ఆర్‌ఎస్‌ఎస్: కాంగ్రెస్‌కు అసలు ప్రత్యర్థి
మోడీ జపం వద్దంటూ సంఘ్ కార్యకర్తలకు మోహన్ జీ భాగవత్ సూచించారని మీడియాలో వార్తలు రాగా దానిపై ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రచార్ ప్రముఖ్ డాక్టర్ మన్మోహన్ వైద్య ఒక ఖండన విడుదల చేశారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవనీ, అందువల్ల స్వయంసేవకులు అందులో తప్పక పాల్గొంటారనీ, పలు జాతీయ అంశాలకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలను బీజేపీ సమర్థిస్తున్నందున సహజంగానే అది స్వయంసేవకుల ప్రచారం వల్ల లబ్ధి పొందుతుందనీ ఆయన వివరించారు. ఈ కోణం నుంచి ఆర్‌ఎస్‌ఎస్ తన ప్రచారక్ అయిన నరేంద్ర మోడీ గెలుపు కోసం సర్వశక్తులూ కేంద్రీకరిస్తోంది.
స్వాతి: ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఫలితాలను ప్రభావితం చేయగల సంస్థలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఒకటి. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే దీనికి రుజువు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఆర్‌ఎస్‌ఎస్ తనదైన పద్ధతిలో ఎన్నికల రంగంలోకి దిగింది. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించినంతవరకు ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి. ఈసారి బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోడీ స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్ పూర్తిసమయ ప్రచారక్ కావడమే దీనికి కారణం. ప్రస్తుతం ఏబీవీపీ నుండి బీఎంఎస్ వరకు పలు సంఘ్ పరివార సంస్థలునరేంద్ర మోడీకి అనుకూలంగా సాగే ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నాయి. మిషన్ 272 ప్లస్ సాధించడమే వాటి తక్షణ లక్ష్యం. బెంగళూరులో 2014 మార్చి 7, 8, 9 తేదీలలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలలో వార్షిక నివేదిక సమర్పిస్తూ సర్ కార్యవాహ భయ్యాజీ జోషీ లోక్‌సభ ఎన్నికలను ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.
వివేకానంద సార్ధశతజయంతి (150) సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఇటీవల 1,47,46,692 ఇళ్లకు వెళ్లి హిందూత్వ సందేశాన్ని అందించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన తరుణంలో ఈ కార్యక్రమం ఆర్‌ఎస్‌ఎస్‌కు కలిసివచ్చింది. ఇదేగాక దేశవ్యాప్తంగా 860 జిల్లాలలో 19,095 ధర్మరక్షా సమితులను ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసింది. దీనికోసం 480 మంది పూర్తి సమయ కార్యకర్తలు పని చేస్తున్నారు. వీరు గ్రామగ్రామానికీ వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్ దృక్పథాన్ని వివరించడం, ధర్మరక్షాబంధన్, భారతమాత పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇదంతా రాజకీయంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉపకరించింది.
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలోనూ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు చురుకుగా పని చేశారు. ఆ ఎన్నికలు సెమీ ఫైనల్స్ కాగా ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు తుది ఫలితాలను తేల్చేవి కనుక ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు శక్తులన్నిటినీ కేంద్రీకరించి రంగంలోకి దిగాయి. 2013 విజయదశమి నుంచే ఇందుకు సన్నాహాలు జరిగాయి. నాగ్‌పూర్‌లో ఏ బాధ్యతా అప్పగించని సీనియర్ ప్రచారకుల సమావేశం జరిగింది. ఇందులో వేలాదిమంది ప్రచారకులు పాల్గొన్నారు. ఇదిలా వుండగా స్వయంగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ (సర్ సంఘ్ చాలక్) మోహన్ భాగవత్ ఇటీవల పది రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లో సమావేశాలు నిర్వహించి సంఘ్ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు.
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలకు సురేశ్ (భయ్యాజీ) జోషీ, కర్ణాటక, బీహార్‌లకు దత్తాత్రేయ హోస్‌బలే, ఉత్తరప్రదేశ్, అసోంలకు కృష్ణ గోపాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు సురేశ్ సోనీ వంటి అగ్రనేతలు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమాల ప్రగతిని సంఘ్ ప్రముఖులు ఉన్నతస్థాయిలో సమీక్షిస్తున్నారు. ఓటర్లుగా నమోదు చేయించుకోవడం దగ్గర్నుంచి వారిని పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చి అనుకూలంగా ఓటు వేయించుకునేంత వరకు చేయగలిగినంత చేయాలని సంఘ్ అగ్రనేతలు స్వయం సేవకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా హిందూ ఉన్నత కులాల ఓట్లు, మధ్యతరగతి ఓట్లు బీజేపీకి (ఎన్డీఏ) అనుకూలంగా పడతాయని సంఘ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
అలాగే మైనారిటీల బుజ్జగింపు, కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాలు అన్న అంశాలపై ప్రచారం చేయడం ద్వారా ఓబీసీల ఓట్లను కూడా గణనీయంగా సంపాదించేందుకు వ్యూహరచన జరిగినట్లు సమాచారం. అల్పసంఖ్యాక వర్గాల ఓట్ల కోసం ప్రధాని పేదరికానికి ఉండే నిర్వచనాన్ని మార్చేశారన్నది ఆర్‌ఎస్‌ఎస్ అభియోగం. మైనారిటీలకు ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకే దేశ వనరులపై మొదటి హక్కు ఉంటుందని మన్మోహన్ సింగ్ నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ 52వ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఆర్‌ఎస్‌ఎస్ ఉదాహరిస్తోంది. మతపరమైన రిజర్వేషన్ల వల్ల బీసీ రిజర్వేషన్ల స్ఫూర్తికి గండిపడుతుందని సంఘ్ భావిస్తోంది. వాటితో పాటు మతహింస బిల్లును, ఈక్వల్ ఆపర్చునిటీ కమిషన్ ఏర్పాటును కూడా ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇంటింటి ప్రచారం
రాష్ట్ర విభజన విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ తెర వెనుక కీలకమైన పాత్ర పోషించిన సంగతి గోప్యంగానే ఉండి పోయింది. నిజానికి ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టమైన నిర్దేశాల వల్లే బీజేపీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సహకరించింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలలో కూడా ఆర్‌ఎస్‌ఎస్ అనుకూల వర్గాలు చురుకుగా పాలుపంచుకుంటున్నాయి. రాష్ట్రంలో సంఘ్ పరివార్‌సంస్థలు ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఒక కరపత్రాన్ని రూపొందించి ఇంటింటి ప్రచారం సాగిస్తున్నాయి. గత పదేళ్ల యూపీఏ వైఫల్యాలను, కోల్‌గేట్, రైల్వే బోర్డుస్కామ్ వంటి కుంభకోణాలను ఇందులో ఎండగట్టారు. మోడీ పేరును ఇందులో ప్రస్తావించకపోయినా పాలనా సామర్థ్యాన్ని రుజువు చేసుకున్న నాయకుడికి అవకాశం ఇవ్వాలని కోరారు.
నిజానికి ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయేతర సంస్థ. కనుక అది నేరుగా రాజకీయాలలోకి దిగదు. కానీ తన భావాలకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడాలని అది ఆశిస్తుంది. అందుకోసం తన వంతు ప్రయత్నాలు శక్తివంచన లేకుండా చేస్తుంది. ఇందులో భాగంగానే నరేంద్ర మోడీ పేరును సంఘ్ పెద్దలు తెరమీదకు తెచ్చారు. నిజానికి 2004 ఎన్నికల్లో వాజ్‌పేయి, 2009 ఎన్నికల్లో ఎల్‌కే అద్వానీ సారథ్యాన్ని ఆర్‌ఎస్‌ఎస్ సీరియస్‌గా తీసుకోలేదు. ఆరేళ్ల ఎన్డీఏ పరిపాలన ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను పక్కనబెట్టడమే దీనికి కారణం. వాజ్‌పేయి ప్రభుత్వ ఉదారవాద వైఖరి పట్ల సంఘ్‌కు అనేక అభ్యంతరాలున్నాయి. కాశ్మీర్ 370 అధికరణం, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలు వాజ్‌పేయి ప్రభుత్వం ఎజెండాలో లేనివి. అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. స్వయంగా ప్రచారక్ అయిన మోడీ ఇప్పుడు బీజేపీ కేంద్ర బిందువు. చేజారిన ఢిల్లీ గద్దెను తిరిగి దక్కించుకోవడానికి ఇదే సరైన అదను అని ఆర్‌ఎస్‌ఎస్ భావిస్తోంది.
రాహుల్ గాంధీతో ఢీ
మహాత్మా గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్ భావజాలమే కారణమని ఫిబ్రవరిలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అయితే గాంధీ హత్య దరిమిలా విధించిన నిషేధాన్ని ఎత్తి వేసింది నెహ్రూ హయాంలోనేనన్న సంగతి మరచిపోవద్దని సంఘ్ ప్రముఖులు ఎదురు దాడికి దిగారు. అంతటితో ఊరుకోలేదు. దీనిపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఈసీకి ఫిర్యాదు చేశాయి. 2014 మార్చి 11న హైదరాబాద్ సభలో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని రాహుల్‌ను డిమాండ్ చేశారు. ఇలా ఆర్‌ఎస్‌ఎస్ ఈ ఎన్నికల్లోనూ కేంద్రబిందువుగా మారింది.
తెర మీదకు రాకపోయినా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు నిజమైన సవాలు విసురుతున్నది ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సంఘపరివార వర్గం ఇప్పటికే నెటిజన్ల మద్దతును కూడగట్టగలిగింది. అది మిగతా వర్గాలను కూడా ఆకట్టుకోగలుగుతుందా? తన పునాదిని మరింత విస్తరించుకోగలుగుతుందా? వీటికి జవాబు కావాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ‘అబ్ కీ బార్ మోడీ సర్కార్’ అన్న బీజేపీ ఎన్నికల నినాదం ఎంతవరకు ఫలిస్తుందన్నది నిజానికి ఆర్‌ఎస్‌ఎస్ వ్యూహంపైనే
ఆధారపడి ఉంది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న సంఘ్ మోడీని ప్రధాని చేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి ప్రచారం కీలక రాష్ట్రాల్లో ఇన్‌చార్జ్‌ల నియామకం ప్రచారంలో సంఘ్ పరివార్‌కు చెందిన అన్ని విభాగాలు
ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానీ దేశ రాజకీయాలను శాసిస్తుంది..
- ఎన్నికల్లో పాల్గొనదు కానీ ఎవరిని ఎన్నుకోవాలో చెబుతుంది..
- జెండా పట్టదు కానీ ఎజెండా నిర్దేశిస్తుంది..
- రాజకీయ పార్టీ కాదు కానీ దేశవ్యాప్తంగా సుశిక్షితులైన కేడర్ ఉంది.. అదే ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ముఖ్యంగా మోడీని ప్రధానిని చేయడం కోసం నిశ్శబ్దంగా పనిచేసుకు పోతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్).
- ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యక్ష ప్రత్యర్థి బీజేపీ అయితే.. తెర వెనక ప్రత్యర్థి ఆర్‌ఎస్‌ఎస్.
ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం, ఈ ఎన్నికల్లో అది పోషిస్తున్న పాత్రపై కథనం.
దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు 44,982 శాఖలు ఉన్నాయి. 29,624 ప్రాంతాలలో దైనిక శాఖలను నిర్వహిస్తున్నారు.
ఇవేగాక 10,146 సాప్తాహిక శాఖలనూ నడుపుతున్నారు.
35 దేశాలలో ఆర్‌ఎస్‌ఎస్‌కు
594 శాఖలున్నాయి. దేశమంతటా ఆర్‌ఎస్‌ఎస్‌కు వేలాదిగా పూర్తిసమయ ప్రచారక్‌లు ఉన్నారు. వారిలో కొందరు బీజేపీలో సంస్థాగత కార్యదర్శులుగా కీలక బాధ్యతలు
నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయరంగాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేస్తోంది.
నిషేధాల నేపథ్యంలో ప్రస్థానం
1925లో ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన జరిగింది. డాక్టర్జీగా పేరు పొందిన డాక్టర్ కేశవరావ్ బలీరామ్ హెడ్గేవార్ దాని వ్యవస్థాపకులు. మహాత్మా గాంధీ హత్య దరిమిలా 1948 ఫిబ్రవరి 4న నిషేధానికి గురైంది. ఆ తర్వాత గాంధీ హత్యతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదని కపూర్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో బేషరతుగా నిషేధాన్ని తొల గించారు. 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు దానిని తీవ్రంగా వ్యతిరేకించిన ఆర్‌ఎస్‌ఎస్ మరోసారి నిషేధం ఎదుర్కొంది.
అనంతర పరిణామాలలో జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పడేందుకు ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన పాత్ర అందరికీ తెలిసిందే. ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ ఆలోచనలను పంచుకొనే జనసంఘ్ నాడు జనతా పార్టీలో విలీనమైంది. అయితే జనతాప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యులైనవారు ప్రభుత్వంలో కొనసాగరాదంటూ కొందరు అభ్యంతరపెట్టగా ద్వంద్వ సభ్యత్వ వివాదంతో జనతా సర్కారు కాస్తా పతనమైంది. దరిమిలా ఆర్‌ఎస్‌ఎస్ అనుకూలభావజాలంతో బీజేపీ అవతరించింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత సైతం ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించారు. అయితే ఆధారాలు లేకపోవడంతో నిషేధం కొనసాగింపునకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలా స్వాతంత్య్రానంతరం ఆర్‌ఎస్‌ఎస్ మూడుసార్లు నిషేధానికి గురైంది. ఎంతగా వ్యతిరేకించినా కూడా 1963లో స్వయంగా నెహ్రూ ఆర్‌ఎస్‌ఎస్‌ను రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొనవలసిందిగా ఆహ్వానించడం విశేషం. ప్రభుత్వ ఆహ్వానం మేరకు సంఘ్ స్వయంసేవకులు నాటి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్నారు.
సంఘ్ మాస్క్.. మోడీ
Published Fri, Apr 4 2014 1:58 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement