హమాస్‌పై పోరాటం చేస్తున్న ఇజ్రాయిల్‌కు భారీ విజయం దక్కింది. గాజాపై జరిపిన వైమానిక దాడిలో హమాస్ మిలిటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డెయిఫ్ మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ వెల్లడించింది. గత నెల జూలై 13న ఖాన్ యూనిస్ ప్రాంతంపై జరిపిన దాడిలో మహ్మద్ డెయిఫ్‌ను అంతమొందించినట్లు గురువారం ధృవీకరించింది. ‘
జూలైలో గాజా దక్షిణ ప్రాంతంలో జరిపిన దాడిలో మహమ్మద్ డెయిఫ్ చనిపోయాడు. ఈ విషయాన్ని మేము ఇప్పుడు ధృవీకరిస్తున్నాం’ అని ఇజ్రాయిల్ ఆర్మీ ఎక్స్‌లో తెలిపింది. కాగా అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడికి మహ్మద్ డెయిఫే ప్రధాన సూత్రధారిగా ఇజ్రాయిల్ భావిస్తోంది.
అయితే హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా ఇరాన్‌లో దారుణ హత్యకు గురైన మరుసటి రోజే ఇజ్రాయిల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియాతోపాటు సెక్యూరిటీ గార్డ్ సైతం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇజ్రాయిల్ ప్రమేయం ఉందని ఇరాన్ ఆరోపిస్తుంది.
ఇక జూలైలో ఖాన్ యూనిస్ ప్రాంతంపై ఇజ్రాయిల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో 90 మంది మృతి చెందారు. మరో 289 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్, మరో కీలక కమాండర్ రఫా సలామాలే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఆరోజు వీరు మరణించినట్లు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వీరిని హతం చేసినట్లు నిర్ధారించింది.
ఎవరీ మహ్మద్ డెయిఫ్
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ జరిపిన భారీ వైమానిక దాడి వెనక మహ్మద్ డెయిఫ్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఈ మరణకాండలో ఇజ్రాయిల్‌కు చెందిన 1200 మంది మరణించారు. దాదాపు 250 మందిని హమాస్ తమ వద్ద బందీలుగా పట్టుకుంది. ఈ ఘటనే ఇజ్రాయెల్-హమాస్‌ల యుద్ధానికి దారితీసింది. డెయిఫ్ ఏళ్లుగా ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.
గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో 1965లో డెయిఫ్ జన్మించాడు. పూర్తి పేరు మహమ్మద్ డియాబ్ ఇబ్రహీం అల్ మస్రీ. 1980ల చివర్లో హమాస్‌లో చేరాడు. డెయిఫ్ హమాస్ మిలిటరీ యూనిట్ ‘అల్ కస్సం బ్రిగేడ్’లో పనిచేశాడు. హమాస్ బాంబుల తయారీ నిపుణుడు అయ్యాష్‌కు సన్నిహితుడు. అతడు ఇజ్రాయెల్ దళాల చేతిలో హతమయ్యాక.. 2002లో హమాస్‌లోని మిలిటరీ వింగ్ బాధ్యతలు డెయిఫ్ చేపట్టాడు.
హమాస్ వాడే ‘కస్సాం’ రాకెట్ల తయారీ వెనుక కీలక పాత్ర పోషించాడు. ఇజ్రాయెల్ దళాలకు తలనొప్పిగా మారిన గాజా టన్నెల్ నెట్‌వర్క్ నిర్మాణం వెనుక మాస్టర్ మైండ్ కూడా ఇతడే. ఇజ్రాయెల్ దళాలకు చిక్కకుండా ఎక్కువ సమయం ఆ సొరంగాల్లోనే గడుపుతాడని సమాచారం. ఇప్పటి వరకు డెయిఫ్‌పై ఇజ్రాయెల్ దళాలు ఏడుసార్లు దాడులు చేయగా ప్రతిసారీ తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షానికి రూపకర్త కావడంతో మరోసారి కోసం తీవ్రంగా జల్లెడ పట్టిన ఇజ్రాయెల్.. ఎట్టకేలకు అతడిని హతమార్చింది.
Comments
Please login to add a commentAdd a comment