‘చే’జారుతున్న అమేథీ!
గాంధీల వారసత్వానికి అగ్నిపరీక్ష
అమేథి: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ ఎన్నికలు గాంధీల కుటుంబానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండటంతో అందరి దృష్టి అమేథీపైనే ఉంది. గాంధీల కంచుకోటగా పేరుపడ్డ ఈ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. మొదటి నుంచి ఆ ప్రాంత ప్రజలు గాంధీ వారసులకే పట్టం కడుతున్నారు. గత దశాబ్దకాలం అమేథీపై కాంగ్రెస్ పట్టు తగ్గుతూ వస్తోంది.
2014 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రాహుల్‌గాంధీకి బీజేపీ నేత స్మృతి ఇరానీ చెమటలు పట్టించారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ సీట్లకు కాంగ్రెస్ మూడింటినే గెలుచుకుంది. సమాజ్‌వాదీ, బీఎస్పీలు చెరో సీటు దక్కించుకున్నాయి. ఇక 2012 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితమైంది. ఎస్పీ మూడు స్థానాలు గెలుచుకుని ఆధిక్యం చాటుకుంది.
ఈసారి పోటీ మరింత తీవ్రంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఎస్పీతో పొత్తు పెట్టుకున్నా కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అమేథీ అసెంబ్లీ స్థానం నుంచి ఎస్పీ, కాంగ్రెస్‌లు పొత్తు ధర్మం మరచి తమ అభ్యర్థుల్ని నిలబెట్టడంతో బీజేపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. బీజేపీ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత, రాజకుటుంబీకుడు సంజయ్ సిన్హా మొదటి భార్య గరీమా సింగ్ పోటీలో ఉండగా... కాంగ్రెస్ తరఫున రెండో భార్య అమితా సిన్హా బరిలో ఉన్నారు.
ఇక సమాజ్‌వాదీ నుంచి వివాదాస్పద మంత్రి గాయత్రీ ప్రజాపతి బరిలో నిలబడ్డారు. అమితా సిన్హా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. నియోజకవర్గంలో రోడ్లు, విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు నేరాలు పెరగడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆ నేపథ్యంలో అమితా గెలుపు కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రజాపతిపై వరుస కేసులు నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటు న్నారు. అయినా సొంత బలం, బలగంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు.