ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దు
- పాక్‌కు భారత్, అఫ్గాన్ హెచ్చరిక
- అఫ్గాన్‌కు రూ. 6,689 కోట్ల ఆర్థిక సాయం
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్, అఫ్గానిస్తాన్ సంయుక్తంగా పోరాడాలని నిశ్చయించుకున్నాయి. ఆసియాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి వ్యతిరేకంగా కలసి పనిచేయాలని తీర్మానించాయి. తద్వారా పాకిస్తాన్‌కు పరోక్షంగా హెచ్చరిక జారీ చేశాయి. అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఆయనకు భారతదేశ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన హైదరాబాద్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఉగ్రవాదంపై ఇరు దేశాలు కలసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించారు. ఉగ్రవాదులకు సాయాన్ని, నిధులను అడ్డుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలపై పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
అఫ్గాన్ అభివృద్ధికి..
ఈ సందర్భంగా అఫ్గానిస్తాన్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,689 కోట్లు) ఆర్థిక సాయాన్ని మోదీ ప్రకటించారు. అఫ్గాన్‌లో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, విద్యుత్, మౌలిక సౌకర్యాల కల్పన తదితర అంశాల్లో అభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. చర్చల అనంతరం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఇరు దేశాలు మూడు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపారు. నేరస్తులను పరస్పరం మార్పిడి చేసుకోవాలని, పౌర, వాణిజ్య అంశాల్లో సహకరించుకోవాలని ఒప్పందాలు చేసుకోవడంతోపాటు ఆవల ఉన్న స్థలాన్ని శాంతియుతంగా ఉపయోగించుకొనేందుకు సహకరించుకోవాలని ఇరు దేశాలు ఎంవోయూ కుదుర్చుకున్నట్టు జైశంకర్ తెలిపారు.
సౌర విద్యుత్, మందులను స్వల్ప ధరలకు అఫ్గాన్‌కు అందిస్తామని మోదీ హామీ ఇచ్చినట్టు ఆయన వివరించారు. అఫ్గాన్ దీర్ఘకాలిక డిమాండ్ అయిన రక్షణ పరికరాల సరఫరాపై వైఖరేంటన్న ప్రశ్నకు జైశంకర్ స్పందిస్తూ.. ఉగ్రవాద వ్యతిరేక పోరుకు వీలుగా భారత్-అఫ్గానిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం ప్రకారం భద్రత, రక్షణ చర్యలను పటిష్టం చేయాలని ఇరువురు నాయకులు చర్చించినట్లు తెలిపారు. దీనిపై ఇటీవల భారత పర్యటనకు వచ్చిన అఫ్గానిస్తాన్ సైనిక దళాల ముఖ్య అధికారి చర్చించార న్నారు. గోధుమల కొరతతో ఇబ్బంది పడుతున్న అఫ్గాన్‌కు 1.75 లక్షల టన్నుల గోధుమలను భారత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు.