మెహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తిజా జావేద్(ఫొటో కర్టెసీ: ఎన్డీటీవీ)
శ్రీనగర్ : ‘మా అమ్మను నిర్బంధంలో ఉంచారు. పార్టీ కార్యకర్తలు, న్యాయవాదులు.. ఆఖరికి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేందుకు ఆమెకు అనుమతి లేదు’ అంటూ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి కుమార్తె ఇల్తిజా జావేద్ ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయాల నేపథ్యంలో మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆర్టికల్ 370, 35ఏ రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేశారు. ఇక రాష్ట్ర పునర్విభజన బిల్లు సభలో ప్రవేశపెట్టే సమయానికి వారిద్దరిని అదుపులోకి తీసుకుని శ్రీనగర్‌లో ఉన్న ప్రభుత్వ అతిథి గృహానికి తరలించారు.
ఈ క్రమంలో..‘ కశ్మీరీల పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల గురించి గళం విప్పేందుకు మా అమ్మకు ఉన్న అన్ని దారులు మూసివేశారు. ఇలా చేయడం ద్వారా ప్రజలను భయాందోళనకు గురిచేశారు. మా అమ్మతో మాట్లాడేందుకు, కనీసం చూసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. హరినివాస్‌లో ఆమెను బంధించారు. వారు చేసే పని సరైందే అయినపుడు నిర్బంధించడం ఎందుకు. ఈ విషయం కేవలం మా అమ్మ లేదా ఒమర్ అబ్దుల్లాకు మాత్రమే సంబంధించినది కాదు. సాధారణ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ప్రజాప్రతినిధులను బందిపోట్లలా, నేరస్తుల్లా చూడటం వారికే చెల్లింది. వారు తీసుకుంటున్నవి చట్ట వ్యతిరేక నిర్ణయాలు కాబట్టే ఇలా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఇల్తిజా ఎన్డీటీవీకి ఇచ్చిన ఆడియో మెసేజ్‌లో మోదీ సర్కారు తీరును విమర్శించారు.
కాగా జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. మంగళవారం లోక్‌సభలో హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు- 2019కు అనుకూలంగా 370 మంది, వ్యతిరేకంగా 70 సభ్యులు ఓటు వేశారు. ఇక జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్‌సభ ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 351 మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. ఒకరు సభకు గైర్హాజరు కాగా.. తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment