![Omar Abdullah, Mehbooba Mufti booked under Public Safety Act - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/10/jk.jpg.webp?itok=WBi8NkXR)
ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ
శ్రీనగర్: ‘మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(49) ప్రజలను ప్రభావితం చేసే శక్తి ఉంది... మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ(60) నిషేధిత ఉగ్రసంస్థకు మద్దతు ప్రకటించారు’ ఈనెల 6వ తేదీన ఒమర్, మెహబూబాను ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) కింద నిర్బంధంలోకి తీసుకున్నట్లు ప్రకటించిన పోలీసులు.. అందుకు కారణాలను తెలుపుతూ రూపొందించిన నివేదికలోని అంశాలివి. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రకటించిన కేంద్రం.. ఒమర్, మెహబూబాలతోపాటు మరికొందరు నేతలను నిర్బంధించడంతోపాటు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
డిటెన్షన్ గడువు (ఆరు నెలలు) ముగియడానికి కొన్ని గంటల ముందు వీరిద్దరినీ పోలీసులు పీఎస్‌ఏ కింద నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ చట్టం కింద వీరిని మూడు నెలలపాటు నిర్బంధంలో ఉంచొచ్చు. ఇప్పటికే ఒమర్ తండ్రి, కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాను ఈ చట్టం కింద నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ‘ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒమర్‌కు ప్రజల్లో పలుకుబడి ఉంది. రాష్ట్రంలో ఉగ్రవాదం ప్రబలంగా ఉన్న సమయంలో ఎన్నికలను బహిష్కరించాలంటూ ఉగ్రవాద సంస్థలు పిలుపు నిచ్చినప్పటికీ ప్రజలను ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రభావితం చేయగలిగారు.
కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నించారు’ అని ఆ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఒమర్ చేసిన కామెంట్లను మాత్రం అందులో ప్రస్తావించలేదు. ‘పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అయిన మెహబూబా ‘ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడారు. కశ్మీర్‌ను భారత్ అన్యాయంగా ఆక్రమించుకుందని వ్యాఖ్యానించారు. నిషేధిత జమాతే ఇస్లామియా సంస్థకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు’ అని పోలీసులు ఆ నివేదికలో పేర్కొన్నారు.
ఇంటర్నెట్‌పై తాత్కాలిక నిషేధం
కశ్మీర్‌లో ఆదివారం ఉదయం ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించిన యంత్రాంగం సాయంత్రానికి ఆంక్షలు సడలించింది. పార్లమెంట్‌పై ఉగ్రదాడి ఘటనలో దోషి అఫ్జల్ గురుకు ఉరి శిక్ష అమలై ఏడేళ్లవుతున్న సందర్భంగా వేర్పాటువాద సంస్థ జేకేఎల్‌ఎఫ్ ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్‌ను బంద్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment