న్యూఢిల్లీ: ఇతరదేశాలపై ఉగ్రదాడులు చేసేందుకు అఫ్గాన్ భూభాగం ఉపయోగపడకుండా నిరోధించాలని బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. సీమాంతర ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాలపై పోరాడాలని పిలుపునిచ్చాయి. ఆన్‌లైన్‌లో భారత ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 13వ బ్రిక్స్ సమావేశం జరిగింది. అఫ్గాన్‌లో పరిస్థితులతో పాటు ఇతర కీలక పరిణామాలపై సభ్యదేశాలు విస్తృత చర్చలు జరిపాయి. సమావేశంలో రష్యా అధిపతి పుతిన్, చైనా ప్రెసిడెంట్ జింగ్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రమఫోసా, బ్రెజిల్ అధినేత బోల్సనారో ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు.
సదస్సు చివరలో అన్ని దేశాలు కలిసి ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశాయి. అఫ్గాన్‌లో పరిస్థితులు శాంతియుతంగా ముగియాలని డిక్లరేషన్‌లో కోరాయి. అఫ్గాన్‌లోని అన్ని వర్గాల మధ్య సామరస్య చర్చలు సాగాలని, తద్వారా దేశంలో శాంతి, స్థిరత్వం రావాలని ఆకాక్షించాయి. ఇటీవల కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన దాడులను బ్రిక్స్ దేశాలు ఖండించాయి. ఏవిధమైన ఉగ్రకార్యకలాపాలకు అఫ్గాన్ స్థావరంగా మారకూడదని కోరాయి.
టెర్రరిజం ఏరూపంలో ఉన్నా గట్టిగా ఎదుర్కోవాలన్నదే తమ అభిమతమని చెప్పాయి. బ్రిక్స్ దేశాల భద్రతా సంస్థలు రూపొందించిన కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్‌ను ఆమోదించాయి. టెర్రరిజానికి మతం, జాతీయత, వర్గం రంగు పులమకూడదని బ్రిక్స్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై రెండు నాల్కల ధోరణిని వ్యతిరేకిస్తామని, ఐరాస నిబంధనల మేరకు రూపొందించి సీసీఐటీ అమలు చేయాలని బ్రిక్స్‌దేశాలు తమ డిక్లరేషన్‌లో కోరాయి.
కౌంటర్ టెర్రరిజం ప్లాన్
బ్రిక్స్ దేశాలు రూపొందించుకున్న కౌంటర్ టెర్రరిజం యాక్షన్ ప్లాన్‌కు ఆమోదం లభించిందని ప్రధాని మోదీ చెప్పారు. బ్రిక్స్ చైర్మన్‌గా భారత్ ప్రస్తుతం వ్యవహరిస్తోంది. తమ పాలనా కాలంలో ఇతర నాలుగు దేశాలు మంచి సహకారం అందించాయని ప్రధాని ప్రశంసించారు. ‘ప్రపంచంలోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ప్రభావశీల గళంగా మారాము. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆకాంక్షలకు ప్రాధాన్యమివ్వడానికి బ్రిక్స్ ఉపయోగపడుతోంది’’అని మోదీ చెప్పారు. బ్రిక్స్ సాధించిన పలు విజయాలను ఆయన వివరించారు.
న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్, కంటింజన్సీ రిజర్వ్ అరేంజ్‌మెంట్, ఎనర్జీ రిసెర్చ్ కోఆపరేషన్ ప్లాట్‌ఫామ్‌లాంటి బలమైన సంస్థలను బ్రిక్స్ దేశాలు ఏర్పరుచుకున్నాయన్నారు. వచ్చే 15ఏళ్లలో మరిన్ని విజయాలు సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాజా సమావేశం బ్రిక్స్ చరిత్రలో తొలి డిజిటల్ సదస్సని గుర్తు చేశారు. నవంబర్‌లో బ్రిక్స్ దేశాల జలవనరుల మంత్రుల తొలి సమావేశం జరుగుతుందని చెప్పారు. ఐదు దేశాల కస్టమ్స్ శాఖల మధ్య సమన్వయం పెరగడంతో బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం సులభతరంమవుతోందన్నారు. గ్రీన్ టూరిజం, ఆన్‌లైన్ టీకా ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటువంటి వాటిపై బ్రిక్స్ దేశాలు దృష్టి పెట్టాయని చెప్పారు.
ఎవరేమన్నారంటే..: బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ వేదికపై గణనీయమైన శక్తిగా మారాయని చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ కొనియాడారు. సభ్యదేశాల మధ్య మరింత లోతైన సహకారం అవసరమని, అప్పుడే ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనే పటిష్టమైన భాగస్వాములుగా మారతామని చెప్పారు. ప్రజారోగ్యాలను బలోపేతం చేయడంలో సహకారం, టీకాలపై అంతర్జాతీయ సహకారం, ఆర్థిక సహకారం, రాజకీయ, రక్షణ సహకారం, ప్రజా సంబంధాలు పెంపొందించడమనే ప్రతిపాదనలతో బ్రిక్స్ బలపడుతుందని వివరించారు. అఫ్గాన్‌లో నూతన సంక్షోభానికి అమెరికా, దాని మిత్రదేశాలు కారణమయ్యాయని రష్యా అధిపతి పుతిన్ విమర్శించారు. బ్రిక్స్ దేశాలు అఫ్గాన్‌పై ప్రత్యేకశ్రద్ధ పెట్టాలని, ఉగ్రకార్యక్రమాలకు, డ్రగ్స్‌కు ఆదేశం అడ్డాగా మారకుండా చూడాలని కోరారు. కోవిడ్ కట్టడి విషయంలో సమష్టి స్పందనను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా కొనియాడారు. బ్రెజిల్, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బాగుందని బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో చెప్పారు.
బ్రిక్స్ విశేషాలు
► ఈ సంవత్సరం బ్రిక్స్ థీమ్ ‘‘ఇంట్రా బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యుటీ, కన్సాలిడేషన్, కన్సెస్’’.
► ప్రపంచ జనాభాలో 41 శాతం వాటా, ప్రపంచ జీడీపీలో 24 శాతం భాగస్వామ్యం, అంతర్జాతీయ వాణిజ్యంలో 16 శాతం వాటా బ్రిక్స్ దేశాలదే.
► 2006లో తొలిసారి బ్రిక్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్‌గా మారింది.
► 2009లో తొలి బ్రిక్ సమావేశం రష్యాలో జరిగింది.
► బ్రిక్ అనే పదం రూపకల్పన రూపా పురుషోత్తమన్ చేశారు. కానీ క్రెడిట్ మాత్రం జిమ్ ఓ నీల్‌కు వచ్చింది.
► బ్రిక్స్ ప్రధాన కార్యాలయం చైనాలోని షాంగైలో ఉంది.
► 14వ బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షత వహించనుంది.
► ఏటా ఒక దేశం బ్రిక్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తుంది. 2016లో మోదీ బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షత వహించారు.
Comments
Please login to add a commentAdd a comment