సచిన్కు భారతరత్న ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రధానిపై కేసు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ఇవ్వడం పట్ల ఒక పక్క ఆనందం వ్యక్తమవుతుంటే, మరో పక్క వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. బీహార్లో ఓ న్యాయవాది సచిన్కు భారతరత్న ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కోర్టు కేసు వేయగా, ఢిల్లీలో ఓ సమాచార హక్కుల ఉద్యమకారుడు ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్దమని కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి)కి ఫిర్యాదు చేశారు.
ప్రధాని, కేంద్ర హొం, క్రీడల మంత్రులు, సచిన్లపై కేసు
ముజఫర్పూర్(బీహార్) : సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీహార్లోని ముజఫర్పూర్ కోర్టులో ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కేసు నమోదైంది. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే, కేంద్ర క్రీడల శాఖ మంత్రి భన్వర్ జితేంద్ర సింగ్లలతోపాటు క్రికెట్ దిగ్గజం సచిన్ని కూడా న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా నిందితులుగా పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ 420, 419,417,504, 120(బి) సెక్షన్ల కింద అతను కేసు వేశారు.
దేశ అత్యున్నత పౌరపురస్కారం భారత హాకీ మాంత్రికుడు ద్యాన్ చంద్కు ఇవ్వకుండా సచిన్కు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ద్యాన్ చంద్ను పక్కన పెట్టి సచిన్కు ఇటువంటి గౌరవం ఇచ్చినందున దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన కోర్టు విచారణను డిసెంబరు 10వ తేదికి వాయిదా వేసింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఇసికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ఇవ్వడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని సమాచార హక్కల ఉద్యమకారుడు దేబశిష్ కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి)కి ఫిర్యాదు చేశారు . అతనికి అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వడం కొన్ని కోట్ల మంది ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఓటర్లు కూడా ఉంటారని ఆయన వాదిస్తున్నారు. నిజానికి మాస్టర్‌కు భారతరత్న ప్రకటించినప్పటి నుంచే ఏదో ఒక వివాదం తెరపైకి వస్తోంది. అతనికిస్తే ధ్యాన్‌చంద్‌కూ ఇవ్వాలని కొందరు వాదిస్తుంటే, మాస్టర్ అసలు అర్హుడే కాదని మరికొందరు అంటున్నారు. తాజాగా ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనంటూ దాఖలైన పిటిషన్ మరో వివాదానికి తెరలేపింది.