
బాంబుల మోత ఆగుతుందంటే... తుపాకులు మౌనం పాటిస్తాయంటే... క్షిపణుల జాడ కనబడదంటే... ఇనుప డేగల గర్జనలు వినబడవంటే... నిత్యం మృత్యువు వికటాట్టహాసం చేస్తున్నచోట హర్షాతిరేకాలు వ్యక్తం కావటం సహజమే. అందుకే 15 నెలలుపైగా... అంటే 467 రోజులుగా రాత్రింబగళ్లు ప్రాణభయంతో కంటి మీద కునుకు లేకుండా గడిపిన గాజా ప్రజానీకం వీధుల్లోకొచ్చి పండుగ చేసుకున్నారు.
అటు హమాస్ చెరలో మగ్గుతున్నవారి కుటుంబసభ్యులు సైతం ఆనందో త్సాహాలతో ఉన్నారు. ఇజ్రాయెల్–మిలిటెంట్ సంస్థ హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని మధ్యవర్తులుగా వ్యవహరించిన అమెరికా, ఖతార్ ప్రతినిధులు బుధవారం రాత్రి ప్రకటించగానే ప్రపంచం, ప్రత్యేకించి పశ్చిమాసియా ఊపిరి పీల్చుకున్నాయి. ‘నేను దేశాధ్యక్షపదవి స్వీకరించబోయే జనవరి 20 నాటికి బందీలకు స్వేచ్ఛ లభించకపోతే సర్వనాశనం ఖాయమ’ని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పక్షం రోజుల నాడు ప్రకటించారు.
‘నా హెచ్చరిక ఫలించబట్టే కాల్పుల విరమణ ఒప్పందం సాకారమైంద’ని ఇప్పుడు ఆయన అంటుంటే... ‘నా అనుభవంలోనే అత్యంత కఠినమైన ఈ చర్చల ప్రక్రియను మొత్తానికి సుఖాంతం చేయగలిగాన’ని ప్రస్తుత అధ్య క్షుడు జో బైడెన్ చెబుతున్నారు. ఈ ఘనత ఎవరి ఖాతాలో పడాలన్నది తేలకముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మొండికేస్తున్నారు. తొలుత ఒప్పందాన్ని స్వాగతించిన ఆయనే ఇంకా తేలాల్సినవి ఉన్నాయంటున్నారు.
ఒప్పందంపై ఆమోదముద్ర వేసేందుకు నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని నిలిపివేశారు. ఈలోగా నిన్న, ఇవాళ గాజాపై ఇజ్రాయెల్ సాగించిన బాంబు దాడుల్లో 19మంది పిల్లలు సహా 80 మంది చనిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుందా లేదా, ఈ ప్రాంతంలో తాత్కాలికంగానైనా శాంతి నెలకొంటుందా అన్న అంశంలో సందిగ్ధత ఏర్పడింది. సుదీర్ఘకాలం ఘర్షణలతో అట్టుడికినచోట సాధారణ పరిస్థితులు ఏర్పడటం అంత సులభమేమీ కాదు. అందునా ఇజ్రాయెల్‌తో వైరమంటే మామూలుగా ఉండదు.
ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 2023 అక్టోబర్ 7న విచ్చలవిడిగా కాల్పులు జరిపి 1,200 మంది పౌరులను హతమార్చటంతో పాటు, 251 మందిని బందీలుగా తీసు కెళ్లటంతో ఇదంతా మొదలైంది. హమాస్ మతిమాలిన చర్య తర్వాత ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో గాజా, వెస్ట్‌బ్యాంక్‌లపై సాగించిన దాడుల పర్యవసానంగా ఇంతవరకూ కొందరు హమాస్ కీలకనేతలతో పాటు 46,700 మంది పౌరులు చనిపోయారు. ఇందులో అత్యధికులు పిల్లలు, మహి ళలే. ఇతరులు నిత్యం చావుబతుకుల మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం జారవిడిచే కరపత్రాలు సూచించిన విధంగా ఎటు పొమ్మంటే అటు వలసపోతూ అష్టకష్టాలు పడుతున్నారు.
తిండీ, నీళ్లూ కరువై, అంతంతమాత్రం వైద్య సదుపాయాలతో జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ఒక్కోటి 42 రోజులు (ఆరు వారాలు)ఉండే మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలవుతుందా, మధ్యలో తలెత్తగల సమస్యలేమిటి అన్న ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానాల్లేవు. హమాస్ చెరలో ఇంకా 94 మంది బందీలు మిగిలారని, వారిలో 34మంది మరణించివుండొచ్చని ఇజ్రాయెల్ అంచనా.
తొలి దశ అమల్లోవుండగా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగాలి. ఆ తర్వాత పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా 33 మంది బందీలను హమాస్ విడుదల చేస్తుంది. ఒకసారంటూ ఒప్పందం అమలు మొదలైతే ఇరువైపులా ఉన్న బందీలను దశలవారీగా విడుదల చేస్తారు. గాజాకు భారీయెత్తున సాయం అందటం ప్రారంభమవుతుంది. ఒప్పందం ప్రకారం తొలి దశ కొనసాగుతున్న దశలోనే ఇజ్రాయెల్ రెండోదశ కోసం హమాస్‌తో చర్చించటం మొదలెట్టాలి.
రెండో దశకల్లా బందీలతోపాటు దాడుల సందర్భంగా హమాస్‌కు చిక్కిన ఇజ్రాయెల్ ఆడ, మగ సైనికులు పూర్తిగా విడుదలవుతారన్నది అంచనా. అప్పుడు మొదలుకొని తొలి దశలో వున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వత కాల్పుల విరమణగా మారుతుంది. మూడో దశ అంతా పునర్నిర్మాణంపై కేంద్రీకరిస్తారు. హమాస్ బందీలుగా ఉంటూ మరణించినవారి మృత దేహాలను అప్పగించాలి.
కేవలం మొదటి దశకు మాత్రమే ప్రస్తుత ఒప్పందం పరిమితమనీ... కొత్తగా చర్చలు జరిగాకే రెండు, మూడు దశలకు సంబంధించి తుది నిర్ణయం ఉంటుందనీ ఇప్పటికే నెతన్యాహూ ప్రకటించారు. తొలి దశ పూర్తయ్యాక మళ్లీ యుద్ధం తప్పదన్న హామీ ఇవ్వకపోతే తమ ఆరుగురు మంత్రులూ తప్పుకుంటారని తీవ్ర మితవాదపక్ష నాయకుడు, జాతీయ భద్రతా మంత్రి బెన్‌గివర్ హెచ్చరించటం తీసిపారేయదగ్గది కాదు.
లెబనాన్‌లోని హిజ్బొల్లాతో ఉన్న రెండు నెలల కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. అక్కడ ఇరువైపులా కాల్పులు జరగని రోజంటూ లేదు. ఆ ఒప్పందం కూడా ఈనెల 26తో ముగుస్తుంది. ఇప్పుడు హమాస్‌తో కుదిరిన ఒప్పందం గతి కూడా అలాగే ఉంటుందా అన్నది ప్రశ్నార్థకం.
సిరియాలో అసద్ నిష్క్రమణ, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిమగ్నమైవుండటం, ఇరాన్ బల హీనపడటం, ట్రంప్ ఆగమనం వంటి పరిణామాలతో హమాస్‌లో పునరాలోచన మొదలయ్యాకే ఈ ఒప్పందానికి అంగీకరించింది. ఎనిమిదినెలల నాడు దాదాపు ఇవే షరతులు ప్రతిపాదిస్తే ఆ సంస్థ తిరస్కరించటం గమనార్హం.
మొత్తానికి పశ్చిమాసియా తెరిపిన పడటానికి అన్ని పక్షాలూ చిత్తశుద్ధి ప్రదర్శించటం అవసరం. దాడులతో ఎవరినీ అణిచేయలేమని ఇన్నాళ్ల చేదు అనుభవాల తర్వాతైనా ఇజ్రాయెల్ గుర్తిస్తే మంచిది. ఎన్ని లోటుపాట్లున్నా ఘర్షణలు అంతరించాలి. శాంతి చిగురించాలి.
Comments
Please login to add a commentAdd a comment