ఉగ్రనిధులకు అడ్డుకట్ట
యూఎస్ భద్రతా మండలి తీర్మానం
వాషింగ్టన్: ఐసిస్, అల్‌కాయిదా వంటి ఉగ్ర సంస్థలకు నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం చేసింది. భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో.. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందుతున్న పద్ధతులు, తదితర అంశాలపై చర్చించారు. ప్రైవేటు సంస్థల ద్వారా ఉగ్ర నిధుల ప్రవాహం జరుగుతున్నదని, దీనికి అంతర్జాతీయ సహకారంతో అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు.
భారత్‌పై కుట్రలను పాక్ అడ్డుకోలేదు
తాలిబాన్లపై పోరాటానికే పాకిస్తాన్ ఎక్కువ దృష్టి కేంద్రీకరించిందని పాకిస్తాన్‌లో అమెరికా రాయబారిగా పనిచేసిన రిచర్డ్ జీ ఒస్లోన్ తెలిపారు. సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులతో మాట్లాడుతూ.. భారత్, ఆఫ్ఘనిస్తాన్‌లలో దాడులకు పాక్‌లోనే వ్యూహరచనలు చేస్తున్న ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకోలేదన్నారు. పాక్ అంతర్గత ఉగ్ర ప్రమాదాలపై మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని.. ఉత్తర వజీరిస్తాన్‌లో ఉగ్రవాద గ్రూపులు లేకుండా చేసిందని పేర్కొన్నారు.
ప్రతి 122 మందిలో ఒకరు శరణార్థి
జెనీవా: యుద్ధం, హింసల కారణంగా ఇళ్లు, ఊళ్లు, దేశాలు వదిలి నిర్వాసితులుగా, శరణార్థులుగా మారుతున్న వారి సంఖ్య ఈ ఏడాది ఆరు కోట్లు దాటిపోనుందని ఐరాస వెల్లడించింది. భూగళంపై ప్రతి 122 మందిలో ఒకరు శరణార్థిగానో నిర్వాసితుడిగానో బతుకుతున్నారని తాజా నివేదికలో పేర్కొంది.
పారిశుధ్యం ఇక హక్కు: రక్షిత మంచి నీటి హక్కు సరసనే ‘పారిశుధ్యం హక్కు’ను కూడా గుర్తిస్తూ ఐరాస తీర్మానాన్ని ఆమోదించింది.