రాజీనామాల పర్వం | Congress chief Rahul Gandhi likely to resign at CWC meet | Sakshi
Sakshi News home page

రాజీనామాల పర్వం

Published Sat, May 25 2019 2:06 AM | Last Updated on Sat, May 25 2019 3:32 AM

Congress chief Rahul Gandhi likely to resign at CWC meet - Sakshi

రాహుల్‌ గాంధీ, రాజ్‌బబ్బర్‌

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక సంఘం (సీడబ్ల్యూసీ) భేటీ శనివారం ఉదయం 11 గంటలకు జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా సీడబ్ల్యూసీలో రాజీనామా సమర్పించే అవకాశం ఉందని సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 52 సీట్లతో పార్టీ ఘోర పరాజయం చెందడంపై ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు. పార్టీ ఓటమికి కారణాలపై సమీక్ష జరపనున్నారు. సంస్థాగత లోపాలు, ప్రచార వ్యూహం విఫలం కావడంతో పాటు రాష్ట్ర కమిటీల అంతర్గత కుమ్ములాటలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

బీజేపీ ముందెన్నడూ లేనంత బలమైన పార్టీగా అవతరించిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ను సంస్కరించడానికి, పునరుజ్జీవింప చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఒక అంతర్గత కమిటీని నియమించే అవకాశంపై కూడా చర్చించవచ్చని తెలుస్తోంది. ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లతో పాటు బిహార్‌ తదితర రాష్ట్రాల్లో పార్టీ దెబ్బతినడానికి కారణాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్,తో పాటు ఏకే ఆంటోని, అశోక్‌ గెహ్లోత్, కేసీ వేణుగోపాల్, గులాంనబీ ఆజాద్‌ తదితర అగ్రనేతలు భేటీలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చేతిలో కాంగ్రెస్‌ వరుసగా రెండోసారి పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.  

అదే బాటలో యూపీ, ఒడిశా చీఫ్‌లు
మరోవైపు సీడబ్ల్యూసీకి ముందే పలువురు నేతలు పార్టీ పదవులకు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షులు రాజ్‌బబ్బర్, నిరంజన్‌ పట్నాయక్‌లు ఇప్పటికే తమ పదవులకు రాజీనామాలు ప్రకటించారు. ఈ మేరకు లేఖలను పార్టీ అధినేత రాహుల్‌కు పంపించారు. పార్టీ ఇంతలా నష్టపోవడానికి, ప్రజలకు చేరువ కాలేకపోవడానికి కారణాలు ఏమిటనే దానిపై నేతలు ఇప్పటికే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. 80 ఎంపీ స్థానాలున్న యూపీలో సోనియాగాంధీ సీటు రాయబరేలీలో మాత్రమే కాంగ్రెస్‌ గెలుపొందింది.

కీలక అమేథీ నియోజకవర్గంలో రాహుల్‌ గాంధీ సైతం బీజేపీ నేత స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఫతేపూర్‌ సిక్రీ నుంచి పోటీ చేసిన బబ్బర్‌ బీజేపీకి చెందిన రాజ్‌కుమర్‌ చహర్‌ చేతిలో దాదాపు 5 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓటమి చవిచూశారు. ఎన్నికల ఫలితాలు ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ను తీవ్రంగా నిరాశపరిచాయి. నా బాధ్యతలు నేను సరైన విధంగా నిర్వర్తించనందుకు నాకు నేనే దోషిగా భావిస్తున్నానంటూ బబ్బర్‌ హిందీలో ట్వీట్‌ చేశారు. కాగా రాష్ట్రంలో పార్టీ ఓటమికి నైతికి బాధ్యత వహిస్తూ తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపినట్లు ఒడిశా పీసీసీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ తెలిపారు. ఒడిశాలో కాంగ్రెస్‌ ఒక లోక్‌సభ స్థానంలో, తొమ్మిది అసెంబ్లీ సీట్లలో మాత్రమే గెలుపొందింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement