సాక్షి, సిటీబ్యూరో : ఉగ్ర బాట పడుతున్న కొందరు నగర యువకులు తమ భవిష్యత్తును చేజేతులా కాల రాసుకుంటున్నారు. పోలీసు తూటాలకు బలై... అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. పదిహేనేళ్ల కాలంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 14 మంది మృతి చెందడమే దీనికి నిదర్శనం. బాబ్రీ విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకునేందుకంటూ ఏర్పడిన తన్జీమ్-ఇస్లా-ఉల్-ముస్లమీన్ (టీ ఐఎం) నుంచి లష్కర్-ఎ-తోయిబా (ఎల్‌టీ), ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం), తెహరిక్-గల్భా-ఎ-ఇస్లాం (టీజీఐ), ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్), హిజబుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలతో నగర యువకులు సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఇందులో కొందరు పాకిస్తాన్, బంగ్లాదేశ్, దుబాయ్‌లకు పారిపోయి అక్కడి నుంచి ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించారు. ఈ తరహా దారుణాలలో పాలు పంచుకున్న 14 మంది వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించారు. అంతకుముందు 1993 జూలైలో పాతబస్తీకి చెందిన ఫసియుద్దీన్ నగరంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.
ఇవీ సంఘటనలు..
2000వ సంవత్సరం ఏప్రిల్‌లో నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తన్జీమ్- ఇస్లా- ఉల్- ముస్లమీన్ (టీ ఐఎం) వ్యవస్థాపకుడు ఆజంఘోరి చనిపోయాడు.
2002 నవంబర్‌లో దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల నిందితుల్లో ఒక డైన సయ్యద్ అజీజ్ కరీంనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.
అజీజ్ ఎన్‌కౌంటర్ జరిగిన రెండు రోజులకే ఉప్పల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరోనిందితుడు, మాదన్నపేటకుచెందిన ఆజంఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.
2003 సెప్టెంబర్ 12న ముంబ యిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బార్కాస్‌కు చెందిన హసన్ ఆమూది, కింగ్‌కోఠి షేర్‌గేట్‌కు చెందిన మరో యువకుడు మృతి చెందాడు.
2003లో కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నగరానికి చెందిన మిర్జాఫయాజ్ బేగ్ మృతి చెందాడు. అంతకుముందు కొద్ది నెలల క్రితం పోలీసు ఎస్కార్ట్ కళ్లు గప్పి, నాంపల్లి కోర్టు నుంచి పారిపోయాడు.
అక్టోబర్ 31, 2004లో లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయంలో గుజరాత్ పోలీసులు తెహరిక్ తౌఫుజ్ షాహరే ఇస్లామ్ (టీటీఎస్‌ఐ) మౌలానా నసీరుద్దీన్‌ను అరెస్టు చేసే సమయంలో కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ సమయంలో జరిపిన కాల్పుల్లో ముజాహిద్దీన్ సలీం మృతి చెందాడు.
2006 మార్చి 14న ఢిల్లీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్-ఏ-తోయిబా నేత, ఎల్బీనగర్‌కు చెందిన గులామ్ ఎజ్దానీ మృతి చెందాడు.
2007 ఆగస్టు 28న పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్-ఏ-తయిబా దక్షిణ భారతదేశ ఇన్‌చార్జి, మూసారాంబాగ్‌కు చెందిన షాహిద్ బిలాల్, అతని సోదరుడు సమద్‌లు మృతి చెందారు.
2015 ఏప్రిల్ 7న ఆలేరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికార్, అమ్జద్, జకీర్, డాక్టర్ హనీఫ్ మరణించారు.
15 ఏళ్లు.. 14 ప్రాణాలు
Published Thu, Apr 9 2015 12:20 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM
Advertisement