ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు జెరూసలేం వైపుగా దూసుకొస్తున్న దృశ్యం
ఇప్పటి దాకా ముసుగులో గుద్దులాటగా ఉన్న వ్యవహారం బట్టబయలైంది. ఏప్రిల్ 13 రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ పెద్దయెత్తున సాగించిన డ్రోన్, క్షిపణì దాడితో ఆ రెండు దేశాల మధ్య నాలుగు దశా బ్దాల పైగా లోలోపల సాగుతున్న కుమ్ములాట బయటపడింది. ముందుగా ఏప్రిల్ 1న సిరియా రాజధాని డెమాస్కస్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి, ఒక జనరల్ సహా పలువురు సైనికాధికారుల మృతితో అగ్గి రాజుకుంది. ప్రతీకారంగా గత శనివారం ఇరాన్ పంజా విసరడంతో వ్యవహారం ముదిరింది. యుద్ధం ఊసెత్తకపోయినా దెబ్బకు దెబ్బగా టెహరా న్‌పై తగిన చర్య చేపడుతామంటోంది టెల్ అవీవ్. అసలే అస్థిరతలో మునిగిన పశ్చిమాసియా ఈ శరవేగ పరిణామాలు, వ్యాఖ్యలతో ఏ క్షణమైనా పూర్తిస్థాయి యుద్ధంలో చిక్కుకుపోవచ్చు.
చాలాకాలంగా ఇరాన్ తన వ్యూహాత్మక లక్ష్యాలకై పరోక్ష సహకారం అందిస్తూ ప్రాంతీయ తీవ్రవాద సంస్థలను ఇజ్రాయెల్ పౌరులపైన, వివిధ దేశాల్లోని ఇజ్రాయెల్ ఆస్తులపైన ప్రయోగిస్తూ వచ్చింది. అయితే, ఇజ్రాయెల్‌తో ఎన్నడూ నేరుగా ఘర్షణకు దిగలేదు. తెర వెనుక నుంచి తాను చేసినవి ఒప్పుకోనూ లేదు. ఇజ్రాయెల్‌దీ అదే పంథా. మూడేళ్ళ క్రితం ఇరాన్‌కు చెందిన ముగ్గురు అణుశాస్త్రవేత్తల హత్యలో తన పాత్రను ఆ దేశమూ అంగీకరించ లేదు, అలాగని ఖండించనూ లేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులతో గాజా భూఖండం సంక్షోభంలో పడింది.
సదరు హమాస్ దాడుల వెనుక ఇరాన్ పాత్ర గురించి కథలు కథలుంటే, అదే అదనుగా పాలెస్తీనీయుల గాజాను ఇజ్రాయెల్ సమూలంగా ధ్వంసం చేసేసింది. ఐరాస సహా ఎవరెన్ని చెప్పినా నెలల తరబడి ఇజ్రాయెల్ ఆగలేదు, గాజాపై దాడులు ఆపనూ లేదు. ఈ నేపథ్యం నుంచి తాజా ఘటనల్ని చూడాలి. చివరకిప్పుడు ఇరాన్ నేరుగా తన గడ్డ మీద నుంచే ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది. కొన్ని దశాబ్దాలుగా పశ్చిమాసియాలో ఎన్నడూ లేనంతటి ఉద్రిక్తతను పెంచింది.
ఇరాన్ ప్రయోగించిన 360 క్షిపణుల్లో చాలావాటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్‌ల సహకారంతో ఇజ్రాయెల్ నిలువరించగలిగింది. రాయబార కార్యాలయంపై దాడికి ప్రతిగా స్వీయ రక్షణ కోసమే తాము దాడి చేశామనీ, విషయం ఇంతటితో ముగిసిందనీ ఇరాన్ అంటోంది. ఇక, క్షిపణి దాడిని సమర్థంగా అడ్డుకున్నందున సంయమనం పాటించి, పరిస్థితి ప్రాంతీయ యుద్ధానికి దారి తీయకుండా చూడాలని అమెరికా సహా ఇతర మిత్రదేశాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అభ్యర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్ సరేనన్నట్టు ఉంటూనే, ఇరాన్‌కు తగిన బదులిస్తామంటోంది. ఏమైనా ఇరాన్, ఇజ్రాయెల్‌లు దేనికది మధ్యప్రాచ్యంలో తమదే పై చేయి అని చూపేందుకు యత్నిస్తున్నాయి. అందులో భాగమే రెండు దేశాలూ ఇప్పుడు దాదాపు నేరుగా కయ్యానికి దిగడం!
పశ్చిమాసియాలో పరిస్థితికి ఇరు దేశాల బాధ్యతా ఉంది. ఇజ్రాయెల్ నిస్సిగ్గుగా పాలెస్తీనా భూభాగాల్ని బలవంతాన దిగ్బంధించి, కథ నడుపుతుంటే ప్రపంచపు పెద్దన్నలెవరూ ఎన్నో ఏళ్ళుగా పెదవి విప్పలేదు. పట్టించుకోకుండా వదిలేశారు. నిరుడు హమాస్ దాడితో ఇజ్రాయెల్ అహం దెబ్బ తిని, గాజాలో సామూహిక ఊచకోతకు దిగినప్పుడూ అమెరికా సహా ఎవరూ దాన్ని ఆపలేక పోయారు. ఇరాన్ సంగతికొస్తే, అదీ ఇష్టానుసారం వ్యవహరించింది.
హెజ్బుల్లా, హమాస్, హౌతీల లాంటివన్నీ అది పరోక్షంగా పోషిస్తున్న పాములే. కొన్నేళ్ళుగా ఇరాక్, లెబనాన్, సిరియా, యెమన్ లలో ఇరాన్ పరోక్ష సహకారంతో నడుస్తున్న ప్రాంతీయ తీవ్ర వాద మూకలను నిలువరించడమే ఇజ్రాయెల్, అమెరికాల పని అయింది. వెరసి, ఇరాన్, ఇజ్రాయెల్‌ల తప్పిదాలు, స్వార్థంతో పక్కన చేరిన దేశాలతో పశ్చిమాసియా చిక్కుల్లో పడింది. తాజా ఘటనలతో యుద్ధం అంచున నిల్చుంది.
ప్రతి యుద్ధం ప్రపంచంలో అనిశ్చితిని పెంచేదే. మరీ ముఖ్యంగా, ప్రపంచానికి ఇంధన భాండా గారం లాంటి పశ్చిమాసియా యుద్ధక్షేత్రంగా మారితే ఇక చెప్పేదేముంది! తీవ్ర పరిణామాలు తప్పవు. ఇరాన్ – ఇజ్రాయెల్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రస్తుతం ప్రపంచమంతటా ఉత్కంఠ నెలకొన్నది అందుకే! వ్యవహారాన్ని తెగేదాకా లాగి, ప్రపంచం రెండు శిబిరాలుగా చీలితే కష్టం. ఇరాన్ దాడితో పని లేకుండా గాజాలో యుద్ధం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అంటోంది.
అంటే, ఇరాన్ – ఇజ్రాయెల్ సంక్షోభం ముగియనే లేదని స్పష్టమవుతోంది. తక్షణమే అంతర్జాతీయ సమాజం బరిలోకి దిగి, ముందు గాజాలో దాడులు, పాలెస్తీనాలో అమాయక పౌరుల మరణాలు ఆగేలా చూడాలి. ఇజ్రాయెల్‌కు 66 శాతం మేర ఆయుధాలిస్తున్న అమెరికా, అలాగే ఇతర ఆయుధ సరఫరా దేశాలు తమ సరఫరాలు తగ్గించగలిగితే మేలు.
అంతకంతకూ అంతర్జాతీయంగా తాను ఒంటరి అవుతున్నానని ఇజ్రాయెల్ గుర్తించాలి. ‘అబ్రహమ్ ఒడంబడికల’ ద్వారా మితవాద అరబ్ దేశాలు నెయ్యానికి ముందుకు రావడంతో దానికి కలి గిన ప్రయోజనం పోతుంది.
అయినా, ఇంతకు ముందు, ఇకపైన కూడా మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌లు రెండు ప్రధాన సైనిక శక్తులు. ఇరుపక్షాలూ లక్ష్మణరేఖ దాటాయి. వాటి మధ్య ఘర్షణ చివరకు యుద్ధంగా పర్యవసిస్తే అది రెంటికీ నష్టమే. కాబట్టి, మంకుపట్టు వీడి, వెనక్కు తగ్గాలి. ప్రస్తుత ఉద్రిక్తతను చల్లార్చాలి. పొంచివున్న పెను యుద్ధం ముప్పును నివారించాలి. పశ్చిమాసి యాలో ఉద్రిక్తతలు కొనసాగితే, ప్రపంచ చమురు సరఫరాలు సైతం అస్తవ్యస్తమై, ధరలు పెరుగు తాయి. రష్యా నుంచి చమురు సరఫరా కోసం ఎర్రసముద్రంపై ఆధారపడే మన దేశానికీ ఇబ్బందే. భారత్ సూచించినట్టు మళ్ళీ దౌత్యమార్గాన్ని ఆశ్రయించడమే అన్ని వివాదాలకూ పరిష్కారం.
Comments
Please login to add a commentAdd a comment