![Manmohan Singh might leave Rajya Sabha briefly as he nears end of his term - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/16/985.jpg.webp?itok=ebexgAP2)
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్(86) రాజ్యసభకు కొద్దిరోజుల పాటు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అస్సాంలో మన్మోహన్ సీటుతో పాటు మరో స్థానానికి జూన్ 14తో ఆరేళ్ల గడువు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జూన్ 7న ఎన్నికల నిర్వహించేందుకు ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది. సాధారణంగా రాజ్యసభకు ఓ అభ్యర్థిని నామినేట్ చేయాలంటే 43 మంది ఎమ్మెల్యేల తొలి ప్రాధాన్యత ఓట్లు కావాలి. అయితే 126 సీట్లు ఉన్న అస్సాం అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 25 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు బీజేపీ, దాని మిత్రపక్షాలకు కలిపి 87 సీట్లు ఉన్నాయి. దీంతో మన్మోహన్ కొద్దికాలం పాటు రాజ్యసభకు దూరం కావొచ్చని తెలుస్తోంది.
తమిళనాడులో ఈ ఏడాది జూలై చివరినాటికి 6 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తే ఓ రాజ్యసభ సీటును మన్మోహన్‌కు కేటాయించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒకవేళ అది కుదరకుంటే 2020, ఏప్రిల్‌లో మరో 55 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. ఈ కోటాలో మన్మోహన్‌ను ఎగువసభకు పంపాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్లు వెల్లడించాయి. మన్మోహన్ సింగ్ 1991లో తొలిసారి అస్సాం నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా 28 సంవత్సరాల పాటు అస్సాంకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. మరోవైపు అస్సాంలో అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ ఓ సీటును మిత్రపక్షం ఎల్జేపీకి అప్పగించే అవకాశమున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్‌ను కమలనాథులు రాజ్యసభకు నామినేట్ చేయవచ్చని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment