
వాషింగ్టన్: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో శిథిలమైన గాజాను స్వాధీనం చేసుకుని పునర్ నిర్మిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారింది కూడా. గాజాలో ఉన్న లక్షల మంది పాలస్తీనా ప్రజలు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా తరలి వెళ్లాల్సిందేనని అన్నారాయన. అయితే.. హఠాత్తుగా ఆయన యూటర్న్ తీసుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శిథిలమైన గాజాను పునర్ నిర్మించే ప్రణాళికలో భాగంగా ఎవరినీ బహిష్కరించమని ట్రంప్ ఇప్పుడు అంటున్నారు. బుధవారం ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్(Micheál Martin)తో ఆయన వైట్‌హౌజ్‌లో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గాజా నుంచి బహిష్కరణలు ఉండబోవని అన్నారు. ఈ సందర్భంగా.. యూఎస్ సెనెట్ మైనారిటీ నాయకుడు చక్ షూమర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించారాయన. గతంలో ఆయన(చక్ షూమర్) యూదుడైనప్పటికీ.. ఇప్పుడు మాత్రం పాలస్తీనియన్ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కిందటి నెలలో ఇదే అంశంపై ఆయన తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి చర్చకు దారి తీశారు కూడా.

అయితే.. గాజాలో మానవతా సాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఐరిష్ ప్రధాని మైకేల్ మార్టిన్ అభిప్రాయపడ్డారు. కాల్పుల విరమణతో పాటు హమాస్ చెరలోని బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చారు. అయితే ట్రంప్ గాజా ప్లాన్‌ను ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) తిరస్కరించింది. ప్రతిగా.. ఈజిప్ట్ ప్రతిపాదిస్తున్న ప్రణాళికకు మద్దతు ఇచ్చింది.
గాజా యుద్ధం.. మధ్యలో ఐర్లాండ్
గాజాలో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఐర్లాండ్‌కు మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. గతంలో.. గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతకు పాల్పడుతోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో దక్షిణాఫ్రికా ఓ కేసు వేయగా.. అందులో జోక్యం చేసుకోవాలని ఐర్లాండ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిగాకిందటి ఏడాది డిసెంబరులో ఐర్లాండ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు టెల్‌అవీవ్(ISRAEL) ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో ట్రంప్-మార్టిన్‌ల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక.. భవిష్యత్తు గాజా పేరిట ట్రంప్ పోస్ట్ చేసిన ఓ ఏఐ వీడియోనూ సైతం ట్రంప్ విడుదల చేయగా అది తీవ్ర విమర్శలకు తావు ఇచ్చింది. హమాస్ సంస్థ సైతం ట్రంప్ ఆలోచనలను తీవ్రంగా తప్పుపట్టింది. గాజా పాలస్తీనాలో విడదీయలేని భాగమని.. కొనుగోలు చేసి.. అమ్మడానికి అదేం స్థిరాస్తి కాదని ప్రకటించింది. అదే సమయంలో ఆ వీడియోను సృష్టించిన డిజైనర్.. అది కేవలం పొలిటికల్ సెటైర్ మాత్రమేనని ప్రకటన చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment