![Sakshi Guest Column On Terrorism](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/223.jpg.webp?itok=g0oJaVZz)
విశ్లేషణ
ఆధునిక మానవుడు సాధించిన ఎన్నో ఘన విజయాలకు, సాధించుకున్న సామాజిక ప్రశాంతతకు భంగం కలిగించడంలో ఉగ్రవాదం పెనుసవాలుగా మారింది. గడచిన రెండువందల ఏళ్ల కాలంలో వివిధ దేశాల్లో పుట్టుకొచ్చిన 400కు పైగా టెర్రర్ గ్రూపుల పైన, అవి రూపాంతరం చెందడం, అంతమవడం పైన సమగ్ర అధ్యయనం చేశారు ప్రొ‘‘ ఆడ్రీ కుర్త్ క్రోనిన్. ప్రస్తుతం ఆమెరికాలోని ‘కార్నెగీ మెలన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటెజీ అండ్ టెక్నాలజీ’ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
గత చరిత్రను తవ్వి తీసి ఆమె చేసిన పరిశోధనలో ఉగ్ర భూతాన్ని అంతమొందించడంపై విలువైన సమాచారం ఉంది. ఆమె రాసిన ‘హౌ టెర్రరిజమ్ ఎండ్స్: అండర్‌స్టాండింగ్ ద డిక్లయిన్ అండ్ డిమైస్ ఆఫ్ టెర్రరిస్ట్ క్యాంపెయిన్స్’ పరిశోధన గ్రంథాన్ని ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ ప్రెస్ 2011లో ప్రచురించింది. ఉగ్రవాద సంస్థలు అంతమయ్యే ఆరు మార్గా లను తన అధ్యయనంలో గుర్తించారామె. అవి:
1) ఉగ్ర సంస్థల అగ్రనేతలను భౌతికంగా అంతమొందించడం. 2) సంప్రతింపుల ద్వారా టెర్రరిస్టు గ్రూపు డిమాండ్ల పరిష్కారం. 3) రాజ్యంపై ఉగ్రవాద సంస్థ పైచేయి సాధించడం ద్వారా తానే రాజ్యం కావడం (ఉదా: తాలిబన్ ప్రభుత్వం). 4) అంతర్గత కలహాలతో పతనమవడం. 5) మిలిటరీ దాడులతో చెల్లాచెదురవడం. 6) ఉగ్ర సంస్థ తనకు తానుగా పంథా మార్చుకుని రాజకీయ పార్టీగా అవత రించడం.
ఉగ్రవాద నేతల అంతం విషయంలో ఒక పద్ధతి పైస్థాయి నేతలను అడ్డు తొలగించుకోవడం. ఉదా: ఒసామా బిన్ లాడెన్‌ను చంపడం. బిన్ లాడెన్ తర్వాత అల్‌ఖైదాకు నేతృత్వం వహించిన అల్ జవహిరిని కూడా అమెరికా 2022లో కాబూల్‌లో డ్రోన్ దాడితో అంతమొందించింది. ఇదంతా ఉగ్రవాద భూతం తల నరికేయడమన్న మాట!
ఇరాన్ ఎజెండాను అమలు చేసే ప్రాక్సీ గ్రూపులు హమాస్, హెజ్బొల్లాలకు చెందిన పలువురు కీలక నేతలను మట్టుబెట్టడం ద్వారా ఇజ్రాయెల్ ఇదే పని చేస్తోంది. ఇంకో ఉదాహరణ మన పొరుగున ఉన్న శ్రీలంకకు చెందిన ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్’ (ఎల్‌టీటీఈ)! 2009లో వేలుపిళ్లై ప్రభాకరన్ మరణంతో ఒకప్పుడు ఆ దేశం మొత్తాన్ని గడగడ వణికించిన ఉగ్రవాద సంస్థ కాస్తా నిర్వీర్యమైపోయింది.
ప్రత్యేక దేశం కోసం పంజాబ్‌లో మొదలైన ‘ఖలిస్తాన్’ ఉగ్రవాదం 1980లో పతాక స్థాయికి చేరిన విషయం అంద రికీ తెలిసిందే. 1984లో స్వర్ణ దేవాలయం నుంచి ఉగ్ర వాదులను ఏరివేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’, ఆ తరువాత 1988లో చేపట్టిన మరో మిలిటరీ చర్య ‘ఆపరేషన్ బ్లాక్ థండర్’ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థను నిర్మూలించాయి.
ఈ మధ్యే సిరియాలో అధికార మార్పిడి జరిగింది. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి రష్యాకు పారిపోయాడు. బషర్ వైరి పక్షాలకు అమెరికా, ఇజ్రా యెల్‌లు పరోక్ష మద్దతునివ్వడం వల్లనే ఇది సాధ్యమైంది. ఈ రెండు దేశాలూ కొన్ని గ్రూపులకు ప్రత్యక్షంగా మరి కొన్నింటికి పరోక్షంగా సాయం చేశాయి. అయితే బషర్ అల్–అసద్ పాలన అంతమై పోవడం కాస్తా ఆ ప్రాంతంలో ఇరాన్ ప్రాభవం తగ్గేందుకు కారణమైంది. ఉగ్రవాద భూతాన్ని ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం అనేందుకు ఇజ్రాయెల్ కోవర్టు ఆపరేషన్లు ఒక నిదర్శనం.
ఉగ్రవాదాన్ని అణచివేసే మార్గాల్లో కీలకమైంది చర్చలు. ఉత్తర ఐర్లాండ్‌లో ‘గుడ్‌ఫ్రైడే అగ్రిమెంట్’ కావచ్చు, అఫ్గానిస్తాన్‌లోని ఇటీవలి పరిణామాలు కావచ్చు... ఉగ్రవాద సంస్థలను ప్రభుత్వ పాత్రల్లోకి మార్చే క్రమంలో వచ్చే సంక్లిష్టతలు, సమస్యలకు దర్పణం పడతాయి. అయితే సందర్భాన్ని బట్టి చేపట్టే చర్చల వ్యూహాలు, ప్రణాళికలు వాటి అమలు వంటివి జయాపజయాలను నిర్ణయిస్తూ ఉంటాయి.
ఉగ్రవాద సంస్థల లోపల ఉన్న వైరుద్ధ్యాలను గుర్తించడం, ప్రజల మద్దతు లేకుండా చేయడం వంటివి సంస్థ లను విడదీసేందుకు బాగా ఉపయోగపడతాయి. ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేవారు... ఈ అంతర్గత వైరుద్ధ్యాలకు ఆజ్యం పోయగలవారై ఉండాలి. మత విశ్వాసాలే ఇంధనంగా మనుగడ సాగించే ఉగ్ర సంస్థలను కేవలం మిలిటరీ,కౌంటర్ టెర్రరిస్ట్ చర్యలతో సమూలంగా నాశనం చేయలేం. చర్చలు జరపడం, వాటి డిమాండ్లు న్యాయబద్ధమైనవైతే అంగీకరించడం, అది వీలుకాని సందర్భంలో వాటిలో చీలికలు తీసుకువచ్చి బలహీన పర్చడం చేయొచ్చు.
డా‘‘ క్రోనిన్ పరిశోధన ప్రకారం... ఉగ్రవాద సంస్థల జీవిత కాలం ఐదు నుంచి పదేళ్లు మాత్రమే. కొన్ని ఇంతకంటే ఎక్కువ కాలం ఉనికిలో ఉండవచ్చు. విధాన రూపకర్తలు ఉగ్రవాద సంస్థల విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవడం మేలని ఆమె సూచి స్తున్నారు. సైబర్ టెర్రరిజమ్, దేశాలు ప్రేరేపించే ఉగ్ర వాదాల వంటి సంక్లిష్ట అంశాల విషయంలో దీని ప్రాధాన్యం మరింత ఎక్కువ.
ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న దేశాలకు డా‘‘ క్రోనిన్ పరిశోధన ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. స్థూలంగా చెప్పాలంటే... ఓపిక, పరిస్థితులకు అనుగుణంగా మార్చు కోవాల్సిన అవసరం, సమస్యను సమగ్రంగా అర్థం చేసు కోవడం కౌంటర్ టెర్రరిజమ్ వ్యూహాల రూపకల్పనలో చాలా కీలకమని ఈ పరిశోధన చెబుతుంది.
విధాన రూపకర్తలు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆధునిక రూపం సంతరించుకున్న ఉగ్రవాద భూతానికి పగ్గాలు వేసేందుకు సమర్థమైన చర్యలు చేపట్టాలి. భారీ నెట్‌వర్క్‌లు ఉన్న వాటితోపాటు... వ్యక్తులు కూడా ఉగ్రవాదానికి పాల్పడుతున్న ఈ కాలంలో క్రోనిన్ పరిశోధన ఉగ్రవాదాన్ని పునాదులతోపాటు పెకిలించే వ్యూహానికి విలువైన సూచనలు ఇస్తోంది.
బి.టి. గోవిందరెడ్డి
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment