ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ(పీడీపీ)లపై కఠినమైన ప్రజా భద్రత చట్టం(పబ్లిక్ సేఫ్టీ యాక్ట్–పీఎస్‌ఏ) కింద గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. వారిద్దరి ఆరు నెలల ముందస్తు నిర్బంధం ముగియడానికి కొన్ని గంటల ముందు వారిపై ఈ కేసు పెట్టడం గమనార్హం. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన 2019, ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆ ఇద్దరు నేతలు గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. పోలీసులతో పాటు వచ్చిన మెజిస్ట్రేట్ సంబంధిత నోటీసులను వారి నివాసాల్లో ఆ ఇద్దరు నేతలకు అందించారు.
ఆ ఇద్దరితో పాటు శ్రీనగర్‌లో మంచి పట్టున్న నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అలీ మొహమ్మద్ సగర్‌పై, పీడీపీ కీలక నేత సర్తాజ్ మదానీపై కూడా పీఎస్‌ఏ కింద నోటీసులు జారీ చేశారు. మదానీ మెహబూబా ముఫ్తీకి మామ అవుతారు. పీఎస్‌ఏలోని ‘పబ్లిక్ ఆర్డర్’ సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా ఆరు నెలలు, ‘రాజ్య భద్రతకు ప్రమాదం’ అనే సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా రెండు సంవత్సరాల వరకు అనుమానితులను నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టం ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందింది. ముఖ్యంగా కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment