు, వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు మానవ రహిత విమానాలు, డ్రోన్లు వాడుతుండడం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారిందన్నారు. ఉగ్రవాదం ప్రపంచ మానవాళికి పెద్ద ముప్పుగా పరిణమించిందని చెప్పారు. గ్లోబల్ యాక్షన్ కావాలి: గుటేరస్ ఉగ్రవాద సంస్థలు ఆధునిక టెక్నాలజీని వాడుకోకుండా కట్టడి చేయాలని, ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా కృషి (గ్లోబల్ యాక్షన్) చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక సందేశాన్ని పంపారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం కొత్త టెక్నాలజీని వాడుకోవడం వేగంగా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధి రుచిరా కాంబోజ్ చెప్పారు. ‘ఢిల్లీ డిక్లరేషన్’ను 15 సభ్యదేశాల ప్రతినిధులు ఆమోదించారు. ఉగ్ర సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రైవేట్ రంగం, పౌర సమాజంతో కలిసి పనిచేయాలని ప్రభుత్వాలకు కౌంటర్–టెర్రరిజం కమిటీ పిలుపునిచ్చింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించవద్దు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భారత్ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద బాధిత దేశమేనని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఉగ్రవాద చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు ప్రేరణ ఏదైనప్పటికీ వారి కార్యకలాపాలను అరికట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ముష్కర శక్తుల ఆట కట్టించే విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శిగా కొనసాగాలని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో జరిగిన కౌంటర్–టెర్రరిజం కమిటీ(సీటీసీ) సమావేశాన్ని ఉద్దేశించిన ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఉగ్రవాదంపై భారత్ అలుపెరుగని పోరాటం సాగిస్తోందని ఉద్ఘాటించారు. భారత్ ఉగ్రవాదం బారినపడిందని పేర్కొన్నారు. -
ఉగ్రవాద శక్తులకు తోడ్పాటు వద్దు: జైశంకర్
ఐక్యరాజ్యసమితి: లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆరోపించారు. శిక్ష పడుతుందన్న భయం వాటికి లేకుండా పోయిందన్నారు. ఇతర దేశాల అండ చూసుకొని రెచ్చిపోతున్నాయని చెప్పారు. ఆయన గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అధ్యక్ష హోదాలో ప్రసంగించారు. ఇండియాలో ముంబై, పఠాన్ కోట్, పుల్వామా దాడులకు పాల్పడింది పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలేనని గుర్తుచేశారు. అలాంటి సంస్థలకు ఏ దేశమూ తోడ్పాటు అందించవద్దని కోరారు. ఉగ్రవాద మూకలకు అందుతున్న ఆర్థిక సాయాన్ని విస్మరించడం తగదని అన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డాగా మారిపోయిందని దుయ్యబట్టారు. -
24 రోమియోలు 6 అపాచీలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా మంగళవారం ఇరు దేశాల మధ్య ఇక్కడి హైదరాబాద్ హౌజ్‌లో కీలక ద్వైపాక్షిక అంశాలపై సమగ్రంగా ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో ప్రధాని మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్ కూడా పాల్గొన్నారు. చర్చల అనంతరం, ఇరు దేశాల మధ్య ముఖ్యమైన రక్షణ ఒప్పందంతో పాటు ఇంధన, ఆరోగ్య రంగాల్లో మూడు ఒప్పందాలు కుదిరాయి. చర్చల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. 300 కోట్ల డాలర్లకు పైగా విలువైన అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయన్నారు. (తెలుపు.. స్వచ్ఛత) ఈ ఒప్పందంలో భాగంగా, 260 కోట్ల డాలర్ల విలువైన 24 ఎంహెచ్ –60 రోమియో హెలికాప్టర్లను భారతీయ నౌకాదళం కోసం లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. అలాగే, 80 కోట్ల డాలర్ల విలువైన ఆరు ఏహెచ్–64ఈ అపాచీ హెలికాప్టర్లను ఆర్మీ అవసరాల కోసం ప్రఖ్యాత బోయింగ్ సంస్థ నుంచి కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందాలు భారత్, అమెరికాల రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే, మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఇరు దేశాల ఆరోగ్య శాఖల మధ్య ఒక ఎంఓయూ కుదిరింది. భారత్‌కు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మధ్య వైద్య ఉత్పత్తుల రక్షణకి సంబంధించి ఒక ఎంఓయూపై సంతకాలు జరిగాయి. అలాగే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎగ్జాన్ మొబిల్ ఇండియా ఎల్ఎన్జీ లిమిటెడ్, చార్ట్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ల మధ్య సహకారానికి సంబంధించి ఒక లెటర్ ఆఫ్ కోఆపరేషన్‌పై సంతకాలు జరిగాయి. (మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి..) ‘హెచ్1 బీ’పై ఆందోళన చర్చల అనంతరం, వాటి వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ‘అంతర్గత భద్రత, రక్షణ, ఇంధనం, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు’ అనే ఐదు ప్రధాన రంగాల్లో సహకారానికి సంబంధించి చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. రక్షణ రంగంలో సహకారానికి సంబంధించి భారత్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్‌ల మధ్య దాదాపు 5 గంటల పాటు చర్చలు కొనసాగాయన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భారత్, అమెరికాలు సంయుక్తంగా వర్కింగ్ గ్రూప్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయన్నారు. అలాగే, చర్చల సందర్భంగా హెచ్1 బీ వీసాల విషయంలో తమ ఆందోళనలను అమెరికా దృష్టికి భారత్ తీసుకువచ్చిందన్నారు. అమెరికా హైటెక్ రంగంలో భారతీయుల పాత్రను ప్రధానంగా ప్రస్తావించామన్నారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్యం గణనీయంగా అభివృద్ధి చెందుతోందన్నారు. (కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!) ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు కూడా ప్రస్తుతం గణనీయ స్థాయికి తగ్గిందని ష్రింగ్లా వెల్లడించారు. అమెరికా భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, భారత్ మొత్తం ఎగుమతుల్లో 12% యూఎస్‌కే ఉంటాయని తెలిపారు. ట్రంప్, మోదీల మధ్య సీఏఏ అంశం చర్చకు రాలేదని ష్రింగ్లా తెలిపారు. చర్చలో మత సామరస్యం అంశం ప్రస్తావనకు వచ్చిందని, భిన్నత్వం, బహుళత్వం భారత్, అమెరికాల ఉమ్మడి విలువలని ఆ సందర్భంగా ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారని ఆయన వెల్లడించారు. అహ్మదాబాద్‌లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలోనూ ట్రంప్ భారత్‌లోని మత విభిన్నతను, మత సామరస్యాన్ని ప్రస్తావించిన విషయాన్ని ష్రింగ్లా గుర్తు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరోసారి గెలుస్తారనే భావనతోనే.. ఈ స్థాయి స్వాగతం భారత్ నుంచి లభిస్తోందా? అని ప్రశ్నించగా.. వేరు వేరు పార్టీలకు చెందిన యూఎస్ అధ్యక్షులు భారత్‌కు వచ్చారని, ద్వైపాక్షిక సహకారం ప్రాతిపదికగానే వారితో భారత్ వ్యవహరిస్తుందని వివరించారు. ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోండి పాక్ భూభాగంపై ఉగ్ర స్థావరాలకు ఆశ్రయం ఇవ్వకూడదని, ఉగ్రదాడులకు పాక్ గడ్డను ఉపయోగించుకునే అవకాశం ఇవ్వకూడదని ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. 26/11 ముంబై దాడుల సూత్రధారులు సహా ఆ తరహా దాడులకు పాల్పడిన వారికి అతి త్వరగా శిక్ష పడేలా చూడాలని పాక్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. జైషే మొహమ్మద్, లష్కరే, హిజ్బుల్ ముజాహిదీన్, డీ –కంపెనీ(దావూద్ ఇబ్రహీంకు చెందిన మాఫియా సంస్థ), అల్ కాయిదా, ఐసిస్, హక్కానీ నెట్వర్క్, తెహరీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ తదితర ఉగ్రవాద సంస్థలను, వాటి సోదర సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. -
ఒమర్ ప్రజలను ప్రభావితం చేస్తారు
శ్రీనగర్: ‘మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(49) ప్రజలను ప్రభావితం చేసే శక్తి ఉంది... మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ(60) నిషేధిత ఉగ్రసంస్థకు మద్దతు ప్రకటించారు’ ఈనెల 6వ తేదీన ఒమర్, మెహబూబాను ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్బంధంలోకి తీసుకున్నట్లు ప్రకటించిన పోలీసులు.. అందుకు కారణాలను తెలుపుతూ రూపొందించిన నివేదికలోని అంశాలివి. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రకటించిన కేంద్రం.. ఒమర్, మెహబూబాలతోపాటు మరికొందరు నేతలను నిర్బంధించడంతోపాటు ఇంటర్నెట్పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. డిటెన్షన్ గడువు (ఆరు నెలలు) ముగియడానికి కొన్ని గంటల ముందు వీరిద్దరినీ పోలీసులు పీఎస్ఏ కింద నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ చట్టం కింద వీరిని మూడు నెలలపాటు నిర్బంధంలో ఉంచొచ్చు. ఇప్పటికే ఒమర్ తండ్రి, కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాను ఈ చట్టం కింద నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ‘ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒమర్‌కు ప్రజల్లో పలుకుబడి ఉంది. రాష్ట్రంలో ఉగ్రవాదం ప్రబలంగా ఉన్న సమయంలో ఎన్నికలను బహిష్కరించాలంటూ ఉగ్రవాద సంస్థలు పిలుపు నిచ్చినప్పటికీ ప్రజలను ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రభావితం చేయగలిగారు. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నించారు’ అని ఆ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఒమర్ చేసిన కామెంట్లను మాత్రం అందులో ప్రస్తావించలేదు. ‘పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అయిన మెహబూబా ‘ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడారు. కశ్మీర్‌ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకుందని వ్యాఖ్యానించారు. నిషేధిత జమాతే ఇస్లామియా సంస్థకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు’ అని పోలీసులు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇంటర్నెట్పై తాత్కాలిక నిషేధం కశ్మీర్లో ఆదివారం ఉదయం ఇంటర్నెట్పై ఆంక్షలు విధించిన యంత్రాంగం సాయంత్రానికి ఆంక్షలు సడలించింది. పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటనలో దోషి అఫ్జల్ గురుకు ఉరి శిక్ష అమలై ఏడేళ్లవుతున్న సందర్భంగా వేర్పాటువాద సంస్థ జేకేఎల్ఎఫ్ ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ను బంద్ చేశారు. -
‘ఈ–టికెట్’ స్కాం బట్టబయలు
న్యూఢిల్లీ: రైల్వేలో భారీ ఈ –టికెట్ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణం సూత్రధారులకు మనీ ల్యాండరింగ్, ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు దీన్ని ఛేదించిన రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) డీజీ అరుణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఇక్కడ మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. ‘దొడ్డిదారిన ఈ టికెట్ల విక్రయం జరుగుతున్నట్లుగా అనుమానం రావడంతో గత ఏడాది ‘ఆపరేషన్ థండర్‌స్టార్మ్’పేరుతో దర్యాప్తు ప్రారంభించాం. ఈ సందర్భంగా గులాం ముస్తాఫా(28) పేరు బయటకు వచ్చింది. జార్ఖండ్‌కు చెందిన ఇతడు 2015 నుంచి ఈ దందా నడుపుతున్నాడు. ఈ నెల మొదటి వారంలో ఇతడిని భువనేశ్వర్‌లో అదుపులోకి తీసుకున్నాం. ఇతని వద్ద ఐఆర్సీటీసీకి చెందిన 563 మంది గుర్తింపుకార్డులు లభించాయి. వీటి ద్వారా ఇతడు టికెట్లను బుక్ చేసేవాడు. వచ్చిన డబ్బును బ్యాంకు అకౌంట్లకు మళ్లించేవాడు. ఇందుకు సంబంధించి ఇతని వద్ద 3,000 అకౌంట్ల వివరాలు లభించాయి. దీంతోపాటు ఇతని వద్ద రెండు ల్యాప్‌టాప్‌లలో ఏఎన్ఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఉంది. దీంతో సాధారణ యూజర్ల కంటే వేగంగా టికెట్లను బుక్ చేయవచ్చు. వచ్చిన డబ్బును డార్క్‌నెట్ ద్వారా క్రిప్టో కరెన్సీలోకి మారుస్తాడు. ఆ కరెన్సీని మనీ ల్యాండరింగ్‌కు, ఉగ్రసంస్థలకు సాయం అందించేందుకు వాడుతున్నట్లు మా అనుమానం’ అని డీజీ వెల్లడించారు. ‘పాక్‌కు చెందిన తబ్లిక్–ఇ–జమాత్ అనే ఉగ్రసంస్థతోనూ, బంగ్లాదేశ్, ఇండోనేసియా, నేపాల్, ఇంకా గల్ఫ్ దేశాల వారితో ఇతనికి సంబంధాలున్నట్లు ల్యాప్‌టాప్‌ల్లో సమాచారంతో తేలింది. అతని వద్ద నకిలీ పాన్, ఆధార్ కార్డులను తయారు చేసే సాఫ్ట్వేర్ కూడా ఉంది. ఇతని గ్రూప్ నుంచి డబ్బు అందుకునే సాఫ్ట్వేర్ కంపెనీ మనీల్యాండరింగ్ కు పాల్పడుతోంది. దీనిపై సింగపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’అని డీజీ అరుణ్ కుమార్ చెప్పారు. ‘గురూజీ అనే పేరుగల సాంకేతిక నిపుణుడికి ముస్తాఫా ఇటీవల రూ.13 లక్షలు అందించాడు. తన గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు ఈ గురూజీ యుగోస్లావియా వీపీఎన్ వాడుతున్నాడు. ఈ ముఠా నడిపే అవయవ వ్యాపారం దందాలో భాగంగా వివిధ ఆస్పత్రులకు గురూజీ చికిత్సల పేరుతో బంగ్లాదేశ్ వాసులను పంపిస్తున్నాడు. ఈ రాకెట్ ద్వారా నెలకు రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు ఆర్జిస్తున్నట్లు అనుమానిస్తున్నాం’అని వివరించారు. దుబాయ్‌లో సూత్రధారి ఈ టికెట్ రాకెట్‌కు మాస్టర్‌మైండ్ హమీద్ అష్రాఫ్. 2019 జూలైలో ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని ఓ స్కూల్ ఆవరణలో బాంబు పేలుడుకు ఇతడే సూత్రధారి. ఈ ఘటనలో అరెస్టయిన ఇతడు బెయిల్‌పై బయటకు వచ్చి, నేపాల్ మీదుగా దుబాయ్‌కి పరారయ్యాడు. పది రోజులుగా ఇంటలి జెన్స్ బ్యూరో, స్పెషల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), కర్ణాటక పోలీసులు ముస్తాఫాను విచారణ చేస్తున్నారు. ముస్తాఫా ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటివరకు 27 మందిని అరెస్టు చేశారు. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సంస్థలు!
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సంస్థలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రంగా విమర్శించింది. ఇవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. చిన్న వ్యాపారస్తులు గత ఏడాది కాలంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇంకా ఇతర ఈ–కామర్స్ సంస్థల చేతుల్లో విలవిలలాడుతున్నాయని, ఫలితంగా వాటి వ్యాపారం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, భారతలోని చట్టాల ప్రకారమే వ్యాపారం చేస్తున్నామని, ఎలాంటి ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది. -
11 ఉగ్ర సంస్థలపై ఆంక్షలు
వాషింగ్టన్: ఉగ్రవాదంపై పోరును అమెరికా ముమ్మరం చేసింది. అల్‌కాయిదా దాడులు (9/11) జరిగి 18 ఏళ్లు అయిన సందర్భంగా ట్రంప్ ప్రభుత్వం బుధవారం సుమారు 11 ఉగ్రవాద సంస్థలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కు చెందిన ముఫ్తీ నూర్ వలీ మెహ్సూద్పై ఆంక్షల కొరడా ఝుళిపించింది. ముల్లా ఫజల్ మరణం తరువాత గత ఏడాది జూన్ నుంచి నూర్ వలీ టీటీపీకి నేతృత్వం వహిస్తున్నారని, పలు ఉగ్రదాడులకు కారణమైన అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఆంక్షల ఉత్తర్వుల కారణంగా ఈ ఉగ్రవాదులను వెతికిపట్టుకోవడం, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, ఉగ్రవాద శిక్షణలో పాల్గొన్న వారిని బంధించడం సులువు అవుతుందని ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ మంచిన్ తెలిపారు. ఉగ్రవాద సంస్థలకు సాయం అందించే, వారితో ఆర్థిక వ్యవహారాలు జరిపే ఆర్థిక సంస్థ లపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు వీలుగా బుధవారం కొన్ని ఉత్తర్వులు జారీ చేసినట్లు మంచిన్ తెలిపారు. ఇరాన్‌లోని కుడ్స్ ఫోర్సెస్, హమాస్, ఐసిస్, అల్‌ఖైదా వాటి అనుబంధ సంస్థలపై ఈ ఉత్తర్వుల ప్రభావం ఉంటుందని తెలిపారు. -
బాలాకోట్ నుంచి బిచాణా ఎత్తేశారు!
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోకి మకాం మార్చాయి. పాక్‌లోని బాలాకోట్ ఉగ్ర శిక్షణ శిబిరంపై ఫిబ్రవరిలో భారత వైమానిక దళం దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం ఉగ్రసంస్థలు తమ మకాంను అఫ్గానిస్తాన్‌లోకి మార్చేశాయి. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలు కునార్, నంగర్హార్, నూరిస్తాన్, కాందహార్‌లలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి. దీంతో భారత నిఘా వర్గాలు కాబూల్, కాందహార్‌లలో ఉన్న దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేశాయి. అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో చేతులు కలిపిన జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలు పాక్–అఫ్గాన్ సరిహద్దు డ్యూరాండ్ రేఖ వెంబడి శిక్షణ శిబిరాలను నెలకొల్పి, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీన కశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా అదే నెలలో భారత వైమానిక దళం బాలాకోట్‌పై బాంబు దాడులు జరిపింది. అంతర్జాతీయ ఒత్తిడులకు లొంగిన పాక్ ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో లష్కరే తోయిబాకు చెందిన 15 మంది నేతలను అదుపులోకి తీసుకుంది. అయితే, ఇవన్నీ కంటి తుడుపు చర్యలేనని భారత్ అంటోంది. నిర్దిష్టమైన చర్యలతో ఉగ్రమూకలను కట్టడి చేయాలని కోరుతోంది. మరోవైపు, పాక్ ఉగ్ర సంస్థలకు దన్నుగా ఉంటోందంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సంస్థ ఆర్థిక సాయం నిలిపివేసింది. దీంతో ఆర్థికంగా కుంగిపోయిన పాక్‌పై ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే ఉగ్ర సంస్థలు పాక్ నుంచి తమ మకాంను అఫ్గానిస్తాన్‌కు మార్చాయని భారత్ నిఘా వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ పరిణామంతో అఫ్గాన్ రాజధాని కాబూల్‌తోపాటు కాందహార్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయాలకు ఉగ్ర ముప్పు పెరిగిందని హెచ్చరిస్తున్నాయి. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతోపాటు, పేలుడు పదార్థాలు అమర్చిన వాహనాలతో కాబూల్ ఎంబసీపై కారివరి గుల్ అనే ఉగ్ర సంస్థ దాడులకు దిగే ప్రమాదముందని అనుమానిస్తున్నాయి. కాందహార్‌లోని ఇండియస్ ఎంబసీపై తాలిబన్లు కూడా దాడులకు పాల్పడే ప్రమాదముందని అంటున్నాయి. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లు జైషే మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్‌కు ఆశ్రయం కల్పించేందుకు ఫిబ్రవరిలో ముందుకు వచ్చినా పాక్‌లోని భావల్పూర్లో సైనిక రక్షణ మధ్య ఉండటమే శ్రేయస్కరమని అతడు ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. అంతేకాకుండా, కాబూల్, కాందహార్ల్లో ఉన్న భారత కార్యాలయాలపై ఈ ఉగ్ర సంస్థలు నిఘా వేసి ఉంచాయి. జనవరిలో సెదిక్ అక్బర్, అతావుల్లా అనే ఇద్దరు ఉగ్రవాదులను అఫ్గాన్ బలగాలు అదుపులోకి తీసుకుని, విచారించగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అమెరికా బలగాలకు ముప్పు లష్కరే తోయిబా కూడా తన అనుచరులను నంగర్హార్, నూరిస్తాన్, కునార్, హెల్మండ్, కాందహార్ ప్రావిన్సుల్లోని శిక్షణ శిబిరాలకు తరలించింది. పెషావర్‌లో ఉన్న సభ్యుల మకాంను కాబూల్‌కు మార్చింది. తాలిబన్ సాయంతో విధ్వంసక, విద్రోహ చర్యలపై శిక్షణ ఇస్తోంది. మరోవైపు, అఫ్గానిస్తాన్‌లో ఉన్న 300 మంది జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతో అమెరికా, సంకీర్ణ బలగాలకు ముప్పు ఉననట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ కూడా తన నివేదికలో పేర్కొంది. తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖైబర్–పక్తున్వా మధ్య రాజీ కుదర్చడంలో జైషే మొహమ్మద్ పాత్ర ఉందని తెలిపింది. -
హరేన్ను కాల్చి చంపింది అస్ఘరే..
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసు విచారణలో కీలకమలుపు చోటుచేసుకుంది. మహ్మద్ అస్ఘర్ అలీ హంతకుడని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ కేసుకు సంబంధించి 2011లో గుజరాత్ హైకోర్టు కొట్టివేసిన శిక్షల్ని అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. 2003 మార్చి 26న జరిగిన ఈ హత్యకేసులో అస్ఘర్ అలీతోపాటు మరో 11 మందికి అహ్మదాబాద్ పోటా కోర్టు విధించిన జీవితఖైదు శిక్షను సమర్థించింది. దీంతో పీడీ యాక్ట్ కింద నల్లగొండ జైల్లో ఉన్న అస్ఘర్అలీ గుజరాత్ జైలుకు వెళ్లడం తప్పనిసరైంది. హరేన్పాండ్యపై తుపాకీ ఎక్కుపెట్టి, కాల్చి చంపింది అస్ఘర్ అలీనే అని అప్పట్లో సీబీఐ నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులోనూ అస్ఘర్ నిందితుడిగా ఉన్నాడు. నల్లగొండకు చెందిన మహ్మద్ అస్ఘర్ అలీకి జునైద్, అద్నాన్, ఛోటు అనే పేర్లు కూడా ఉన్నాయి. 1992 డిసెంబర్లో జరిగిన బాబ్రీమసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాద చర్యలపట్ల ఆకర్షితుడయ్యాడు. కశ్మీర్‌కు చెందిన ముస్లిం ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడి ఉగ్రవాద శిక్షణాశిబిరాల్లో తుపాకులు కాల్చడం, ఆర్డీఎక్స్ బాంబులను పేల్చడంపై శిక్షణ తీసుకున్నాడు. తిరిగి వచ్చి నల్లగొండకు చెందిన మహ్మద్ అబ్దుల్ బారిసహా మరికొందరితో కలసి ముఠా ఏర్పాటు చేశాడు. హత్య కేసుల్లోని నిందితుడిని తప్పించి... బాబ్రీని కూల్చివేసిన ‘కర సేవకులు’అనే ఆరోపణలపై నగరంలో రెండు దారుణహత్యలు జరిగాయి. 1993 జనవరి 22న వీహెచ్‌పీ నేత పాపయ్యగౌడ్, అదే ఏడాది ఫిబ్రవరి 2న మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నందరాజ్ గౌడ్ హత్య కేసుల్లో మీర్జా ఫయాజ్ బేగ్‌ను కోర్టు దోషిగా తేల్చి జీవితఖైదు విధించింది. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న అస్ఘర్‌ను మిగిలిన కేసుల విచారణ నిమిత్తం పోలీసులు తరచూ నాంపల్లి కోర్టుకు తీసుకువచ్చేవారు. ఈ క్రమంలో అస్ఘర్, బారి తదితరులు 1996 డిసెంబర్ 19న నాంపల్లి న్యాయస్థానం నుంచి మీర్జా ఫయాజ్ను తప్పించారు. కశ్మీర్‌కు పంపించి ముస్లిమ్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేసేలా సంబంధాలు కల్పించాడు. జైలు నుంచి తప్పించుకున్న మీర్జా కొన్నిరోజులకే అక్కడ జరిగిన ఓ ఎన్కౌంటర్లో భద్రతాదళాల చేతిలో హతమయ్యాడు. నాంపల్లి వద్ద పట్టుబడి... 1997 ఫిబ్రవరిలో అస్ఘర్, బారి సహా పదిమంది నిందితుల్ని సిటీ పోలీసులు నాంపల్లి వద్ద పట్టుకున్నారు. ఆ సమయంలో వీరి వద్ద నుంచి 3 కిలోల ఆర్డీఎక్స్, 3 హ్యాండ్ గ్రనేడ్లు, రెండు పిస్టళ్లు, 40 రౌండ్ల తూటాలు స్వాదీనం చేసుకున్నారు. నగరంలో భారీ విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. కేసును విచారిస్తుండగా మీర్జా ఎస్కేప్‌లో అస్ఘర్ పాత్ర కీలకమనే విషయం వెలుగులోకి వచ్చింది. హరేన్‌పాండ్యను హత్య చేయడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2003లో కుట్ర పన్నాయి. ఈ బాధ్యతల్ని గుజరాత్‌కు చెందిన లిక్కర్ డాన్, ఉగ్రవాది రసూల్‌ఖాన్ పాఠి ద్వారా అస్ఘర్‌కు అప్పగించాయి. 2003 మార్చి 26న హరేన్ తన ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తుండగా కారులో వెళ్లిన అస్ఘర్ ఐదురౌండ్లు కాల్చడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి అదే ఏడాది ఏప్రిల్ 17న మేడ్చల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో అస్ఘర్ తదితరులను పట్టు కుంది. సుదీర్ఘకాలం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న వీరిపై విచారణ జరిపిన అహ్మదాబాద్‌లోని పోటా కోర్టు అస్ఘర్ తదితరులను దోషులుగా తేల్చింది. అస్ఘర్‌కు జీవితఖైదు విధించింది. 2011లో ఈ కేసు గుజరాత్ హైకోర్టు లో వీగిపోవడంతో వాళ్లు బయటపడ్డారు. హైకోర్టు తీర్పు ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు పోటా న్యాయస్థానం విధించిన శిక్షల్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. -
సిరియా టు దక్షిణాసియా!
సాక్షి, హైదరాబాద్: లష్కరేతోయిబా, తాలిబన్, అల్ కాయిదా.. కరుడుగట్టిన ఈ ఉగ్రవాద సంస్థల్ని తలదన్నేలా ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న సంస్థే ఐసిస్. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్), ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనే పేర్లతో ప్రారంభమైన దీని ప్రస్థానం ప్రస్తుతం ఖండాలు, ప్రాంతాల వారీగా ప్రత్యేక విభాగాలతో విస్తరించింది. ఇరాక్, సిరియాల్లో షియాల ఆధిపత్యానికి గండికొడుతూ సున్నీల ప్రాబల్యం పెంచుతూ ఇస్లామిక్ రాజ్య స్థాపనే ధ్యేయంగా ఐసిస్ ఏర్పడింది. ఇరాక్, సిరియాల్లో ఉన్న సున్నీ ప్రాంతాలను కలిపి ఓ రాజ్యంగా ఏర్పాటు చేయాలన్నది దీని తొలినాటి లక్ష్యం. తాజాగా భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేసి ప్రత్యేక దేశంగా చేయాలంటూ ఇస్లామిక్ స్టేట్ ఇన్ జమ్మూ అండ్ కశ్మీర్ (ఐఎస్‌జేకే) పేరుతో విభాగాన్ని ఏర్పాటు చేసింది. గత ఏడాది హైదరాబాద్‌లో అరెస్టు అయిన ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్‌కు ఈ విభాగంతో సంబంధాలున్నాయి. సౌదీ అరేబియా ఆ చుట్టుపక్కల దేశాల్లో కార్యకలాపాలకు ఇస్లామిక్ స్టేట్ అరబ్ పెనిన్సులా (ఐఎస్ఏపీ), దక్షిణాసియా లో ఆపరేషన్స్ కోసం పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లోని ఖురాసాన్ కేంద్రంగా మరో విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఐసిస్ వ్యవస్థాపకుడు అబూ బకర్ అల్ బాగ్దాదీ, భారత్ వ్యవహారాల చీఫ్ షఫీ ఆర్మర్ మృతి తర్వాత విభాగాల వారీగా నేతలు తయారయ్యారు. దక్షిణాసియా లక్ష్యంగా.. ఐసిస్ ఖురాసాన్ మాడ్యూల్స్ కొన్నేళ్లుగా దక్షిణాసియా దేశాలను లక్ష్యం చేస్తూ వచ్చాయి. కేవలం పాక్, బంగ్లాదేశ్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకే అడ్డాగా మారిన నేపథ్యంలో తన ఉనికి చాటుకోవడానికి ఐసిస్ ప్రయత్నించింది. ఇలాంటిదే తొలి సారిగా ఢాకాలో 2016 జూలైలో జరిగిన బేకరీ ఘటన. భారత్‌లోనూ విధ్వంస కార్యక్రమాలు చేయట్టాలని ఐఎస్ చేసిన యత్నాలు నిఘా వర్గాల అప్రమత్తతతో సఫలీకృతం కాలేదు. మాల్దీవులలో కూడా 90 మంది ఐసిస్ ఉగ్రవాదుల్ని పోలీసులు అరెస్టు చేయడంతో పెనుముప్పుతప్పింది. కానీ, తాజాగా శ్రీలంకలో వారి ప్రయత్నం సఫలమైంది. -
కశ్మీర్‌పై ‘కమల’వ్యూహం
జమ్మూకశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఉన్నట్టుండి బీజేపీ ఎందుకు బయటకు వచ్చింది..? కశ్మీర్లో గవర్నర్ పాలన ద్వారా కాషాయదళం సాధించేదేమిటి..? వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయిలో ‘భవిష్యత్ రాజకీయ నష్టాల’ నివారణలో భాగంగానే జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క కశ్మీర్‌కే పరిమితం కాకుండా విస్తృత రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఈ నిర్ణయం తీసుకుందని అంచనా వేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలకు జమ్మూకశ్మీర్ అనేది ఓ భావోద్వేగాన్ని రగిలించే అంశంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే ఈ వర్గాలను కాపాడుకునే చర్యల్లో భాగంగానే బీజేపీ ఈ అడుగు వేసిందని భావిస్తున్నారు. గవర్నర్ పాలన రూపంలో అంతర్గత భద్రతా పరిరక్షణ చర్యల్లో భాగంగా జమ్మూకశ్మీర్‌లో, పాకిస్తాన్ సరిహద్దువ్యాప్తంగా గట్టి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. మూడేళ్ల పీడీపీ–బీజేపీ పాలనలో కశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాలు, వాటికి మద్దతు తెలిపే సానుభూతిపరుల పట్ల అనుసరించిన వ్యూహాలకు పూర్తి భిన్నమైన కార్యాచరణను ఇప్పుడు కేంద్రం చేపట్టవచ్చనే ప్రచారం సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ, నియంత్రణలోనే జమ్మూకశ్మీర్ ఉంటే బీజేపీకి రాజకీయంగా లాభిస్తుందనేది ఆ పార్టీ అభిప్రాయం. పాలనపై పూర్తి నియంత్రణ.. కశ్మీర్లో గవర్నర్ పాలన ద్వారా బీజేపీ ఆ రాష్ట్రంపై పూర్తిపట్టు సాధించింది. అక్కడి పరిస్థితులను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మిలిటెంట్ల కార్యకలాపాలు అణచివేసేందుకు భద్రతాపరంగా కఠిన చర్యలకు గవర్నర్ పాలనను ఉపయోగించుకోనుంది. చొరబాట్లను అడ్డుకునేందుకు సైనిక చర్యలతో పాటు సానుభూతిపరులపై నిఘా పెరుగుతుంది. సైన్యం, ఇతర భద్రతా దళాలు స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు గవర్నర్ పాలన ఉపయోగపడుతుంది. వీటికి రాజకీయపరమైన పరిమితులు అడ్డుగా నిలిచే అవకాశముండదు. తీవ్రవాదులు, వారి సానుభూతిపరుల కార్యకలాపాల నియంత్రణకు సైనిక చర్యలకు దిగడం ద్వారా కశ్మీర్లో వేర్పాటువాద శక్తులపై పైచేయి సాధించిన సంకేతాలు ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యత, జాతీయ భావజాల నినాదాలు ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా రాజకీయ ఫలాలు పొందాలని భావిస్తోంది. ‘కశ్మీర్లో శాంతిస్థాపన’నినాదాన్ని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానాంశంగా బీజేపీ మార్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పరిశీలకులు భావిస్తున్నారు. పెరగనున్న సైనిక చర్యలు.. నిఘా వర్గాల సమాచారాన్ని ఉపయోగించడంతో పాటు, కశ్మీర్ పోలీసులతో మరింత సమన్వయంతో పనిచేయడం ద్వారా భారత సైన్యం కచ్చితమైన లక్ష్యాలతో కార్యాచరణకు దిగే అవకాశాలున్నాయి. గత మహబూబా ముఫ్తి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నిఘా వర్గాలు తమకు పూర్తి సహకారం అందించలేదన్న అభిప్రాయం సైన్యానికి ఉంది. ఇప్పుడు సైన్యం ఉగ్రవాద అణచివేత కార్యక్రమాలను ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే సైనిక చర్యలకు ప్రతిగా హింసాత్మక ఘటనలు కూడా పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉగ్రవాద సంస్థలు మిలిటెంట్ రిక్రూట్‌మెంట్‌ను విస్తృతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పదేళ్లలోనే అత్యధిక హింసాత్మక ఘటనలు జరిగిన సంవత్సరంగా 2018 మిగలొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ఆరు నెలల్లోనే 95 మంది తీవ్రవాదులు హతమయ్యారు. హింసాత్మక ఘటనల కారణంగా 40 మంది భద్రతా సిబ్బంది, 38 మంది పౌరులు మరణించారు. -
ఉగ్రవాద సంస్థలపై ముషారఫ్ ప్రేమాభిమానాలు
-
ఉగ్ర సంస్థలకు రక్షణ కల్పించొద్దు
పాక్ ఆర్మీకి ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశం ♦ పాకిస్తాన్ వైఖరిలో అసాధారణ మార్పు! ఇస్లామాబాద్: అంతర్జాతీయంగా ఏకాకి కావడంతో కంగుతిన్న పాకిస్తాన్ దిగివచ్చింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు రక్షణ కల్పించవద్దంటూ తమ సైన్యాన్ని పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అసాధారణ రీతిలో గట్టిగా హెచ్చరించారు. అదే సమయంలో పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి, 2008 ముంబై దాడుల కేసుల విచారణను త్వరగా ముగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాక్ పత్రిక ‘డాన్’ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ గురువారం ఈ మేరకు కథనాన్ని వెలువరించింది. సైనిక, పౌర నాయకులతో వరుసగా జరిపిన పలు సమావేశాల అనంతరం షరీఫ్ నుంచి ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలిపింది. ఇటీవల జరిగిన సమావేశం ఫలితంగా రెండు కీలక చర్యలకు సంబంధించి అంగీకారం వచ్చినట్టు వెల్లడించింది. ఈ మేరకు నిషేధిత ఉగ్రవాద సంస్థలపై చట్ట అమలు సంస్థలు చర్యలు చేపట్టినపక్షంలో ఆర్మీ సారథ్యంలోని నిఘా సంస్థలు జోక్యం చేసుకోరాదన్న సందేశంతో ఐఎస్ఐ డెరైక్టర్ జనరల్ రిజ్వాన్ అక్తర్, జాతీయ భద్రతా సలహాదారు నాసర్ జాంజువాలు అన్ని ప్రావిన్స్‌లకు వెళ్లి వివరిస్తారు. పంజాబ్ సీఎం షాబాజ్ షరీఫ్, ఐఎస్ఐ డీజీ మధ్య అసాధారణ స్థాయిలో కొనసాగిన వాగ్యుద్ధం అనంతరం ఈ చర్యలకు పూనుకున్నట్టు ‘డాన్’ తెలిపింది. ఇదిలాఉండగా డాన్ కథనాన్ని ఊహాకల్పితమైనదిగా పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీజ్ జకారియా అభివర్ణించారు. ఇలాంటి కథనాలు జాతీయ ప్రయోజనాలకు తోడ్పడవన్నారు. అమెరికా ఆధిపత్యం తగ్గిపోతోంది వాషింగ్టన్: కశ్మీర్, భారత్‌లపై తాము లేవనెత్తుతున్న అంశాలను పట్టించుకోకపోతే చైనా, రష్యాలతో కలసి నడవాల్సి వస్తుందని అమెరికాను పాకిస్తాన్ హెచ్చరించింది. అమెరికా ఆధిపత్యం క్రమంగా తగ్గుతోందని, ప్రపంచ శక్తిగా ఆ దేశం మరెంతో కాలం ఉండలేదని షరీఫ్ ప్రత్యేక దూత సయ్యద్ వెల్లడించారు. -
ఉగ్రవాదుల వక్రభాష్యం
మతం సందేశంతోనే ఉగ్రవాదంపై పోరు ఇస్లాం, మానవతా విలువల సందేశాన్ని అర్థం చేసుకోవాలి {పపంచ సూఫీ ఫోరం వేదికపై ప్రధాని మోదీ న్యూఢిల్లీ: మానవత్వంపై అమానవీయ శక్తులు చేసే పోరాటమే ఉగ్రవాదమని.. వీరు చేసే ఏ పనీ ఆమోదయోగ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన తొలి ప్రపంచ సూఫీ ఫోరంకు హాజరైన మోదీ.. ఉగ్రవాద సంస్థలు ఒక దేశం విధివిధానాల అమలుకు పావులుగా మారుతున్నాయన్నారు. పరోక్షంగా పాకిస్తాన్‌ను విమర్శిస్తూ.. ‘కొందరు ఉగ్రవాద క్యాంపుల్లో శిక్షణ పొందుతారు. కొందరు ఎల్లలులేని సైబర్ ప్రపంచం ద్వారా ప్రేరణ పొందుతారు. ఓ దేశం విధి విధానాలను, డిజైన్‌ను అమలుచేసేందుకు కొందరు ఉగ్రవాదులు పావులుగా మారతారు’ అని ప్రధాని అన్నారు. మతానికి వక్రభాష్యం చెబుతున్న ఉగ్రవాదుల కారణంగా.. వారుంటున్న ప్రాంతంలోనే ఎక్కువమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ‘ఇస్లాం శాంతి సందేశం చాలా గొప్పది. అల్లాకున్న 99 పేర్లలో ఒక్కటీ హింసకు పర్యాయపదంగా నిలవదు’ అని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని ఒక మతానికి అంటగట్టడం సరికాదని.. మానవతా విలువలు, మతం చెప్పే సందేశాలను అమలు చేయటం ద్వారానే ఉగ్రవాదానికి సరైన సమాధానం ఇవ్వాలని పేర్కొ న్నారు. ఈ సమాధానాన్ని ‘మానవత్వం, అమానవీయ శక్తులకు మధ్య పోరాటం’గా ప్రధాని అభివర్ణించారు. మతవిద్వేషానికి ఉగ్రవాదం అని పేరుపెట్టి పోరాటం చేస్తున్నవారు సూఫీయిజం అందించిన ‘ఇస్లాం, ఉన్నతమైన మానవతా విలువల’ సందేశాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ఈ విలువలను దేశాలు, సమాజం, సాధుసంతులు, మేధావులు, కుటుంబాలు తప్పనిసరిగా అలవర్చుకోవాలన్నారు. ఈ శతాబ్దం ప్రారంభం నుంచి చాలామంది అమాయకులు ఉగ్రవాద రక్కసికి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. దాదాపు వంద దేశాల్లోని తల్లిదండ్రులు.. సిరియాలో ప్రాణాలు కోల్పోతున్న తమ పిల్లలను (జిహాదీలుగా మారిన వారిని) తలుచుకుని రోదిస్తున్నారని మోదీ అన్నారు. ప్రతి ఏడాది ప్రపంచమంతా వేల కోట్ల రూపాయలను ఉగ్రవాదం అంతానికి ఖర్చు చేస్తోందని.. వాస్తవానికి ఈ మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలకోసం ఖర్చుచేస్తే చాలా జీవితాల్లో మార్పు వస్తుందని మోదీ అన్నారు. గణాంకాల ద్వారానే మార్పును గుర్తించలేమని.. మన జీవితాల్లో మార్పు తీసుకురావటం ద్వారా ఉగ్రవాద ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని ప్రధానమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మోదీ సూఫీ సంగీతాన్ని ఆసక్తిగా ఆలకించారు. ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అఖిల భారత ఉలామా, మషైక్ బోర్డు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. జాతీయ దృక్పథమే ముఖ్యం: దోవల్ వ్యక్తిగత ఆలోచనలకు జాతీయ దృక్పథానికి మధ్య ఘర్షణ తలెత్తినపుడు.. దేశాభివృద్ధికే ప్రాధాన్యమివ్వాలని ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తికి దేశద్రోహి, దేశభక్తుడు అనే ముద్ర.. ఆ దేశం గురించి అతను ఆలోచిస్తున్నదాన్ని బట్టే ఉంటుందని ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ కుమారుడు, ఇండియా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శౌర్య దోవల్ అన్నారు. ‘ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి జరగగానే.. వ్యక్తిగత స్వేచ్ఛను పక్కన పెట్టి దేశం కోసం రాత్రికి రాత్రే 90 చట్టాలను మార్చేశారు’ అని ఆయన అన్నారు. -
ఉగ్రనిధులకు అడ్డుకట్ట
యూఎస్ భద్రతా మండలి తీర్మానం వాషింగ్టన్: ఐసిస్, అల్‌కాయిదా వంటి ఉగ్ర సంస్థలకు నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం చేసింది. భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో.. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందుతున్న పద్ధతులు, తదితర అంశాలపై చర్చించారు. ప్రైవేటు సంస్థల ద్వారా ఉగ్ర నిధుల ప్రవాహం జరుగుతున్నదని, దీనికి అంతర్జాతీయ సహకారంతో అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. భారత్‌పై కుట్రలను పాక్ అడ్డుకోలేదు తాలిబాన్లపై పోరాటానికే పాకిస్తాన్ ఎక్కువ దృష్టి కేంద్రీకరించిందని పాకిస్తాన్లో అమెరికా రాయబారిగా పనిచేసిన రిచర్డ్ జీ ఒస్లోన్ తెలిపారు. సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులతో మాట్లాడుతూ.. భారత్, ఆఫ్ఘనిస్తాన్లలో దాడులకు పాక్‌లోనే వ్యూహరచనలు చేస్తున్న ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోలేదన్నారు. పాక్ అంతర్గత ఉగ్ర ప్రమాదాలపై మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని.. ఉత్తర వజీరిస్తాన్‌లో ఉగ్రవాద గ్రూపులు లేకుండా చేసిందని పేర్కొన్నారు. ప్రతి 122 మందిలో ఒకరు శరణార్థి జెనీవా: యుద్ధం, హింసల కారణంగా ఇళ్లు, ఊళ్లు, దేశాలు వదిలి నిర్వాసితులుగా, శరణార్థులుగా మారుతున్న వారి సంఖ్య ఈ ఏడాది ఆరు కోట్లు దాటిపోనుందని ఐరాస వెల్లడించింది. భూగళంపై ప్రతి 122 మందిలో ఒకరు శరణార్థిగానో నిర్వాసితుడిగానో బతుకుతున్నారని తాజా నివేదికలో పేర్కొంది. పారిశుధ్యం ఇక హక్కు: రక్షిత మంచి నీటి హక్కు సరసనే ‘పారిశుధ్యం హక్కు’ను కూడా గుర్తిస్తూ ఐరాస తీర్మానాన్ని ఆమోదించింది. -
15 ఏళ్లు.. 14 ప్రాణాలు
సాక్షి, సిటీబ్యూరో : ఉగ్ర బాట పడుతున్న కొందరు నగర యువకులు తమ భవిష్యత్తును చేజేతులా కాల రాసుకుంటున్నారు. పోలీసు తూటాలకు బలై... అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. పదిహేనేళ్ల కాలంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ఎన్కౌంటర్లలో 14 మంది మృతి చెందడమే దీనికి నిదర్శనం. బాబ్రీ విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకునేందుకంటూ ఏర్పడిన తన్జీమ్-ఇస్లా-ఉల్-ముస్లమీన్ (టీ ఐఎం) నుంచి లష్కర్-ఎ-తోయిబా (ఎల్టీ), ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం), తెహరిక్-గల్భా-ఎ-ఇస్లాం (టీజీఐ), ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్), హిజబుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలతో నగర యువకులు సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఇందులో కొందరు పాకిస్తాన్, బంగ్లాదేశ్, దుబాయ్‌లకు పారిపోయి అక్కడి నుంచి ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించారు. ఈ తరహా దారుణాలలో పాలు పంచుకున్న 14 మంది వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో మరణించారు. అంతకుముందు 1993 జూలైలో పాతబస్తీకి చెందిన ఫసియుద్దీన్ నగరంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఇవీ సంఘటనలు.. 2000వ సంవత్సరం ఏప్రిల్‌లో నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తన్జీమ్- ఇస్లా- ఉల్- ముస్లమీన్ (టీ ఐఎం) వ్యవస్థాపకుడు ఆజంఘోరి చనిపోయాడు. 2002 నవంబర్‌లో దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుల్లో ఒక డైన సయ్యద్ అజీజ్ కరీంనగర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. అజీజ్ ఎన్కౌంటర్ జరిగిన రెండు రోజులకే ఉప్పల్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరోనిందితుడు, మాదన్నపేటకుచెందిన ఆజంఎన్కౌంటర్లో మృతి చెందాడు. 2003 సెప్టెంబర్ 12న ముంబ యిలో జరిగిన ఎన్కౌంటర్లో బార్కాస్‌కు చెందిన హసన్ ఆమూది, కింగ్‌కోఠి షేర్‌గేట్‌కు చెందిన మరో యువకుడు మృతి చెందాడు. 2003లో కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో నగరానికి చెందిన మిర్జాఫయాజ్ బేగ్ మృతి చెందాడు. అంతకుముందు కొద్ది నెలల క్రితం పోలీసు ఎస్కార్ట్ కళ్లు గప్పి, నాంపల్లి కోర్టు నుంచి పారిపోయాడు. అక్టోబర్ 31, 2004లో లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయంలో గుజరాత్ పోలీసులు తెహరిక్ తౌఫుజ్ షాహరే ఇస్లామ్ (టీటీఎస్‌ఐ) మౌలానా నసీరుద్దీన్‌ను అరెస్టు చేసే సమయంలో కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ సమయంలో జరిపిన కాల్పుల్లో ముజాహిద్దీన్ సలీం మృతి చెందాడు. 2006 మార్చి 14న ఢిల్లీలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కర్-ఏ-తోయిబా నేత, ఎల్బీనగర్కు చెందిన గులామ్ ఎజ్దానీ మృతి చెందాడు. 2007 ఆగస్టు 28న పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో లష్కర్-ఏ-తయిబా దక్షిణ భారతదేశ ఇన్చార్జి, మూసారాంబాగ్‌కు చెందిన షాహిద్ బిలాల్, అతని సోదరుడు సమద్‌లు మృతి చెందారు. 2015 ఏప్రిల్ 7న ఆలేరులో జరిగిన ఎన్కౌంటర్లో వికార్, అమ్జద్, జకీర్, డాక్టర్ హనీఫ్ మరణించారు. -
అమెరికా ఉదారత!
సంపాదకీయం పాకిస్థాన్-అమెరికాల మధ్య సంబంధాలు విలక్షణమైనవనీ, వాస్తవ పరిస్థితుల ప్రభావం సోకనంతటి బలీయమైనవనీ మరోసారి రుజువైంది. ఉగ్రవాద సంస్థలు అల్ కాయిదా, తాలిబన్, లష్కరే తొయిబా(ఎల్ఈటీ), జైషే మహమ్మద్ (జేఈఎం)లను కట్టడి చేయడంలో పాక్ పాత్ర అమోఘమైనదని కీర్తిస్తూ ఆ దేశానికి 150 కోట్ల డాలర్ల సాయాన్ని ఇవ్వబోతున్నట్టు అమెరికా ప్రకటించింది. అఫ్ఘానిస్థాన్, భారత్‌లలో అస్థిరత్వాన్ని సృష్టించడానికీ... ప్రత్యేకించి భారత్‌పై ఆధిక్యత సాధించడానికీ కొన్ని ఉగ్రవాద సంస్థలను పాక్ ప్రోత్సహిస్తున్నదని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించి నిండా రెండు నెలలు కాలేదు. ఎల్ఈటీ, జేఈఎం సంస్థల అధినేతలు పాకిస్థాన్‌లో ర్యాలీలు నిర్వహించి భారత్‌ను బెదిరిస్తూ మాట్లాడి ఇంకా ఆర్నెల్లయినా కాలేదు. ముంబై ఉగ్రవాద దాడికి సారథ్యం వహించిన లఖ్వీకి కేవలం పాక్ ప్రభుత్వ చేతగానితనంవల్ల, నిర్లక్ష్యంవల్ల బెయిల్ లభించి ఇంకా వారం రోజులైనా గడవలేదు. భారత్ తీవ్ర నిరసనల తర్వాత మరో కేసులో అతన్ని అదుపులోకి తీసుకుని ఉండొచ్చుగానీ అదెంతకాలం కొనసాగుతుందో ఎవరూ చెప్పలేని స్థితి. అయినా అమెరికా మాత్రం ఉగ్రవాదాన్ని అరికట్టడంలో పాకిస్థాన్ ప్రదర్శిస్తున్న ‘శక్తిసామర్థ్యాలను’ చూసి మూర్ఛపోయి సాయాన్ని అందించడానికి సిద్ధపడింది. ఎవరితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకొనాలో, తన ఖజానాలో పడి మూలుగుతున్న కోట్లాది డాలర్లను ఎవరెవరికి పంచిపెట్టుకోవాలో నిర్ణయిం చుకునే హక్కు అమెరికాకు ఉంటుంది. కానీ ఆ డాలర్లు ఎలాంటి ఉద్రిక్తతలకు పరోక్షంగా కారణమవుతున్నాయో... ఎంత మందికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయో ఆలోచించవలసిన కనీస బాధ్యత ఆ దేశానికి ఉంది. ఉగ్రవాదాన్ని అంతమొందించే పోరాటానికి తనకు తానే నాయకత్వ పాత్రను కట్టబెట్టుకున్న దేశం ఇలా కబోదిలా వ్యవహరించడం, వాస్తవాలను చూడ నిరాకరించడం సరికాదు. పాకిస్థాన్ విషయంలో ఇలా ఉదారంగా ఉండటం అమెరికాకు ఇది మొదటిసారి కాదు. రెండేళ్లక్రితం కూడా అమెరికా విదేశాంగ శాఖ పాకిస్థాన్‌కు అందించాల్సిన ఆర్థిక సాయంపై చడీ చప్పుడూ లేకుండా షరతులను ఎత్తేసింది. ‘అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలరీత్యా’ ఇది తప్పనిసరంటూ ఆనాటి విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ సమర్థించుకున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ తీసుకుంటున్న చర్యలు చాలినంతగా లేకపోయినా, అవి సక్రమంగా ఉన్నాయని తాము భావించకపోయినా అక్కడి ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ఆర్థిక సాయం కొనసాగించవలసి వస్తున్నదని ఆనాడు అమెరికా చెప్పుకుంది. అయితే, సాయం దారి సాయానిదీ...తన తోవ తనదీ అన్నట్టుగానే పాక్ మొదటినుంచీ ఉంటున్నది. అది సైనిక సాయమైనా, ఆర్థిక సాయమైనా చివరకు చేరేది ఉగ్రవాదుల స్థావరాలకేనని ప్రతిసారీ రుజువవుతున్నది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు కూతవేటు దూరంలో స్థావరాన్ని ఏర్పర్చుకున్న అల్ కాయిదా నేత బిన్ లాడెన్ ఆచూకీని కనుక్కొని మట్టుబెట్టింది అమెరికాయే. పాక్ సైన్యం అండదండలు లేకుండా లాడెన్ అలాంటిచోట స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. ఆ ఉదంతంలో లాడెన్ ఆచూకీ ఇచ్చిన డాక్టర్‌పై దేశ ద్రోహ నేరాన్ని మోపి అతన్ని ఖైదు చేసిన పాక్ ఆ డాక్టర్ ప్రాణాలకు ముప్పున్నదని అమెరికా అభ్యర్థిస్తున్నా విడుదల చేయడంలేదు. పాక్ సైన్యం చెప్పుచేతల్లో పనిచేసే ఐఎస్‌ఐకీ, ఉగ్రవాద సంస్థ హక్కానీకి మధ్య ఉన్న సంబంధాల గురించి అమెరికా సైనిక ఉన్నతాధికారులు పలుమార్లు పాకిస్థాన్ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా దిక్కూ మొక్కూ లేదు. భారత్, అఫ్ఘానిస్థాన్ దేశాల్లో పాక్ సైన్యం ఉగ్రవాదుల ద్వారా చేయిస్తున్న ఆగడాలను పెంటగాన్ నివేదిక ఈమధ్యే ఎండగట్టింది. ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ముందు అఫ్ఘాన్‌లోని హెరాత్‌లో ఉన్న భారత కాన్సులేట్‌పై ఉగ్రవాదులు జరిపిన భారీ దాడిని కూడా ఆ నివేదిక ప్రత్యేకించి ప్రస్తావించింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి కృషిచేస్తున్నదని ఇప్పుడు అదే నోటితో అమెరికా ఎలా అనగలిగిందో అనూహ్యం. ఒకపక్క వచ్చే రిపబ్లిక్ దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు ఒబామా మన దేశానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. అంతకు ముందు ఈ నెల 11న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరగబోయే ఒక సదస్సులో జాన్ కెర్రీ పాల్గొనబోతున్నారు. అయినా పాకిస్థాన్‌కు ఇవ్వదల్చుకున్న కితాబుపై, ఆర్థిక సాయంపై అమెరికా ఎలాంటి మొహమాటాన్నీ ప్రదర్శించలేకపోయింది. వాస్తవానికి పాకిస్థాన్కిచ్చే సాయంపై అమెరికా తనకు తానే కొన్ని నిబంధనలు విధించుకుంది. 2009నాటి చట్టం ప్రకారం ‘పౌరసాయం’ పొందడానికి పాకిస్థాన్ నెరవేర్చవలసిన కర్తవ్యాలున్నాయి. ఉగ్రవాద ముఠాలకు మద్దతునీయకపోవడం, తమ భూభాగంనుంచి మరే ఇతర దేశంపైన అయినా దాడిచేయడానికి ప్రయత్నించే అలాంటి ముఠాలను నిరోధించడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యలను, అక్రమ నగదు లావాదేవీలను నిరోధించే చట్టాలను పటిష్టంచేయడం వగైరా చర్యలు తీసుకోవాలి. వీటన్నిటా పాకిస్థాన్ విఫలమైందని సాక్షాత్తూ పెంటగాన్ నివేదికే చెబుతున్నది. అయినా సాయం అందించడానికి నిర్ణయించుకుని, అందుకోసం పాకిస్థాన్‌కు లేనిపోని భుజకీర్తులను తగిలిస్తున్న అమెరికా తీరు వంచన తప్ప మరేమీ కాదు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలను ఇకనైనా ఆ దేశం మానుకోవాలి. ఒకపక్క అఫ్ఘాని స్థాన్ నుంచి తన సైన్యాన్ని క్రమేపీ తగ్గించుకుంటున్న అమెరికా...వచ్చే ఏడాదికల్లా అది పూర్తవుతుందని చెబుతున్నది. తమ దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని పాక్‌పై అఫ్ఘాన్ ఆరోపిస్తున్నది. మరోపక్క ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల బెడద విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో తన ప్రతి అడుగూ, చర్యా ఉగ్రవాదాన్ని అంతమొం దించడానికి ఉపయోగపడాలి తప్ప వాటికి దోహదపడేందుకు కాదని అమెరికా గుర్తించాలి. -
వాఘా విషాదం
మాటలు కోటలు దాటుతున్నా సొంతింటిని చక్కదిద్దుకోవడంలో పాకిస్థాన్ ఎప్పటిలానే విఫలమవుతున్నదని వాఘా సరిహద్దుల్లో ఆదివారం జరిగిన అత్యంత దుర్మార్గమైన ఆత్మాహుతి దాడి నిరూపించింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ప్రతి సాయంత్రం పతాకాల అవనతం అనంతరం జరిగే సైనిక విన్యాసాన్ని వీక్షించడానికొచ్చి తిరిగి వెళ్తున్న పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి దిగారు. ఇందులో 60 మంది ప్రాణాలు కోల్పోగా, 200మంది గాయపడ్డారంటే దాడి తీవ్రత ఎంతగా ఉన్నదో అర్థమవుతుంది. ఆత్మాహుతి దాడికి బాధ్యులం తామంటే తామని పోటీలుపడి ఉగ్రవాద సంస్థలు ప్రకటించుకోవడం వారిలోని నెత్తుటి దాహాన్ని తెలియపరుస్తుంది. ఉగ్రవాదులు వాఘా వద్ద దాడికి పథకం పన్నుతున్నారని అయిదురోజుల క్రితం ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ పాక్ మీడియాలో కథనాలు వెలువడినా దాన్ని నివారించడంలో అక్కడి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆత్మాహుతి దాడులు పాకిస్థాన్‌కు కొత్త కాదు. ఇటీవలి కాలంలో వాటి సంఖ్య బాగా పెరిగింది. పాక్-అఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులను అణచడం కోసమంటూ సైన్యం తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ తాము ఇలాంటి దాడులు చేస్తున్నామని ప్రతి సందర్భంలోనూ ఉగ్రవాదులు ప్రకటిస్తున్నారు. అయితే, వాఘా సంగతి వేరు. ఇది దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వస్థలం. పాకిస్థాన్‌లో అత్యంత సంపన్నవంతమైన, అధిక జనాభాగల పంజాబ్ రాష్ట్రంలో వాఘా ఉంది. ఈ సరిహద్దు మొదటినుంచీ ఇరుదేశాల సుహృద్భావ సంబంధాలకూ ప్రతీకగా ఉంటూ వస్తున్నది. 1965, 1971 యుద్ధ సమయాల్లో తప్ప ఇక్కడ సైనిక విన్యాసాలు ఎప్పుడూ ఆగలేదు. రెండు దేశాలకూ చెందిన వేలాది మంది పౌరులు ఇరుపక్కలా చేరి సైనిక విన్యాసాలను వీక్షిస్తూ దేశభక్తి నినాదాలు చేసే ప్రాంతమది. కనుక సరిహద్దు ప్రాంతమని మాత్రమేకాక, ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉండొచ్చునన్న కారణంతో భద్రత విషయంలో అదనపు ఏర్పాట్లుచేస్తారు. రెండు పక్కలా మూడు, నాలుగు అంచెల్లో భద్రతా వలయాలుంటాయి. పకడ్బందీ తనిఖీలుంటాయి. పైగా వచ్చే మూడురోజులపాటు విన్యాసాలకు విరామం ప్రకటిద్దామని పాక్ రేంజర్లు ప్రకటించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. వీటన్నిటితోపాటు ఉగ్రవాదుల పథకం గురించి ముందస్తు సమాచారం ఉంది. ఇన్ని అవరోధాలను కూడా ఉగ్రవాదులు అవలీలగా అధిగమించగలిగారంటే తన చేతగానితనం ఏ స్థాయిలో ఉన్నదో పాక్ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. పాక్‌లోని ఉత్తర వజీర్స్థాన్ ప్రాంతంలో సాయుధ మిలిటెంట్లను ఏరివేసే లక్ష్యంతో సైన్యం జర్బ్-ఇ-అజ్బ్ పేరిట సైనిక చర్యను ప్రారంభించింది. ఇందులో కీలక విజయాలు సాధిస్తున్నామని, ఉగ్రవాద నెట్‌వర్క్‌ను చావుదెబ్బ తీయ గలిగామని పాక్ సైన్యం చెప్పుకున్నది. వాఘా ఘటన తర్వాత కూడా మిలిటెంట్లపై తీసుకున్న చర్యలను ఏకరువుపెట్టింది. దేశంలోని పలుచోట్ల దాడులు నిర్వహించామని, ఒక ఆత్మాహుతి దళ సభ్యుడితోసహా ఎందరినో అరెస్టుచేశామని భారీయెత్తున ఆయుధాలనూ, మందుగుండునూ స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. ఇలాంటి చర్యలు ఎప్పుడూ కొనసాగవలసిందే. అయితే, ఈ చర్యలు మాత్రమే ఉగ్రవాదాన్ని నిరోధించలేవు. అంతర్గతంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు... ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న స్వప్రయోజనపరుల సంగతి కూడా చూడాలి. సరిహద్దు వివాదాన్ని అడ్డంపెట్టుకుని భారత్‌ను ఇరకాటంలో పెట్టడం కోసం అక్కడి ఐఎస్ఐవంటి సంస్థలు ఉగ్రవాదానికి ఊతమిస్తున్నాయి. ఈ అనుబంధాన్ని పూర్తిగా ఛేదిస్తే తప్ప ఉగ్రవాదం అంతరించడం సాధ్యంకాదు. దేశం ఆర్థికంగా ప్రగతి సాధించాలంటే అంతర్గతంగా శాంతి, సుస్థిరతలు నెలకొనడంతోపాటు ఇరుగుపొరుగుతో సామరస్యపూర్వక సంబంధాలుండాలి. ఈ రెండింటి విషయంలోనూ పాకిస్థాన్‌ది ఎప్పుడూ వెనకడుగే. పౌర ప్రభుత్వాన్ని చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి నిత్యం ప్రయత్నించే సైన్యంవల్ల ప్రభుత్వం ఇంటా, బయటా నిర్ణయాత్మకంగా వ్యవహరించడంలో విఫలమవుతున్నది. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్ వచ్చిన సందర్భంలో భారత్‌తో ఏర్పడిన సుహృద్భావాన్ని దెబ్బతీసేందుకు సైన్యం శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. పర్యవసానంగా గత రెండునెలల పొడవునా కాల్పుల విరమణ ఉల్లంఘనలు చోటుచేసుకుని సరిహద్దుల్లో ఉద్రిక్తత ఏర్పడింది. పాక్ సరిహద్దుకు చేరివున్న గ్రామాల్లోని పౌరులు 17మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందలాది మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఊళ్లు విడిచి వెళ్లారు. ఉగ్రవాదం మూలాలపై దృష్టిపెట్టి దాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి బదులు పాక్ సైన్యం తన శక్తియుక్తులన్నిటినీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఉపయోగించింది. ఇరు దేశాల అధినేతలూ చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి కేవలం తన శక్తియుక్తులు మాత్రమే చాలవనీ...అంతర్జాతీయ సహకారం, మరీ ముఖ్యంగా భారత్ అండదండలూ లేకుండా సాధ్యంకాదని పాకిస్థాన్ గ్రహించాల్సి ఉన్నది. సరిహద్దుల్లో ప్రశాంతత, అంతర్గతంగా భద్రత మాత్రమే ఉగ్రవాదం ముప్పును నిరోధించగలదని, అప్పుడు మాత్రమే ఆర్థికంగా నిలదొక్కుకోవడం సాధ్యపడు తుందని గుర్తించాలి. ఇందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. మనకు కూతవేటు దూరంలోనే ఆత్మాహుతి దాడి జరగడం మన దేశానికి కూడా హెచ్చరికే. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న కాశ్మీర్‌తోపాటు దేశంలోని ప్రధాన నగరాలన్నిటా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉన్నది. -
ఎన్నికలపై ‘ఉగ్ర పంజా’ !
డీజీపీల సదస్సులో ప్రధాని మన్మోహన్ ఆందోళన సోషల్‌మీడియాను దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలి న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే లక్ష్యంతో ఉగ్రవాద సంస్థలు దాడులకు తెగబడే అవకాశం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ దాడులు జరగొచ్చన్నారు. శనివారం రాజధానిలో జరిగిన రాష్ట్రాల డెరైక్టర్ జనరల్ ఆఫ్ పొలీస్(డీజీపీ) అధికారుల వార్షిక సదస్సులో చివరి రోజు ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘లష్కరే తాయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు మళ్లీ క్రియాశీలం కావడం, సరిహద్దుల్లో పెరుగుతున్న చొరబాటు యత్నాలు.. మన భద్రతా దళాలు మరింత అప్రమత్తతతో, సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను వారు అడ్డుకునేందుకు ప్రయత్నించవచ్చు’ అని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాద కేసుల దర్యాప్తు సందర్భంగా.. దర్యాప్తు సంస్థల వృత్తి నిబద్ధతపై, దేశ లౌకిక వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లకుండా జాగ్రత్త పడాలని, ఎవరికీ అన్యాయం జరగని విధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఉగ్రవాద దాడుల సమయంలో, శాంతిభద్రతలను భంగం కలిగిన సందర్భాల్లో భద్రతాదళాలు తక్షణమే స్పందించాలన్నారు. ఇంటలిజెన్స్ దళాలు నిఘా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలని ప్రధాని కోరారు. మహిళల కోసం వ్యవస్థీకృత యంత్రాంగం ఢిల్లీలో నిర్భయపై జరిగిన దారుణ అత్యాచార ఘటనను ప్రధాని ప్రస్తావించారు. ‘అలాంటి ఘటనల్లో నేరస్తులకు కఠిన శిక్ష విధించేలా, దర్యాప్తు, విచారణ సమయాల్లో పోలీసులు బాధితుల పట్ల మరింత సున్నితంగా వ్యవహరించేలా పలు చట్టాలను తీసుకువచ్చాం’ అన్నారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ఒక వ్యవస్థీకృత యంత్రాంగం అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం చిన్నచిన్న స్థానిక ఘటనలను మతం రంగు పులిమే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. భద్రత విషయంలో ప్రజలకు పోలీసులపై భారీ అంచనాలుంటాయని, వాటిని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలో ప్రజలను రెచ్చగొట్టేందుకు ఫేస్బుక్, ట్విటర్ లాంటి సోషల్‌మీడియాను ఉపయోగించుకున్నారన్న విషయంపై ప్రధాని స్పందించారు. సోషల్ మీడియాను దుర్వినియోగపర్చడాన్ని అడ్డుకునేలా సృజనాత్మక చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక ఆచారాలను గౌరవించండి నక్సల్స్ కార్యకలాపాలు ఇటీవల తగ్గాయని, అయినా వాటిని పూర్తిగా నిర్మూలించేంతవరకు భద్రతాదళాలు విశ్రమించవద్దని సూచించారు. మావోయిస్టులపై జరిపే దాడులు స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్నారు. తిరుగుబాటుదారులు, వేర్పాటువాదులతో చర్చలు జరిపి కొంత పురోగతి సాధించినప్పటికీ, ఈశాన్య రాష్ట్రాల్లో భద్రత పరిస్థితి ఇంకా సంక్లిష్టంగానే ఉందన్నారు. సదస్సు సందర్భంగా ఇంటలిజెన్స్ బ్యూరొ స్మారక పోస్టేజ్ స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరించారు. భారతీయ చట్టాల పరిధిలోకి ఇంటర్నెట్లో సమాచారాన్ని అందిస్తున్న ఫేస్బుక్, ట్విటర్ లాంటి విదేశీ సంస్థలను భారతీయ చట్టాల పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని ఇంటలిజెన్స్ బ్యూరొ అధిపతి ఆసిఫ్ ఇబ్రహీం పేర్కొన్నారు. ఇతర దేశాల్లో ఈ పద్దతి ఉందన్నారు. సదస్సులో ప్రధానికి ఆయన స్వాగతం పలికారు. ప్రాణాంతకం కాని ఆయుధాలను పొలీసు విభాగంలో ప్రవేశపెట్టడం ప్రయోజనకరమైందని ఇబ్రహీం వెల్లడించారు. ప్రజాందోళనల్లో వాటిని ఉపయోగించి ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామన్నారు. పోలీసు శాఖకు విడుదల చేసే నిధులను మౌలిక వసతులకు వినియోగించే నిధులుగా పరిగణించాలని, అందుకు అనుగుణంగా వాటి మొత్తాన్ని పెంచాలని ఆయన ప్రధానిని కోరారు. -
ఉగ్రవాద సంస్థలను చర్చలకు ఆహ్వానించిన షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో శాంతిస్థాపనకు తన ప్రభుత్వం కట్టుబడి వుందని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ గడ్డ నుంచి తీవ్రవాదాన్ని తుదముట్టించేంత వరకు అలుపులేని పోరాటం చేస్తామన్నారు. చర్చలకు రావాలని తీవ్రవాద సంస్థలకు ఆయన పిలుపు ఇచ్చారు. ఆఫ్గనిస్తాన్ సరిహద్దుల నుంచి పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలను మూలాలతో సహా పెకలించివేస్తామని హెచ్చరించారు. శాంతి చర్చలను తిరస్కరిస్తున్న ఉగ్రవాద గ్రూపులు తమ విధానం మార్చుకుని చర్చలకు రావాలని షరీఫ్ ఆహ్వానం పలికారు. పొరుగు దేశం భారత్‌తో సంబంధాల గురించి మాట్లాడుతూ.. రెండు దేశాలూ అర్థరహితమైన యుద్ధాల గురించి ఆలోచించడం కంటే, పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులపై పోరాడాల్సిన వాస్తవాన్ని గుర్తించాలన్నారు.