ఎన్నికలపై ‘ఉగ్ర పంజా’ !
డీజీపీల సదస్సులో ప్రధాని మన్మోహన్ ఆందోళన
సోషల్‌మీడియాను దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలి
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే లక్ష్యంతో ఉగ్రవాద సంస్థలు దాడులకు తెగబడే అవకాశం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఆందోళన వ్యక్తంచేశారు. రానున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ దాడులు జరగొచ్చన్నారు. శనివారం రాజధానిలో జరిగిన రాష్ట్రాల డెరైక్టర్ జనరల్ ఆఫ్ పొలీస్(డీజీపీ) అధికారుల వార్షిక సదస్సులో చివరి రోజు ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘లష్కరే తాయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు మళ్లీ క్రియాశీలం కావడం, సరిహద్దుల్లో పెరుగుతున్న చొరబాటు యత్నాలు.. మన భద్రతా దళాలు మరింత అప్రమత్తతతో, సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతున్నాయి.
వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను వారు అడ్డుకునేందుకు ప్రయత్నించవచ్చు’ అని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాద కేసుల దర్యాప్తు సందర్భంగా.. దర్యాప్తు సంస్థల వృత్తి నిబద్ధతపై, దేశ లౌకిక వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లకుండా జాగ్రత్త పడాలని, ఎవరికీ అన్యాయం జరగని విధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఉగ్రవాద దాడుల సమయంలో, శాంతిభద్రతలను భంగం కలిగిన సందర్భాల్లో భద్రతాదళాలు తక్షణమే స్పందించాలన్నారు. ఇంటలిజెన్స్ దళాలు నిఘా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలని ప్రధాని కోరారు.
మహిళల కోసం వ్యవస్థీకృత యంత్రాంగం
ఢిల్లీలో నిర్భయపై జరిగిన దారుణ అత్యాచార ఘటనను ప్రధాని ప్రస్తావించారు. ‘అలాంటి ఘటనల్లో నేరస్తులకు కఠిన శిక్ష విధించేలా, దర్యాప్తు, విచారణ సమయాల్లో పోలీసులు బాధితుల పట్ల మరింత సున్నితంగా వ్యవహరించేలా పలు చట్టాలను తీసుకువచ్చాం’ అన్నారు. మహిళలు, పిల్లల భద్రత కోసం ఒక వ్యవస్థీకృత యంత్రాంగం అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం చిన్నచిన్న స్థానిక ఘటనలను మతం రంగు పులిమే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. భద్రత విషయంలో ప్రజలకు పోలీసులపై భారీ అంచనాలుంటాయని, వాటిని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలో ప్రజలను రెచ్చగొట్టేందుకు ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సోషల్‌మీడియాను ఉపయోగించుకున్నారన్న విషయంపై ప్రధాని స్పందించారు. సోషల్ మీడియాను దుర్వినియోగపర్చడాన్ని అడ్డుకునేలా సృజనాత్మక చర్యలు చేపట్టాలన్నారు.
స్థానిక ఆచారాలను గౌరవించండి
నక్సల్స్ కార్యకలాపాలు ఇటీవల తగ్గాయని, అయినా వాటిని పూర్తిగా నిర్మూలించేంతవరకు భద్రతాదళాలు విశ్రమించవద్దని సూచించారు. మావోయిస్టులపై జరిపే దాడులు స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్నారు. తిరుగుబాటుదారులు, వేర్పాటువాదులతో చర్చలు జరిపి కొంత పురోగతి సాధించినప్పటికీ, ఈశాన్య రాష్ట్రాల్లో భద్రత పరిస్థితి ఇంకా సంక్లిష్టంగానే ఉందన్నారు. సదస్సు సందర్భంగా ఇంటలిజెన్స్ బ్యూరొ స్మారక పోస్టేజ్ స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరించారు.
భారతీయ చట్టాల పరిధిలోకి
ఇంటర్నెట్‌లో సమాచారాన్ని అందిస్తున్న ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి విదేశీ సంస్థలను భారతీయ చట్టాల పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని ఇంటలిజెన్స్ బ్యూరొ అధిపతి ఆసిఫ్ ఇబ్రహీం పేర్కొన్నారు. ఇతర దేశాల్లో ఈ పద్దతి ఉందన్నారు. సదస్సులో ప్రధానికి ఆయన స్వాగతం పలికారు. ప్రాణాంతకం కాని ఆయుధాలను పొలీసు విభాగంలో ప్రవేశపెట్టడం ప్రయోజనకరమైందని ఇబ్రహీం వెల్లడించారు. ప్రజాందోళనల్లో వాటిని ఉపయోగించి ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామన్నారు. పోలీసు శాఖకు విడుదల చేసే నిధులను మౌలిక వసతులకు వినియోగించే నిధులుగా పరిగణించాలని, అందుకు అనుగుణంగా వాటి మొత్తాన్ని పెంచాలని ఆయన ప్రధానిని కోరారు.