అరబ్ దేశాలకు ట్రంప్ హితవు
ఇజ్రాయెల్‌కు బాంబుల సరఫరా పునఃప్రారంభం
వాషింగ్టన్: ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సర్వం కోల్పోయి శరణార్థులుగా మారిన పాలస్తీనా పౌరుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. జోర్డాన్, ఈజిప్టుతోపాటు ఇతర అరబ్ దేశాలు వారికి ఆశ్రయ మివ్వాలని సూచించారు. వారి బాగోగులు చూసుకోవాలన్నారు. ఇజ్రాయెల్‌కు 2 వేల పౌండ్ల బరువైన బాంబుల సరఫరాను నిలిపివేస్తూ బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేశానని వెల్లడించారు. వాటిని శనివారమే ఇజ్రాయెల్‌కు అందజేశామని చెప్పారు.
గాజాను శుభ్రం చేయాలి
గాజా పూర్తిగా విధ్వంసానికి గురైన ప్రాంతమని, శిథిలాలను తొలగించి, శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కనుక ఎక్కువ మంది ప్రజలు బయటకు వెళితే కార్యాచరణ తేలికవుతుందన్నారు. గాజా పౌరులకు మరోచోట ఇళ్లు నిర్మించి ఇస్తే, అక్కడ వారు శాంతియుతంగా జీవనం సాగించగలరన్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ కార్యాలయం ఇంకా స్పందించలేదు. మరోవైపు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్‌కు అమెరికా బాంబులు సరఫరా చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మిగిలిన బందిలందరినీ విడుదల చేయకపోతే హమాస్‌పై మళ్లీ దాడులు ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది.
అసలు వ్యూహం అదేనా?
పాలస్తీనా శరణార్థులు అరబ్ దేశాలు అనుమతించాలనడం, ఇజ్రాయెల్‌కు అమెరికా బాంబులు సరఫరా చేయడం వెనుక మరో వ్యూహం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బందీల విడుదల పూర్తయిన తర్వాత గాజా నుంచి పాలస్తీనా పౌరులను బయటకు తరలించి, హమాస్ స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేయా లన్నదే అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం కావొచ్చని తెలుస్తోంది. గాజా నుంచి హమాస్ మిలిటెంట్లను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ఆ రెండు దేశాలు యోచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment