కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉండలేను | CWC rejects Rahul Gandhi offer to step down as Congress president | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉండలేను

Published Sun, May 26 2019 6:12 AM | Last Updated on Sun, May 26 2019 9:58 AM

CWC rejects Rahul Gandhi offer to step down as Congress president - Sakshi

సీడబ్ల్యూసీ భేటీలో సోనియా గాంధీ, రాహుల్, మన్మోహన్‌ సింగ్‌

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు సంభవించాయి. శనివారం జరిగిన కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి(సీడబ్ల్యూసీ) భేటీలో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలనుకుంటున్నట్లు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. అయితే, ఆయన నిర్ణయాన్ని ముక్తకంఠంతో సమావేశం తిరస్కరించింది. అయితే, రాహుల్‌ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే సూచనలు కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరొకరికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇందుకు సరైన నేతల్లో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఒకరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

నాలుగు గంటలపాటు భేటీ
దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింథియా, పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌  రాష్ట్రాల సీఎంలు అమరీందర్‌ సింగ్, అశోక్‌ గహ్లోత్, భూపేశ్‌ బఘేల్‌తోపాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, పార్టీ సీనియర్‌ నేతలు చిదంబరం, ఆంటోనీ, అహ్మద్‌ పటేల్, ఆజాద్, షీలా దీక్షిత్, ఖర్గే తదితర 50 మంది నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ వైఫల్యానికి కారణాలు, ప్రజలను మెప్పించడంలో వైఫల్యానికి దారి తీసిన పరిస్థితులను చర్చించారు.

ఆయనే కొనసాగాలన్న సీడబ్ల్యూసీ
‘రాహుల్‌ నిర్ణయాన్ని సమావేశం ముక్తకంఠంతో తిరస్కరించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీకి నాయకత్వం, మార్గదర్శకత్వం వహించాలని ఆయన్ను కోరింది’అని సమావేశం అనంతరం మీడియాతో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా తెలిపారు. ‘పార్టీని అన్ని స్థాయిల్లోనూ పార్టీ బలోపేతం, పునర్నిర్మాణం చేపట్టాలని, దేశంలోని యువత, రైతులు, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షాన పనిచేసేందుకు పార్టీకి నేతృత్వం వహించాలని సీడబ్ల్యూసీ కోరింది. పార్టీకి ఓట్లేసిన 12.13 కోట్ల మంది ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది’అని ఆయన తెలిపారు. రాహుల్‌ను అధ్యక్షుడిగా కొనసాగాలన్న సీనియర్‌ నేత చిదంబరం సమావేశంలో కొంత ఉద్విగ్నానికి లోనయ్యారు.

బాధ్యతల నుంచి వైదొలగాలన్న రాహుల్‌ నిర్ణయం నేపథ్యంలో పార్టీ మద్దతుదారులు, ముఖ్యంగా  దక్షిణాదికి చెందిన వారు తీవ్రమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. పార్టీ వైఫల్యానికి కారణాలను వివరిస్తూ సమావేశంలో ప్రియాంక, మన్మోహన్‌ మాట్లాడారు. తన ప్రభుత్వం మనుగడ ప్రమాదంలో పడిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ ఈ సమావేశానికి హాజరుకాలేదని సమాచారం. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే గెలుచుకున్న ఎంపీ సీట్ల సంఖ్య 44 నుంచి 52కు పెరిగినప్పటికీ 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఖాతా తెరవలేకపోయింది. పార్టీ పరాజయానికి తమదే బాధ్యతంటూ యూపీ, ఒడిశా కాంగ్రెస్‌ అధ్యక్షులు రాజ్‌ బబ్బర్, నిరంజన్‌ పట్నాయక్‌ ఇప్పటికే రాజీనామాలు సమర్పించగా మరికొందరూ అదే బాటలో ఉన్నట్లు చెబుతున్నారు.  

పార్టీ చీఫ్‌గా ప్రియాంక వద్దు
ఈ సమావేశంలో ప్రసంగించిన రాహుల్‌.. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన పోరాటం కొనసాగుతుంది. క్రమశిక్షణ గల కాంగ్రెస్‌ పార్టీ సైనికుడిగా నా పోరాటాన్ని కొనసాగిస్తా. కానీ, పార్టీ అధ్యక్షుడిగా నేను కొనసాగాలనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. తన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలని కోరారు. ప్రియాంకకు ఆ బాధ్యతలు అప్పగించాలని కొందరు ప్రతిపాదించగా ‘నా సోదరిని ఈ విషయంలోకి లాగకండి’ అంటూ రాహుల్‌ వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా గాంధీ కుటుంబానికి చెందిన వారే ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కంచుకోట వంటి అమేథీ నుంచి ఓటమి చవిచూడటంతో రాహుల్‌ రాజీనామా చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. దీంతో తల్లి సోనియా, చెల్లి ప్రియాంక ఎంతగా నచ్చజెప్పినా వెనక్కి తగ్గేందుకు ఆయన అంగీకరించలేదు. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం మీడియా భేటీలో పాల్గొనకుండానే రాహుల్‌ వెళ్లిపోయారు. దీంతో వైదొలిగే యోచనలోనే రాహుల్‌ ఉన్నట్లు భావిస్తున్నామని నేతలు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement