వేటు తప్పించుకున్న స్మృతి ఇరానీ!
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ అనర్హత వేటు నుంచి అమేథి బీజేపీ లోకసభ అభ్యర్ధి స్మృతి ఇరానీ తప్పించుకున్నారు. స్మృతిపై అనర్హత వేటు గురించి వ్యాఖ్యానించడం సబబు కాదని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివారాలు స్మృతి ఇరానీ నుంచి ఇంకా అందలేదని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత 30 రోజుల వరకు ఖర్చుల జాబితాను దాఖలు చేసేందుకు సమయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాతనే అభ్యర్తుల ఎన్నికల ఖర్చకు సంబంధించిన వివరాలపై పరిశీలన ఉంటుందన్నారు.
అమేథిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పోటి పడుతున్న స్మృతి ఇరానీకి మద్దతుగా బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ కోసం లెక్కకు మించి ఖర్చు చేశారని ఎన్నికల అధికారులు అభిప్రాయపడ్డారు.
ఆ కారణంగా లోకసభ ఎన్నికల్లో అభ్యర్థి ఖర్చు 70 లక్షలకు మించి ఖర్చు చేయకూడదనే నిబంధనను స్మృతి ఇరానీ ఉల్లంఘించారనే వార్తలు వచ్చాయి. ఒకవేళ అభ్యర్థి 70 లక్షలకు మించి ఖర్చు చేసినట్టయితే ఈసీ అనర్హత వేటును వేయడానికి అవకాశం ఉంటుంది.