ఓడిపోతే మళ్లీ టీ అమ్ముకోవడానికి సిద్ధం:మోడీ
అమేథీ:తాను ఓడిపోతే తిరిగి టీ అమ్ముకోవడానికి సిద్ధమని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న నియోజక వర్గాల్లో పరాజయం పాలైతే.. తిరిగి టీ అమ్ముకుంటానని చమత్కరించారు. ఈ రోజు కాంగ్రెస్ కంచుకోటైన అమేథీలో ఆయన స్మృతి ఇరానీకి మద్దతుగా ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గతంలో టీ అమ్మిన రోజులను గుర్తు చేసుకున్నారు.
'పేదరికంలో పుట్టడం నేరమా? టీ అమ్ముకోవడం నేరమా? వారు (కాంగ్రెస్) నన్ను నేరస్థునిగా చిత్రీకరిస్తున్నారు. ఒక ఛాయ్ వాలా ప్రస్తుతం మీ చేతిల్లో ఉన్నాడు. దేశాన్ని మార్చుకునే చక్కటి అవకాశ మీ చేతిల్లో ఉంది' అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో అవినీతి హెచ్చరిల్లిందని విమర్శించారు. కొంతమంది గ్రూపుగా కలిసి దేశాన్ని, ప్రజలను దోచుకున్నారన్నారు.
తాను మార్పును తీసుకురావడానికి రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. రాబోయేవి మంచి రోజులని మోడీ ప్రజలకు భరోసా ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేద ప్రజలను మోసం చేశారన్నారు. అవినీతిని రూపు మాపడమే తన ప్రధమ కర్తవ్యమన్నారు. అవినీతిని ఎవరు ప్రోత్సహించినా సహించబోమన్నారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో తన తల్లి ఆటో రిక్షాలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న విషయాన్నిఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు.